కూల్చేద్దాం.. కట్టేద్దాం..!
* నేడు కొట్టేది యనమల టెంకాయ్ ఒక్కటే...
* సచివాలయంలో ప్రవేశానికి మిగతా మంత్రులు ససేమిరా..
* ఇరుకు చాంబర్లలో పని చేయలేం
* మార్పులు చేసేదాకా అడుగుపెట్టబోమని స్పష్టీకరణ
* చాంబర్లను కూల్చి, పునర్నిర్మించాలని నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగులంతా సొంత రాష్ట్రంలోనే పని చేయాలంటూ ప్రభుత్వం గుంటూరు జిల్లా వెలగపూడిలో హడావుడిగా నిర్మించిన తాత్కాలిక సచివాలయంపై ఉద్యోగులే కాదు, మంత్రులూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సచివాలయంలో తమకు కేటాయించిన చాంబర్లు ఇరుకిరుగ్గా ఉన్నాయని, అందులో పనిచేయలేమని పలువురు మంత్రులు తేల్చిచెప్పారు.
ఆ చాంబర్లలో కనీసం ఐదుగురు కూడా కూర్చునే పరిస్థితి లేదని మండిపడుతున్నారు. తమకు పెద్ద చాంబర్లను కేటాయించే వరకూ సచివాలయంలో అడుగుపెట్టబోమని స్పష్టంచేశారు. బుధవారం జరగాల్సిన సచివాలయ ప్రవేశ ముహూర్తాలను వాయిదా వేసుకున్నారు. ఈ నేపథ్యంలో మంత్రుల చాంబర్లను కూల్చివేసి, మరింత పెద్దగా పునర్నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. ఆర్థిక మంత్రి యనమల కు కేటాయించిన చాంబర్ మాత్రమే కాస్త విశాలంగా ఉన్నట్లు సమాచారం. బుధవారం ఆయన ఒక్కరే సచివాలయ ప్రవేశం చేయనున్నారు. యనమల కొబ్బరికాయ కొట్టి వచ్చేస్తారని అధికారులు తెలిపారు.
నేడే చివరి ముహూర్తం: సచివాలయంలో ప్రవేశానికి ప్రభుత్వం బుధవారాన్ని చివరి ముహూర్తంగా నిర్ణయిం చింది. హైదరాబాద్ నుంచి వివిధ శాఖల ఉద్యోగులంతా ప్రభుత్వ ఆదే శాల మేరకు వెలగపూడి సచివాలయంలో కొబ్బరికాయలు కొట్టి వచ్చేందుకు మంగళవారం బయల్దేరి వెళ్లారు. అదే ముహూర్తంలో ఆయా శాఖల మంత్రులూ సచివాలయంలోని తమ చాంబర్లలో ప్రవేశించాల్సి ఉంది. అయితే, సచివాలయంలో తమకు కేటాయించిన చాంబర్లను చూసి ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, మంత్రులు గంటా, ప్రత్తిపాటి, కొల్లు రవీంద్ర తదితరులు అసంతృప్తికి గురయ్యారు. మంత్రుల ఫిర్యాదుపై మున్సిపల్ మంత్రి పి.నారాయణ స్పందించారు. మంత్రుల చాంబర్లను మరింతగా విస్తరించాలని మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. దీంతో కొత్త ఆర్కిటెక్చర్ ప్రకారం మంత్రుల చాంబర్లను పెద్దవిగా చేయాలని అధికారులు నిర్ణయించారు.
మార్పులకు రెండు నెలల సమయం
ప్రస్తుతం ఒక్కో భవనంలో ఐదుగురు మంత్రుల చాంబర్లు ఉన్నాయి. ఇప్పుడు ఆ చాంబర్లను కూల్చివేసి, మరింత ఎక్కువ చదరపు గజాల్లో పునర్నిర్మించనున్నారు. ఐదు చాంబర్లను కలిపేసి మూడేసి చాంబర్లుగా మార్చనున్నారు. ఈ మార్పులు చేయడానికి కనీసం రెండు నెలల సమయం పడుతుందని అధికార వర్గాలు తెలిపాయి. కృష్ణా పుష్కరాలు ముగిసిన తరువాత చాంబర్లలో మార్పుల అనంతరమే వెలగపూడి సచివాలయంలో అడుగుపెట్టాలని మంత్రులు నిర్ణయించారు.
సర్కారు ఉద్యోగుల విముఖత
తాత్కాలిక సచివాలయ నిర్మాణం పనులు పూర్తికాక ముందే హైదరాబాద్ నుంచి శాఖల తరలింపునకు ప్రభుత్వం జూన్ 29వ తేదీ నుంచి పలు ముహూర్తాలు నిర్ణయించింది. గత ముహూర్తాల్లో వెళ్లిన ఉద్యోగులు వెలగపూడి సచివాలయంలో కనీసం టాయిలెట్ సౌకర్యం, మంచినీటి సౌకర్యం, కూర్చొని పనిచేసే వాతావరణం లేకపోవడంతో కొబ్బరికాయ కొట్టి హైదరాబాద్‌కు తిరిగి వచ్చేశారు. ఆర్థిక, రెవెన్యూతోపాటు పలు శాఖల ఉన్నతాధికారులు, ఉద్యోగులు బుధవారం వెలగపూడి సచివాలయంలోకి ప్రవేశించనున్నారు. వారు అక్కడ కొబ్బరికాయ కొట్టి తిరిగి హైదరాబాద్‌కు చేరకుంటారు.