అవస్థల నడుమ విధులు..
తాత్కాలిక సచివాలయంలో ఉద్యోగుల కష్టాలు
సాక్షి, అమరావతి: తాత్కాలిక సచివాలయానికి తరలివచ్చిన ఉద్యోగులు నానా తిప్పలు పడుతున్నారు. సచివాలయ నిర్మాణ పనులు ఇంకా కొనసాగుతుండడం, అరకొర వసతులతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో సోమవారం నుంచి 30 శాఖల ఉద్యోగులు విధులు చేపట్టడం తెలిసిందే. మంగళవారం ఉద్యోగుల హాజరు పలుచబడగా.. వచ్చిన ప్రతిఒక్కరూ అవస్థల నడుమ విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితి నెలకొంది. ఉదయం 11 గంటల నుంచి ఉద్యోగుల రాక మొదలైంది. హైదరాబాద్ నుంచి విజయవాడ, గుంటూరుకు రైలు, బస్సుల్లో చేరుకున్నవారు తాత్కాలిక సచివాలయానికి చేరుకోవడానికి అవస్థలు పడ్డారు. స్థానికంగా వసతి సౌకర్యం లేక విజయవాడ, గుంటూరుల్లో బంధువులు, మిత్రులు, లాడ్జిల్లో ఉంటున్న ఉద్యోగు లు సచివాలయానికి చేరుకోవడానికీ ప్రయా ణ ఇబ్బందులు తప్పలేదు. రైల్వేస్టేషన్లు, బస్టాండ్‌ల నుంచి బస్సులు ఏర్పాటు చేసినా.. వాటి సమాచారం తెలియకపోవడంతో ఇబ్బందిపడ్డారు.
మహిళలకు ‘మరుగు’ తిప్పలు
సచివాలయంలో పనిచేసే వేలమంది ఉద్యోగులకు సరిపడా వసతుల్లేని పరిస్థితి. ము ఖ్యంగా మహిళలు తగినన్ని మరుగుదొడ్లు లేక ఇక్కట్లు పడుతున్నారు. అరకొరగా మ రుగు సౌకర్యాలుండగా.. అవీ పురుషుల మ రుగుదొడ్లు పక్కన, ఎదురుగా నిర్మించడం తో మహిళా ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. మంగళవారం తమకు పండ్లు, కుంకుమ, లలితా సహస్రనామ పుస్తకాలందించి అభినందించిన మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారికి పలువురు మహిళా ఉద్యోగులు తమ గోడు వినిపించారు. దీంతో వారి సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళతానని, వారంలోగా పరిష్కరిస్తానని ఆమె హామీఇచ్చారు.