ముహూర్తం నేడే | CS to launch today at noon | Sakshi
Sakshi News home page

ముహూర్తం నేడే

Published Wed, Jun 29 2016 1:07 AM | Last Updated on Mon, Sep 4 2017 3:38 AM

ముహూర్తం నేడే

ముహూర్తం నేడే

నత్తనడకన ‘తాత్కాలిక’o
- మూడు గదులు..మూడు శాఖలతో సరి
- వెలగపూడిలో పూర్తికాని రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం
- బురదమయంగా తాత్కాలిక సచివాలయం
- హడావుడిగా ఐదో బ్లాక్ గ్రౌండ్‌ ఫ్లోర్‌లో పనులు
- నేడు మధ్యాహ్నం ప్రారంభించనున్న సీఎస్
 
 సాక్షి, విజయవాడ బ్యూరో/అమరావతి: ప్రారంభానికి ముహుర్తం ముంచుకొచ్చేస్తోంది... ఉద్యోగుల ప్రవేశానికి కొద్ది గంటల సమయమే మిగిలి ఉంది... వేలాదిమంది కార్మికులను మోహరించినా పనులు పూర్తికాలేదు. దీంతో ముచ్చటగా మూడు గదులను అరకొరగానైనా పూర్తిచేసి, ఉద్యోగులతో అడుగు పెట్టించేసి ‘మమ’ అనిపించాలని అధికారులు కుస్తీ పడుతున్నారు. తాత్కాలిక సచివాలయానికే ఇన్ని ఆపసోపాలు పడుతుం టే.. అంతర్జాతీయ సచివాలయం నిర్మించా లంటే ఇంకెన్ని పాట్లు పడతారోనన్న విమర్శ లు వినిపిస్తున్నాయి.

వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం భవన సముదాయంలోని ఐదో బ్లాకులోని గ్రౌండ్‌ఫ్లోర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వారం నుంచి ఆగమేఘాల మీద పనులు చేస్తున్నా కొలిక్కి రాలేదు. అయినా బుధవారం మధ్యాహ్నం 2.59 గంట లకు సీఎస్ ఎస్‌పీ టక్కర్ ఈ ఫ్లోర్‌ను ప్రారంభించనున్నారు. ఇందులో వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖతోపాటు పంచాయతీరాజ్, గృహ నిర్మాణం, కార్మిక శాఖల్ని ప్రారంభించాలని భావించినా పనులు పూర్తికాలేదు. దీంతో అనుకున్న ముహూర్తానికి ప్రారంభించాలని ప్లైవుడ్‌తో హడావుడిగా పనులు పూర్తి చేస్తున్నారు. అయినా మంగళవారం రాత్రి వరకు ఆ మూడు గదులు కూడా పూర్తికాకపోవడం గమనార్హం.

 అన్నీ హడావుడి పనులే...
 వెలగపూడి వద్ద నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయ ఐదవ బ్లాక్ అనుకున్న ముహూర్తానికి పూర్తయిఉంటే ఈనెల 27న ప్రారంభించేవారు. పనులు పూర్తి కాకపోవటంతో ప్రారంభ తేదీని నేటికి వాయిదా వేశారు. అందులో భాగంగానే ప్లైవుడ్‌తో పనులు చకచకా కానిచ్చేస్తున్నారు. మంగళవారం రాత్రికి కూడా ఐదవ బ్లాక్‌లో గ్రౌండ్‌ఫ్లోర్ పూర్తయ్యే పరిస్థితి లేదు. రేయింబవళ్లు చేస్తే కానీ ముహూర్త సమయానికి ఆ మూడు గదులను అందివ్వలేమని ఇంజనీర్లు తేల్చిచెప్పారు. ఫ్లోరింగ్, ఫాల్ సీలింగ్ పనులు జరుగుతూనే ఉండగా ఏసీలు, ఫ్యాన్లు, తలుపులు, కిటికీలను ఇంకా పలు గదుల్లో బిగించలేదు. బుధవారం మధ్యాహ్నానికి ఈ పనులు పూర్తి చేశామనిపించి 3 శాఖలకు కేటాయించిన గదులను ఏదోలా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అన్ని బ్లాకుల్లో పనిచేస్తున్న కార్మికులను తీసుకొచ్చి అక్కడే పనిచేస్తుండడంతోపాటు ప్లాస్టింగ్, సీలింగ్, ఫ్లోరింగ్ తదితర అన్ని పనులూ ఒకేసారి జరుగుతున్నాయి. దీంతో ఈ బ్లాకంతా సిమెంటు, బురదమయంగా మారింది. నేడు ప్రారంభించనున్న భవనానికి 1000 కిలోవాట్ల ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేస్తున్నారు.

 అసంపూర్తిగా ఆ పనులు
 తాత్కాలిక సచివాలయంలో బుధవారం ప్రారంభించనున్న ఐదవ బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్‌లో మంచినీరు, మురుగునీటి పైపులైన్ల పనులు ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి. తాత్కాలికంగా ఇందులోని మురుగునీరు బయటకు పోయే ఏర్పాట్లు చేస్తున్నారు. తుళ్లూరు ఎత్తిపోతల పథకం నుంచి  తాగునీటి పైపులు వేస్తున్నా ఆ పని ఇంకా సగం కూడా పూర్తికాలేదు. పైపులైను ద్వారా వచ్చిన నీటిని ఫిల్టర్ చేసి బ్లాకులోకి అందించే పనులు ఇంకా మొదలుపెట్టనేలేదు. దీంతో ఐదో బ్లాకు వరకూ ఏదోలా నీటి సరఫరా చేయాలని చూస్తున్నారు. బ్లాకులోకి వచ్చేందుకు నిర్మించిన గ్రావెల్ రోడ్డు చిన్నపాటి వర్షానికే బురదతో నిండిపోయి ఉంది. వెలగపూడి గ్రామం నుంచి సచివాలయానికి వచ్చే సింగిల్ రోడ్డు బురదమయంగా దర్శనమిస్తోంది. దీంతోప్రతిరోజూ ట్రాఫిక్ స్తంభిస్తోంది. నిర్మాణ పనులకు సంబంధించిన లారీలు, ఇతర వాహనాలు ఎదురెదురుగా వస్తే దాటుకుని వెళ్లే పరిస్థితి లేదు. గమనించకుండా వాహనాలు నడిపితే పక్కనున్న పంట బోదెలోకి జారిపోతున్నాయి. సచివాలయం ప్రారంభమైన తర్వాత భారీగా వాహనాలు వచ్చినా ఇదే పరిస్థితి తప్పదు. ప్రభుత్వం గందరగోళం నడుమ తాత్కాలిక సచివాలయాన్ని ఎలాగైనా ప్రారంభించేందుకు ఆపసోపాలు పడుతోంది.
 
 వాయిదాల మీద వాయిదాలు
 ముఖ్యమంత్రి చెప్పినట్లు ఈ నెల 27వ తేదీన సచివాలయాన్ని ప్రారంభించాల్సివున్నా పనులు పూర్తికాకపోవడం వల్ల రెండు రోజులు వాయిదా వేశారు. వాస్తవానికి భవనాలు నిర్మిస్తున్న ఎల్ అండ్ టీ, షాపూర్‌జీ పల్లోంజీ కంపెనీలకు సెప్టెంబర్ వరకూ సమయం ఇచ్చారు. టెండర్లలో ఆరు నెలల సమయం ఇచ్చి మౌఖికంగా ఆగమేఘాల మీద పూర్తి చేయాలని తీవ్ర ఒత్తిడి చేస్తుండటంతో అంతా అయోమయంగా మారిపోయింది. చివరికి ఈ పనుల నాణ్యతపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయినా ప్రభుత్వం లెక్కచేయకుండా రికార్డు స్థాయిలో సచివాలయాన్ని పూర్తి చేశామని చెప్పుకునేందుకు అటు సీఆర్‌డీఏ అధికారుల్ని పరుగులు పెట్టిస్తూ ఇటు హైదరాబాద్ నుంచి వచ్చే ఉద్యోగులను ఇబ్బంది పెడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement