ఎన్నాళ్లీ ‘బొమ్మల కొలువు’ | One step in the immobility of the new capital structure | Sakshi
Sakshi News home page

ఎన్నాళ్లీ ‘బొమ్మల కొలువు’

Published Tue, Jun 7 2016 1:19 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM

ఎన్నాళ్లీ ‘బొమ్మల కొలువు’ - Sakshi

ఎన్నాళ్లీ ‘బొమ్మల కొలువు’

ఒక్క అడుగైనా కదలని నూతన రాజధాని నిర్మాణం
 
 సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసి దాదాపు రెండేళ్లు పూర్తయ్యింది. అమరావతిని నూతన రాజధానిగా ప్రకటించి ఏడాదిన్నర అవుతోంది. రాజధాని నిర్మాణం మాత్రం ఒక్క అడుగైనా ముందుకు కదలడం లేదు. మాస్టర్‌ప్లాన్లు, డిజైన్లు అంటూ అప్పుడప్పుడూ ప్రజలకు రంగురంగుల బొమ్మల కొలువులను చూపించడం మినహా ఇప్పటిదాకా ఒక్క నిర్మాణాన్ని కూడా ప్రారంభించిన దాఖలు లేవు. ఈ విషయంలో ప్రభుత్వం ఇంకా నాన్చుడు ధోరణే అవలంభిస్తోంది. సింగపూర్ ఇచ్చిన మాస్టర్‌ప్లాన్‌లోని ఆకాశహార్మ్యాలు, ఫ్లైఓవర్లు, ఐకానిక్ టవర్ల బొమ్మలతో ఘనంగా ప్రచారం చేసుకుంటోంది. అదిగో రాజధాని.. ఇదిగో రాజధాని అంటూ ప్రజానీకాన్ని ఏమారుస్తోంది. నెలకోసారి బొమ్మల డిజైన్లను ప్రణాళికల పేరుతో విడుదల చేసి హంగామా చేయడం తప్ప క్షేత్రస్థాయిలో పనులు మొదలే కావడం లేదు.

 ప్రయోజనాలు దక్కించుకోవడంలో రాజీ వద్దు
 రాజధాని పేరుతో రైతులను మభ్యపెట్టి సేకరించిన వేలాది ఎకరాలను ఎవరికి కట్టబెట్టాలనే అంశంలో ప్రభుత్వ పెద్దలు ఇంకా ఒక నిర్ణయానికి రాలేకపోతున్నట్లు సమాచారం. ఎవరికి కట్టబెడితే తమకు ఎక్కువ లబ్ధి కలుగుతుందనే విషయంలో వారు లోపాయికారీగా తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. అందుకే తొందరపడకుండా ఆచితూచి వ్యవహరించాలని యోచిస్తున్నారు. రాజధాని నిర్మాణం ఎంత ఆలస్యమైనా ఫర్వాలేదు, తమకు దక్కాల్సిన ప్రయోజనాల విషయంలో ఎంతమాత్రం రాజీపడకూడదని సర్కారు పెద్దలు కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది.

 వివాదాస్పదం స్విస్ ఛాలెంజ్ విధానం
 రాజధాని నిర్మాణం కోసం సింగపూర్ ప్రభుత్వ కంపెనీలు ఇచ్చిన మాస్టర్‌ప్లాన్లను ఆరు నెలల క్రితమే రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని 55 మండలాల రాజధాని రీజియన్, గుంటూరు జిల్లాలోని 29 గ్రామాల రాజధాని నగరం, 16 చదరపు కిలోమీటర్ల సీడ్ క్యాపిటల్‌కు సింగపూర్ కంపెనీలు వేర్వేరుగా మాస్టర్‌ప్లాన్లు రూపొందించాయి. ఇందుకోసం సీఆర్‌డీఏ, ప్రభుత్వ ఉన్నతాధికారులు పలుమార్లు సింగపూర్‌లో పర్యటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రెండుసార్లు అక్కడికెళ్లి చర్చలు జరిపారు. ఇక సింగపూర్ కంపెనీల ప్రతినిధులు ఇక్కడ తాత్కాలిక డెస్క్‌లు ఏర్పాటు చేసుకుని మరీ ప్లాన్లు రూపొందించారు. కొన్ని లోపాలున్నా చివరికి ప్రభుత్వం మూడు ప్లాన్లను ఆమోదించింది.

రాజధాని నగరం, సీడ్ క్యాపిటల్ నిర్మాణ కార్యకలాపాల కోసం స్విస్ ఛాలెంజ్ విధానాన్ని తెరపైకి తెచ్చింది. మాస్టర్‌ప్లాన్ తయారు చేసిన సింగపూర్ కంపెనీలకే కాంట్రాక్టు కట్టబెట్టేందుకు వ్యూహ రచన చేసింది. సింగపూర్ కంపెనీల కన్సార్టియం అసెండాస్-సిన్‌బ్రిడ్జ్-సెంబ్‌కార్ప్‌కు ఈ విధానం కింద 1,600 ఎకరాలు ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించింది. అయితే, ఇందుకు సంబంధించిన విధివిధానాలు, ఆ కంపెనీల నిబంధనలపై చాలారోజుల నుంచి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. సింగపూర్ ప్లాన్లు, స్విస్ ఛాలెంజ్ విధానం, వారి మధ్య ఒప్పందాలపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం దీనిపై తుది నిర్ణయాన్ని ప్రకటించేందుకు వెనుకాడుతోంది. లోపాయికారీగా సింగపూర్ కంపెనీల కన్సార్టియంనే మాస్టర్‌డెవలపర్‌గా ఎంపిక చేయాలనే నిర్ణయం జరిగినా దాన్ని ఎలా బయట పెట్టాలనే దానిపై చాలారోజుల నుంచి తర్జనభర్జనలు జరుగుతున్నాయి.
 
 తాత్కాలిక సచివాలయం పూర్తికాకుండానే ప్రారంభోత్సవం
 రాజధాని ప్లాన్లు, డిజైన్ల పేరుతో కాలక్షేపం చేస్తూనే గతేడాది జూన్ ఆరో తేదీన తాళ్లాయపాలెంలో రాజధాని నిర్మాణానికి భూ మి పూజ చేశారు. అక్టోబర్ 22న ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తీసుకొచ్చి రూ. వందల కోట్లు కుమ్మరించి ఆర్భాటంగా రాజధానికి శంకుస్థాపన చేయించారు. వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణం 20 శాతం కూడా పూర్తికాకుండా నే రెండు నెలల క్రితం దానికి ప్రారంభోత్స వం చేశారు. ఇలా ఏడాదిన్నరపాటు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, ప్లాన్లు, డిజైన్లు, సర్వేల పేరుతో హడావుడి చేసినా ఒక్క పనీ రాజధానిలో మొదలుపెట్టలేదు.
 
 దేశీయ ఆర్కిటెక్ట్‌ల డిజైన్ల ఖరారులో జాప్యం

 మరోవైపు రాజధాని భవన సముదాయం కోసం అంతర్జాతీయ స్థాయి ఆర్కిటెక్ట్‌ల మధ్య డిజైన్ల పోటీ పేరుతో ప్రభుత్వం కొద్దిరోజులు హడావుడి చేసింది. చివరికి జపాన్‌కు చెందిన మకీ అసోసియేట్స్ డిజైన్‌ను ఖరారు చేసి దానికి విస్తృతంగా ప్రచారం చేసింది. కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా అది రూపొందించిన అసెంబ్లీ భవన డిజైన్ చండీగఢ్ అసెంబ్లీని పోలి ఉండడం, హైకోర్టు డిజైన్ తీసికట్టుగా ఉండడంతో  మళ్లీ కొత్త డిజైన్ల బాధ్యతను దేశీయ ఆర్కిటెక్ట్‌లకు అప్పగించింది. వారు తయారు చేసిన వాటిని ఇంకాఖరారు చేయలేదు. రాజధాని మౌలిక వసతుల కల్పన మాస్టర్‌ప్లాన్ బాధ్యతను చైనాకు చెందిన జీఐఐసీ కంపెనీకి, కొండవీటి వాగు ముంపు నివారణ సర్వేను ఆర్వీ అసోసియేట్స్‌కు అప్పగించి ఇంకా నాన్చుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement