satya prakash tucker
-
సీఎం సారూ.. తప్పు తప్పు
సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న అక్రమ నిర్ణయాలను, ప్రభుత్వ దోపిడీ విధానాలను ఇప్పటిదాకా పనిచేసిన నలుగురు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు(సీఎస్) గట్టిగా ప్రతిఘటించారు. టీడీపీ సర్కారు అవినీతి, అక్రమాలపై మాజీ సీఎస్‌లు ఐవైఆర్ కృష్ణారావు, అజేయ కల్లాం ఇప్పటికే బహిరంగంగా గళమెత్తిన సంగతి తెలసిందే. రాష్ట్రంలో ప్రభుత్వ పెద్దలు బరితెగించారని, విచ్చలవిడిగా అవినీతి కార్యక లాపాలు సాగుతున్నాయని పలు వేదికలపై తెలియజేస్తున్నారు. సీఎస్‌లుగా పనిచేసిన మరో ఇద్దరు ఐఏఎస్ అధికారులు సత్యప్రకాశ్ టక్కర్, దినేశ్ కుమార్‌లు బయటకు వచ్చి బాహాటంగా మాట్లాడకపోయినప్పటికీ సీఎస్ హోదాలో వారు టీడీపీ ప్రభుత్వ దోపీడీ చర్యలను తీవ్రంగా వ్యతిరేకించారు. సంబంధిత ఫైళ్లపై తమ అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడించారు. సర్కారు తప్పుడు నిర్ణయాలతో రాష్ట్ర ఖజానాకు ఎలాంటి నష్టం వాటిల్లుతుందో తెలయజేశారు. సాధారణంగా కేబినెట్ గానీ, ముఖ్యమంత్రి గానీ ప్రజలకు ఆర్థిక ప్రయోజనం కలిగించే సబ్సిడీ పథకాలపై అధికారులు వద్దన్నప్పటికీ నిర్ణయాలు తీసుకుంటారు. రాష్ట్ర ఖజానాపై, ప్రజలపై భారం పడే నిర్ణయాలను అధికారులు వద్దంటే ఏ ముఖ్యమంత్రి, కేబినెట్ తీసుకోదు. అయితే, చంద్రబాబు మాత్రం స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ఖజానాకు గండికొడుతూ పలు నిర్ణయాలు తీసుకున్నారు. సీఎస్ వ్యతిరేకించారని చట్టాన్నే మార్చేశారు రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో స్విస్ చాలెంజ్ విధానంలో సింగపూర్ కంపెనీల ప్రతిపాదనలను చట్టానికి విరుద్ధంగా ముందుగా ముఖ్యమంత్రి ఆమోదించేసిన తరువాత సీఎస్ నేతృత్వంలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీకి పంపించడంపై అప్పటి సీఎస్ సత్యప్రకాశ్ టక్కర్ ఘాటుగా స్పందించారు. ఇదేం పద్ధతి అని ప్రశ్నించారు. సంబంధిత ఫైల్‌ను తొలుత ముఖ్యమంత్రి ఆమోదించిన తర్వాత అధికారులకు పంపడంపై ఉన్నతస్థాయి సమావేశంలో టక్కర్ విస్మయం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎనేబిలింగ్ చట్టం(ఏపీఐడీఈఏ) నిబంధన ప్రకారం స్విస్ చాలెంజ్ విధానంలో సింగపూర్ కంపెనీలు చేసిన ప్రతిపాదనలను సీఆర్డీఏ అధ్యయనంచేసిన తరువాత సీఎస్ నేతృత్వంలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీ పరిశీలనకు పంపించాలి. ఆ అథారిటీకి విస్తృత అధికారాలున్నాయి. అయితే, ఇందుకు విరుద్ధంగా సింగపూర్ కంపెనీల ప్రతిపాదనలపై ఆర్థిక మంత్రి నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ రెండుసార్లు చర్చలు జరిపింది. అంతకు ముందు సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు సంప్రదింపులు జరిపారు. మంత్రుల కమిటీ, సీఎం ఆమోదించిన తరువాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అధారిటీకి ప్రతిపాదనలను పంపించారు. దీనిపై సీఎస్ టక్కర్ తీవ్రంగా స్పందించారు. సీఎం, మంత్రుల కమిటీ ఆమోదం తెలిపాక ఇక మంత్రివర్గానికి పంపాలి తప్ప అధికారులతో కూడిన అథారిటీకి కాదన్నారు. ప్రభుత్వ పెద్దలు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అధికారులు కూడా ఆమోదించారని చిత్రీకరించడానికి సీఎస్ నేతృత్వంలోని అథారిటీకి పంపించారని ఉన్నతాధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది స్విస్ చాలెంజ్ విధానంలా లేదని, నామినేషన్ విధానంలా ఉందని పేర్కొన్నారు. సింగపూర్ కంపెనీల ప్రతిపాదనలపై నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయం తీసుకోలేమని సీఎస్ టక్కర్ తేల్చిచెప్పారు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏకంగా చట్టాన్నే మార్చేశారు. సీఎస్ నేతృత్వంలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీని తొగిస్తూ చట్టంలో సవరణలు తీసుకొచ్చారు. ఇదే అంశంపై హైకోర్టులో ప్రజా ప్రయోజనం వ్యాజ్యం(పిల్) దాఖలైంది. కోర్టు విచారణకు స్వీకరించి ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అసైన్డు భూదందాకు బ్రేక్ కాకినాడ సెజ్‌కు గతంలో కేటాయించిన 1,589.74 ఎకరాల్లో 1,396.91 ఎకరాల అసైన్డ్ భూమితోపాటు 72 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ మొత్తం భూమిని పరిశ్రమల కోసమంటూ రైతుల నుంచి సేకరించి కాకినాడ సెజ్‌కు లీజుకిచ్చారు. అయితే, ఇప్పుడు ఆ అసైన్డ్ భూములను విక్రయించాలంటే సాధ్యం కాదని టక్కర్ స్పష్టం చేశారు. ఈ భూములను ప్రైవేట్ సంస్థకు విక్రయించేందుకు వీలుగా ఎస్ఈజడ్ నుంచి తొలుత ఏపీఐఐసీ డీనోటిఫై చేసింది. రైతుల నుంచి సేకరించిన అసైన్డ్ భూములను లీజుకు కాకుండా సర్వహక్తులతో ప్రైవేట్ సంస్థ పేరిట రిజిస్ట్రేషన్ చేయడం నిబంధనలకు విరుద్ధమని, దీనికి ఒప్పుకునే ప్రసక్తే లేదని టక్కర్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఎన్నిసార్లు ఒత్తిడి తెచ్చినా ఆయన అంగీకరించలేదు. డిస్కంలను ముంచేస్తారా? రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు భారీ విద్యుత్ కొనుగోలు కుంభకోణానికి తెరతీయగా దాన్ని అడ్డుకోవడానికి సీఎస్‌గా పనిచేసి, ఇటీవల రిటైరైన దినేశ్ కుమార్ అన్ని ప్రయత్నాలు చేశారు. అయినా సరే ముఖ్యమంత్రి కేబినెట్లో పెట్టి మరీ ప్రైవేట్ విద్యుత్ సంస్థకు ఆర్థిక ప్రయోజనం కలిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో మిగలు విద్యుత్ ఉందని, ఎక్కువ ధరకు సుజ్లాను ప్రైవేట్ సంస్థ నుంచి పవన్ విద్యుత్ కొనుగోలుకు అంగీకరించరాదని సీఎస్ దినేశ్ కుమార్ స్పష్టం చేశారు. విద్యుత్ పంపిణీ సంస్థలు(డిస్కంలు) ఇప్పటికే నష్టాల్లో కొనసాగుతున్నాయని, పవన విద్యుత్‌ను యూనిట్ రూ.4.84 చొప్పున కొనుగోలు చేయడానికి ఒప్పందాలు చేసుకోవడం తగదని చెప్పారు. ఇప్పటికే ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తున్న ఒప్పందాలను సమీక్షించి, తక్కువ ధరకు కరెంటు కొనుగోలు చేయడంపై దృష్టి సారించాలని సూచించారు. సుజ్లాన్‌తో కొనుగోలు ఒప్పందం చేసుకుంటే నాలుగేళ్లలో డిస్కంలపై రూ.1,000 కోట్ల అదనపు భారం పడుతుందని, దీన్ని చివరకు విద్యుత్ వినియోగదారులే భరించాల్సి వస్తుందని పేర్కొన్నారు. అయినా ముఖ్యమంత్రి లెక్కచేయలేదు. హిందూజా థర్మల్ విద్యుత్తు కేంద్రం నుంచి కరెంటు కొనుగోలు ఒప్పందాలు చేసుకోవద్దని కూడా ప్రభుత్వానికి దినేష్‌కుమార్ స్పష్టం చేశారు. సాగునీటి ప్రాజెక్టుల్లో అక్రమాలపై నిలదీత ప్రభుత్వ పెద్దల ఒత్తిడి మేరకు హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం అంచనా వ్యయాన్ని రూ.6,850 కోట్ల నుంచి ఏకంగా రూ.11,722 కోట్లకు పెంచేస్తూ జలవనరుల శాఖ ప్రతిపాదనలు పంపింది. ఈ ప్రతిపాదనలను సర్కార్ ఆమోదించక ముందే ప్రభుత్వ పెద్దలు పాత కాంట్రాక్టర్లపై 60సీ నిబంధన కింద వేటు వేసి.. మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని పెంచేసి, కోటరీ కాంట్రాక్టర్లకు కట్టబెట్టి, భారీగా కమీషన్లు దండుకునేందుకు స్కెచ్ వేశారు. అంచనా వ్యయాన్ని పెంచేసే ప్రతిపాదనలను అంగీకరించే ప్రశ్నే లేదని సీఎస్ టక్కర్ తేల్చిచెప్పారు. దాంతో సీఎం చంద్రాబు హంద్రీ–నీవా అంచనా వ్యయాన్ని పెంచే ప్రతిపాదనపై కేబినెట్లో ఆమోదముద్ర వేయించారు. ఏలేరు ఆధునికీకరణ, చింతలపూడి ఎత్తిపోతల పథకం విస్తరణ పనుల టెండర్లలో కాంట్రాక్టర్లు, ప్రభుత్వ పెద్దలు కుమ్మక్కు కావడాన్ని హైపవర్ కమిటీ ఛైర్మన్ హోదాలో సీఎస్ దినేష్‌కుమార్ నిలదీశారు. కాంట్రాక్టర్లు కుమ్మక్కై అధిక ధరలకు షెడ్యూళ్లు దాఖలు చేస్తే టెండర్ల విధానానికి అర్థం ఏముంటుందని ప్రశ్నించారు. ఈ అక్రమాలను సహించేది లేదని సీఎస్ దినేష్‌కుమార్ పేర్కొనడంతో ఏకంగా టెండర్ల విధానంలో హైపవర్ కమిటీ పాత్ర లేకుండా ప్రభుత్వం దాన్ని రద్దు చేయడం గమనార్హం. -
శాఖాధిపతుల కేంద్రం.. ఇబ్రహీంపట్నం
- ఆంజనేయ టవర్స్‌లో ఎక్కువ శాఖల కార్యాలయాలు - 27వ తేదీ కల్లా తరలివెళ్లేందుకు శాఖాధిపతుల ఏర్పాట్లు - రెయిన్ ట్రీ పార్కులో ఐఏఎస్ అధికారులకు వసతి - రవాణా చార్జీలపై నేడో రేపో ఉత్తర్వులు జారీ - తరలింపు చర్యలపై సీఎస్ ఉన్నతస్థాయి సమీక్ష సాక్షి, హైదరాబాద్: శాఖాధిపతుల కార్యాలయాలకు విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం కేంద్రం కానుంది. హైదరాబాద్ నుంచి నూతన రాజధాని ప్రాంతానికి తరలివెళ్లే శాఖాధిపతుల కార్యాలయాలు అత్యధిక భాగం ఇబ్రహీంపట్నంలోనే ఏర్పాటు కానున్నాయి. ఇబ్రహీంపట్నంలోని అంజనేయ టవర్స్‌లో ఎక్కువమంది శాఖాధిపతులు తమ కార్యాలయాల కోసం అద్దెకు తీసుకున్నారు. ఈ నెల 27వ తేదీ కల్లా శాఖాధిపతుల కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగుల్లో ఎంతో కొంత మంది నూతన రాజధాని ప్రాంతం నుంచి పనిచేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. 27వ తేదీ కల్లా శాఖాధిపతుల కార్యాలయాలను నూతన రాజధాని ప్రాంతం విజయవాడ-గుంటూరులకు తరలించేందుకు తీసుకున్న చర్యలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సత్య ప్రకాశ్ టక్కర్ సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రతీ శాఖాధిపతిని నూతన రాజధానిలో కార్యాలయాల గుర్తింపు, అద్దెకు తీసుకోవడంపై సీఎస్ అడిగి తెలుసుకున్నారు. రవాణా చార్జీల ఖరారు.. అన్ని శాఖాధిపతులు కార్యాలయాలను గుర్తించినట్లు సమీక్షలో తెలిపారు. శాఖాధిపతుల కార్యాలయాల్లో ఫర్నీచర్, ఫైళ్లు, కంప్యూటర్ల తరలింపునకై రవాణా చార్జీలను కూడా ఖరారు చేశామని, నేడో రేపో ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు రహదారులు-భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంబాబ్ సమీక్షలో తెలిపారు. ఇబ్రహీంపట్నం నుంచి హైదరాబాద్‌కు రావడానికి, హైదరాబాద్ నుంచి ఇబ్రహీంపట్నం వెళ్లడానికి అనువుగా ఉంటుందనే భావనతోనే అత్యధిక శాతం శాఖాధిపతుల కార్యాలయాలను ఇంబ్రహీంపట్నంలో చూసుకున్నారు. ఇలా ఉండగా అఖిల భారత సర్వీసు అధికారులకు నివాస వసతిని రెయిన్ ట్రీ పార్కులో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రెయిన్ ట్రీ పార్కులోనే కుటుంబాలతో ఉండే అధికారులకు, అలాగే బ్యాచ్‌లర్ నివాస వసతిని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆర్థిక శాఖకు చెందిన శాఖాధిపతుల కార్యాలయాలన్నీ కూడా ఇబ్రహీంపట్నంలోనే ఉండనున్నాయి. కొద్దిమంది శాఖాధిపతులు తమ కార్యాలయాలను ఈ నెల 24వ తేదీ నుంచే తరలించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు -
ఫైళ్ల తరలింపునకు త్వరలో టెండర్లు
♦ లక్షల సంఖ్యలో నూతన రాజధానికి తరలించాల్సిన ఫైళ్లు ♦ పూర్తి నిఘాతో తీసుకెళ్లేందుకు సన్నాహాలు ♦ 32 శాఖలు, 350 సెక్షన్లకు చెందిన ఫైళ్లు గుర్తింపు సాక్షి, హైదరాబాద్: నూతన రాజధాని వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయానికి ఫైళ్ల తరలింపుపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సత్యప్రకాశ్ టక్కర్ దృష్టి సారించారు. ఫైళ్లతో పాటు కంప్యూటర్లను కూడా తరలించేందుకు త్వరలో టెండర్లను ఆహ్వానిస్తామని సీఎస్ పేర్కొన్నారు. 32 శాఖల్లో 350 సెక్షన్లకు చెందిన ఫైళ్లు లక్షల సంఖ్యలో ఉంటాయని, వీటి తరలింపు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉన్నందున ప్రత్యేక టెండర్లు ఆహ్వానించాలని సీఎస్ అభిప్రాయపడ్డారు. రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీరాజ్, సాధారణ పరి పాలన, మున్సిపల్, హోం శాఖల్లో ఫైళ్లు అధికమని అధికారులు తేల్చారు. ఫైళ్లతో పాటు కంప్యూటర్లు, సర్వర్లు తరలింపు అనేది ఏ శాఖకు చెందినవి ఆ శాఖకు కేటాయించిన బ్లాక్‌కు చేర్చేలా చర్యలు తీసుకోవాల్సి ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఫర్నిచర్‌ను మాత్రం ఇక్కడే వదిలేయాలని నిర్ణయించారు. వెలగపూడిలో కార్యాలయాలకు కొత్త ఫర్నిచర్‌ను సమకూర్చుతున్నట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. బ్యాచిలర్ వసతి ఎంత మందికి కావాలి ఇలా ఉండగా వెలగపూడి సచివాలయానికి తరలివెళ్లే అఖిల భారత సర్వీసు అధికారులు ఎంత మంది కుటుంబాలు సహా తరలివెళ్తారు. ఎంత మందికి బ్యాచిలర్ వసతి కావాలనే వివరాలను సేకరించాలని సాధారణ పరిపాలన శాఖ నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా బ్యాచిలర్లకు వసతి కల్పించాలని, అలాగే కుటుంబాలతో తరలివెళ్లే వారికి అందుకు అనుగుణంగా వసతి కల్పించాలని నిర్ణయించారు. ముఖ్యంగా ఏడాదిలోగా పదవీ విరమణ చేసే అఖిల భారత సర్వీసు అధికారులు కుటుంబాలతో తరలివెళ్లేందుకు ఇష్టపడటం లేదు. బ్యాచిలర్ వసతిని పర్యాటక శాఖ హోటల్లో కల్పిస్తే సరిపోతుందని సీనియర్ ఐఏఎస్ అధికారులు కోరుతున్నారు. -
విపత్తుల్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి
అధికారులకు సీఎస్ ఆదేశం సాక్షి, హైదరాబాద్: వరదలు, తుపాన్ల వంటి విపత్తులను ఎదుర్కొనేందుకు సర్వ సన్నద్ధంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సత్య ప్రకాశ్ టక్కర్ అధికారులను ఆదేశించారు. నైరుతి రుతుపవనాల సీజన్ దగ్గర పడుతున్న నేపథ్యంలో విపత్తుల సన్నద్ధతపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో సచివాలయంలో శుక్రవారం ఆయన సమీక్షించారు.నిత్యావసర సరుకులు అవసరమైన మేరకు స్టాకును సిద్ధంగా ఉంచుకోవాలని పౌరసరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. -
కొత్త సీఎస్ టక్కర్
♦ నేడు పదవీ బాధ్యతల స్వీకరణ ♦ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్‌గా ఐవైఆర్ ♦ అర్చక, ఇతర ఉద్యోగుల సంక్షేమనిధి ♦ ట్రస్టు చైర్మన్‌గానూ నియామకం సాక్షి, హైదరాబాద్: ఊహించినట్టే రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి(సీఎస్)గా సత్యప్రకాశ్ టక్కర్ నియమితులయ్యారు. 1981 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన సీనియర్ అధికారి అయిన టక్కర్‌ను సీఎస్‌గా నియమిస్తూ సాధారణ పరిపాలన శాఖ(రాజకీయ) కార్యదర్శి శశిభూషణ్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. టక్కర్ ప్రణాళికా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో టక్కర్ శనివారం సాయంత్రం సచివాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. వచ్చే ఆగస్టు వరకు ఈ పదవిలో ఆయన కొనసాగుతారు. ఆగస్టు నెలాఖరుకు పదవీ విరమణ చేస్తారు. సీనియారిటీ ప్రకారం చూస్తే ఐవైఆర్ తరువాత 1980 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన అశ్వనికుమార్ పరీడా సీఎస్ అవ్వాల్సి ఉంది. అయితే బాక్సైట్ వ్యవహారంలో ప్రభుత్వంలోని ‘ముఖ్య’ నేతకు పరీడా అనుసరించిన వైఖరి నచ్చలేదు. దీనికితోడు సీఎం పదవి చేపట్టినప్పటినుంచి చంద్రబాబు చెబుతూ వస్తున్న గ్రిడ్లు, మిషన్లు, డబుల్ డిజిట్ గ్రోత్లపై టక్కర్ తొలినుంచీ ప్రెజెంటేషన్లను రూపొందించి ఆయనకు అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎస్ పదవికి టక్కర్వైపే చంద్రబాబు మొగ్గుచూపారు. ఐవైఆర్ సేవలకు గుర్తుగా... మరోవైపు నెలాఖరుకు సీఎస్‌గా పదవీ విరమణ చేయనున్న ఐ.వై.ఆర్. కృష్ణారావును బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది. అలాగే రాష్ట్ర దేవాదాయశాఖ అర్చక, ఇతర ఉద్యోగుల సంక్షేమనిధి ట్రస్టు చైర్మన్‌గానూ నియమించింది. ఈ మేరకు దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శి జె.ఎస్.వి.ప్రసాద్ శుక్రవారం రెండు జీవోలు జారీ చేశారు. బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి ఐవైఆర్ మూడేళ్లపాటు పదవిలో కొనసాగుతారు. చైర్మన్ హోదాలో ఐవైఆర్‌కు నెలసరి అలవెన్సులు, సిబ్బంది సంఖ్యను కూడా ఖరారు చేస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయించడంలో సీఎస్ హోదాలో కృష్ణారావు కృషి చేశారు. ఈ నేపథ్యంలో ఆయన్నే కార్పొరేషన్ చైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది. -
కొత్త సీఎస్‌గా సత్యప్రకాష్ ఠక్కర్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కొత్త ప్రధాన కార్యదర్శిగా సత్యప్రకాష్ ఠక్కర్ నియమితులు కానున్నారు. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు పదవీ కాలం ఈనెల 31వ తేదీతో ముగుస్తోంది. దాంతో ఆయన స్థానంలో కొత్త సీఎస్‌గా ఠక్కర్‌ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న ఐవైఆర్ కృష్ణారావు పదవీకాలాన్ని కొంతకాలం పొడిగించాలని, లేదా ఆయన సేవలను కొన్నాళ్ల పాటు ఉపయోగించుకోవాలని సీఎం చంద్రబాబు భావించారు. చివరకు ఆయనను ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్‌కు చైర్మన్‌గా నియమించాలని నిర్ణయించారు. సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన సత్యప్రకాష్ ఠక్కర్ ప్రస్తుతం ప్రణాళికా శాఖలో ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆయన యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ నుంచి న్యాయవిద్యలో పట్టభద్రులయ్యారు. 1981 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. 2004 నుంచి 2010 వరకు నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. అభివృద్ధి ప్రణాళికా రచనలో దాదాపు మూడు దశాబ్దాల అనుభవం ఆయనకు ఉంది. 2010 నవంబర్ నుంచి ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు.