- నూతన సచివాలయంలో వసతులు లేవ న్న ఉద్యోగులు
- 27న సచివాలయానికి నలుగురు మంత్రులు హాజరు
- నేడు ప్రకటించనున్న సీఎం
సాక్షి, హైదరాబాద్: నూతన రాజధాని ప్రాంతంలోని వెలగపూడిలో తాత్కాలిక సచివాలయంలో ఈ నెల 27 నుంచి పనిచేయాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు శుక్రవారం 75 మంది ఉద్యోగులు హైదరాబాద్ నుంచి తరలివెళ్లారు. భవన నిర్మాణాలు పూర్తికాకుండానే అక్కడ ఎలా పనిచేయాలంటూ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వారు సచివాలయంలో కాకుండా ప్రస్తుతానికి రాజధాని ప్రాంతంలోని స్థానిక కార్యాలయాల్లో పనిచేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎల్.వి. సుబ్రహ్మణ్యం అర్జెంట్ నోట్ జారీ చేశారు.
ఈ 75 మంది ఉద్యోగులకు విజయవాడ ప్రాంతంలోని సంబంధిత శాఖల స్థానిక కార్యాలయాల్లో కూర్చుని పనిచేసేందుకు అవకాశం కల్పించాల్సిందిగా ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. వీరినే ఆయా శాఖల్లోనే రిపోర్ట్ చేయాలని సూచించారు. అవసరమైన పక్షంలో హైదరాబాద్ వచ్చి పనిచేసే వెళ్లాలని కూడా ఆ ఆదేశాల్లో సూచించారు. వారందరూ కూడా సొంత శాఖల్లోనే పనిచేస్తున్నట్లు భావించాలని పేర్కొన్నారు. గతంలో జీతాలు ఎలా డ్రా చేస్తున్నారో అదే తరహాలో వేతనాలు కూడా డ్రా చేసుకోవాలని పేర్కొన్నారు. అంతే కాకుండా ఉద్యోగులు తమ శాఖలకు చెందిన ఫైళ్లు హైదరాబాద్ నుంచి వెలగపూడికి తరలింపు బాధ్యతలను తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలివెళ్లిన వారిలో 41 మంది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు, 16 మంది సెక్షన్ ఆఫీసర్లతో పాటు సీనియర్, జూనియర్ స్టెనోగ్రాఫర్లు, అసిస్టెంట్ కార్యదర్శులు తదితరులున్నారు.
27న నలుగురు మంత్రులు, అధికారులు
వెలగపూడిలో నిర్మాణంలో ఉన్న తాత్కాలిక సచివాలయం నుంచి ఈ నెల 27వ తేదీన నలుగురు మంత్రులతో పాటు పలువురు ఉన్నతాధికారులు పని ప్రారంభించనున్నారు. వారు ఎవరనేది శనివారం ముఖ్యమంత్రి ప్రకటించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
తరలిన 75 మంది ఉద్యోగులు
Published Sat, Jun 25 2016 1:41 AM | Last Updated on Mon, Sep 4 2017 3:18 AM
Advertisement
Advertisement