
అమరావతికి తరలింపుపై స్పష్టత ఇవ్వండి
సీఎస్‌ను కలసి కోరాలని ఐఏఎస్‌ల నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: రాజధాని అమరావతి ప్రాంతమైన వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయానికి తరలివెళ్లడంపై స్పష్టత ఇవ్వాలని ఐఏఎస్ అధికారులు కోరుతున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్‌ను కలసి కోరాలని ఇటీవల జరిగిన ఐఏఎస్ అధికారుల సమావేశంలో నిర్ణయించారు. జూన్ 27వ తేదీన తాత్కాలిక సచివాలయానికి తరలి వెళ్లాల్సిందేనని మంత్రి నారాయణ ప్రకటిస్తున్నారు. అయితే వెలగపూడిలో నిర్మాణంలో ఉన్న తాత్కాలిక సచివాలయం డిసెంబర్‌కు గానీ పూర్తి కాదని సీఆర్‌డీఏ అధికారులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో ఐఏఎస్‌ల సంఘం ఇటీవల లేక్‌వ్యూ అతిథిగృహంలో సమావేశమై సచివాలయానికి తరలివెళ్లడంపై చర్చించారు. ఈ సమావేశానికి 12 మంది ఐఏఎస్ అధికారులు హాజరయ్యారు. భవనం పూర్తి కాకుండా అక్కడకి వెళ్లి ఎలా పనిచేస్తామని వారు ప్రశ్నిస్తున్నారు. తాత్కాలిక సచివాలయానికి నీటి సరఫరా ఎక్కడి నుంచి చేస్తారో ఇప్పటి వరకు స్పష్టత లేదని, అలాగే విద్యుత్ సౌకర్యం కూడా లేదనే విషయాలు వారి మధ్య చర్చకు వచ్చాయి. ఈ విషయాలను మంత్రి నారాయణ దృష్టికి తీసుకువెళ్తే.. నీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తామని, జనరేటర్లు ద్వారా విద్యుత్ అందిస్తామని చెప్పినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. రాజధానికి వెళితే.. నివాస వసతి కల్పనపై కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదని, ఈ విషయాలన్నింటినీ సీఎస్‌కు విన్నవించాలని ఐఏఎస్‌ల సమావేశం నిర్ణయించింది.
ఐటీ శాఖది అదేం తీరు..
ముఖ్యమంత్రి కార్యాలయంలో ఐటీ శాఖను చూస్తున్న సంయుక్త కార్యదర్శి ప్రద్యుమ్న ఉన్న పళంగా ఆదేశాలు జారీ చేసి ఐటీ శాఖ ఉద్యోగులను విజయవాడకు తరలించడంపైనా సమావేశం చర్చించింది. ఐటీ శాఖ మంత్రికి కూడా కనీస సమాచారం ఇవ్వకుండా ఆ శాఖ ఉద్యోగులను విజయవాడకు తరలించారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఐటీ శాఖను చూస్తున్న అధికారినే అదే శాఖ ఇంచార్జి కార్యదర్శిగా నియమించడంపై ఉన్నతాధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధమని అధికార యంత్రాంగం వ్యాఖ్యానిస్తోంది. అంతేకాకుండా సంయుక్త కార్యదర్శి హోదాలో ఉన్న ప్రద్యుమ్న ఐటీ శాఖ కార్యదర్శి అంటూ జీవోలు జారీ చేయడాన్ని ఉన్నతాధికారులు తప్పుపడుతున్నారు.
18న రోడ్ మ్యాప్‌పై సీఎం సమీక్ష
తాత్కాలిక సచివాలయానికి తరలి వెళ్లడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 18న ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఇటీవల సీఎస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సచివాలయంలో ఏ శాఖల్లోని ఏ విభాగాలను హైదరాబాద్‌లోనే ఉంచాలి, ఏ విభాగాలను వెలగపూడి సచివాలయానికి తరలించాలనే మార్గదర్శకాలను ఖరారు చేశారు. అలాగే ఏ రంగాల ఉద్యోగులకు తరలింపులో మినహాయింపు ఇవ్వాలో కూడా నిర్ధారించారు. ముఖ్యమంత్రి నిర్వహించే సమీక్షలో ఈ విషయాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్ వివరించనున్నారు. ఆ సమావేశంలో రోడ్ మ్యాప్‌ను ఖరారు చేయనున్నట్లు సాధారణ పరిపాలన శాఖ ఉన్నతాధికారి తెలిపారు.