♦ లక్షల సంఖ్యలో నూతన రాజధానికి తరలించాల్సిన ఫైళ్లు
♦ పూర్తి నిఘాతో తీసుకెళ్లేందుకు సన్నాహాలు
♦ 32 శాఖలు, 350 సెక్షన్లకు చెందిన ఫైళ్లు గుర్తింపు
సాక్షి, హైదరాబాద్: నూతన రాజధాని వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయానికి ఫైళ్ల తరలింపుపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సత్యప్రకాశ్ టక్కర్ దృష్టి సారించారు. ఫైళ్లతో పాటు కంప్యూటర్లను కూడా తరలించేందుకు త్వరలో టెండర్లను ఆహ్వానిస్తామని సీఎస్ పేర్కొన్నారు. 32 శాఖల్లో 350 సెక్షన్లకు చెందిన ఫైళ్లు లక్షల సంఖ్యలో ఉంటాయని, వీటి తరలింపు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉన్నందున ప్రత్యేక టెండర్లు ఆహ్వానించాలని సీఎస్ అభిప్రాయపడ్డారు. రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీరాజ్, సాధారణ పరి పాలన, మున్సిపల్, హోం శాఖల్లో ఫైళ్లు అధికమని అధికారులు తేల్చారు. ఫైళ్లతో పాటు కంప్యూటర్లు, సర్వర్లు తరలింపు అనేది ఏ శాఖకు చెందినవి ఆ శాఖకు కేటాయించిన బ్లాక్‌కు చేర్చేలా చర్యలు తీసుకోవాల్సి ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఫర్నిచర్‌ను మాత్రం ఇక్కడే వదిలేయాలని నిర్ణయించారు. వెలగపూడిలో కార్యాలయాలకు కొత్త ఫర్నిచర్‌ను సమకూర్చుతున్నట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
బ్యాచిలర్ వసతి ఎంత మందికి కావాలి
ఇలా ఉండగా వెలగపూడి సచివాలయానికి తరలివెళ్లే అఖిల భారత సర్వీసు అధికారులు ఎంత మంది కుటుంబాలు సహా తరలివెళ్తారు. ఎంత మందికి బ్యాచిలర్ వసతి కావాలనే వివరాలను సేకరించాలని సాధారణ పరిపాలన శాఖ నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా బ్యాచిలర్లకు వసతి కల్పించాలని, అలాగే కుటుంబాలతో తరలివెళ్లే వారికి అందుకు అనుగుణంగా వసతి కల్పించాలని నిర్ణయించారు. ముఖ్యంగా ఏడాదిలోగా పదవీ విరమణ చేసే అఖిల భారత సర్వీసు అధికారులు కుటుంబాలతో తరలివెళ్లేందుకు ఇష్టపడటం లేదు. బ్యాచిలర్ వసతిని పర్యాటక శాఖ హోటల్లో కల్పిస్తే సరిపోతుందని సీనియర్ ఐఏఎస్ అధికారులు కోరుతున్నారు.
ఫైళ్ల తరలింపునకు త్వరలో టెండర్లు
Published Sat, May 14 2016 1:43 AM | Last Updated on Mon, Sep 4 2017 12:02 AM
Advertisement
Advertisement