వెలగపూడి వెళ్లేందుకు వాయిదా పడ్డ ముహూర్తం
- 29 నాటి ముహూర్తాన్ని వాయిదా వేసిన సర్కారు
- తాజాగా వచ్చే నెల 4, 7, 10 తేదీలు ఖరారు
- ఉద్యోగులు ఏదో ఒక తేదీ ఎంచుకోవాలని ఆదేశం
సాక్షి, హైదరాబాద్ : వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయానికి ఉద్యోగులు తరలివెళ్లే ముహూర్తం వాయిదాపడింది. తాజా ముహూర్తాలుగా ఆగస్టు 4, 7, 10వ తేదీలను ప్రభుత్వం ఖరారు చేసింది. సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లింగరాజు పాణిగ్రాహి బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మూడు ముహూర్తాల్లో ఏదో ఒక ముహూర్తాన్ని ఎంచుకుని హైదరాబాద్ సచివాలయం నుంచి వెలగపూడికి శాఖలు తరలివెళ్లాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. తమ శాఖల మంత్రులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులకు సూచించారు. కృష్ణా పుష్కరాల ముందు హడావుడిగా మరోసారి ముహూర్తాలు నిర్ణయించడంపై ఉద్యోగులు మండిపడుతున్నారు.
గత నెల 29వ తేదీన వెలగపూడి వెళ్లి కొబ్బరికాయ కొట్టి వచ్చేసిన శాఖల ఉద్యోగులు.. ఇంకా హైదరాబాద్ సచివాలయం నుంచే పనిచేస్తున్నారని, ఈ పరిస్థితుల్లో మిగతా శాఖలు వచ్చే నెలలో తరలివెళ్లాలని ఆదేశాలు జారీ చేయడం ఏమిటని అంటున్నారు. అప్పుడు కూడా కొబ్బరికాయ కొట్టి వచ్చేయడం తప్ప ప్రయోజనం ఉండదని పేర్కొంటున్నారు. సచివాలయ నిర్మాణం పూర్తిచేసి, పనిచేసే వాతావరణం కల్పిస్తే వెళ్లడానికి సిద్ధమేనని, అలా కాకుండా కొబ్బరికాయ కొట్టి వచ్చేయడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు.
విద్యుత్, మంచినీరు, మరుగుదొడ్ల వంటి సౌక ర్యాలన్నీ కల్పించిన తర్వాత ముహూర్తం పెడితే వెళ్లి అక్కడినుంచే పనిచేస్తామని అంటున్నారు. డిసెంబర్ నెలాఖరుకు గానీ అక్కడ పనిచేసే వాతావరణం ఉండదని వారు అభిప్రాయపడుతున్నారు. తాత్కాలిక సచివాలయానికి శాఖలు, ఉద్యోగుల తరలింపు ఇప్పటికి పలుసార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. అఖరికి ఈ నెల 29వ తేదీ చివరి ముహూర్తం అని ప్రభుత్వం పేర్కొంది. ఇప్పుడు 29 కూడా కాదని వచ్చే నెలలో ముహూర్తాలు ఖరారు చేసింది. సచివాలయ నిర్మాణ పనులు ఇంకా పూర్తికాకపోవడమే వాయిదాకు కారణమని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి.