తాత్కాలిక సచివాలయంలో చోటుచేసుకుంటున్న వరుస సంఘటనలపై సర్కారు తర్జనభర్జన పడుతోంది.
- తాత్కాలిక నిర్మాణాల్లో వరుస ప్రమాదాలు
- ఇంజనీర్లు, కాంట్రాక్టర్లతో మంత్రి నారాయణ సమీక్ష
సాక్షి, అమరావతి : తాత్కాలిక సచివాలయంలో చోటుచేసుకుంటున్న వరుస సంఘటనలపై సర్కారు తర్జనభర్జన పడుతోంది. నిర్మాణాల్లో జరుగుతున్న లోపాలను తెలుసుకునే పనిలో పడింది. అందులో భాగంగా రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులకు సంబంధించిన ఇంజనీర్లు, కాంట్రాక్టర్లతో మంగళవారం సమావేశమయ్యారు. నిర్మాణాల్లో జరుగుతున్న తప్పొప్పులపై సుదీర్ఘంగా చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం. అధికారులు, ఇంజనీర్లు, కాంట్రాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. తుళ్లూరు మండలం వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం నిర్మాణ పనులు జరుగుతున్న విషయం తెలిసిందే.
పశ్చిమబెంగాల్‌కు చెందిన ఒకరు, మే 10న ఉత్తరప్రదేశ్‌కు చెందిన దేవేంద్ర ప్రమాదవశాత్తు మరణించారు. గతనెలలో తాత్కాలిక సచివాలయం రెండో భవనంలో ఓ చోట గ్రౌండ్‌ఫ్లోర్ కుంగింది. సోమవారం సాయంత్రం మొదటి భవనం మొదటి అంతస్తులో సైడ్‌వాల్ నిర్మిస్తుండగా జోరుగా వీచిన గాలికి పై భాగంలో నిర్మించిన సిమెంట్ రాళ్లు ఒక్కసారిగా కిందపడ్డాయి. అక్కడే పనిచేస్తున్న ఐదుగురు కూలీలపై ఆ రాళ్లు విరిగిపడటంతో రామచంద్ర, ధర్మేంద్ర తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రస్తుతం మంగళగిరి ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
రెండో ముచ్చట మళ్లీ వాయిదా
వరుస సంఘటనల నేపథ్యం.. పనులు పూర్తి కాకపోవటంతో బుధవారం జరగాల్సిన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు మంత్రి నారాయణ, రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ ప్రకటించారు. ఈ నెల 21న తాత్కాలిక సచివాలయంలోని ఐదవ భవనం మొదటి అంతస్తులో రోడ్లు, భవనాలు, రవాణా, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖలను ప్రారంభించనున్నట్లు తెలిపారు.