కొత్త సీఎస్‌గా సత్యప్రకాష్ ఠక్కర్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కొత్త ప్రధాన కార్యదర్శిగా సత్యప్రకాష్ ఠక్కర్ నియమితులు కానున్నారు. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు పదవీ కాలం ఈనెల 31వ తేదీతో ముగుస్తోంది. దాంతో ఆయన స్థానంలో కొత్త సీఎస్‌గా ఠక్కర్‌ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి.
ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న ఐవైఆర్ కృష్ణారావు పదవీకాలాన్ని కొంతకాలం పొడిగించాలని, లేదా ఆయన సేవలను కొన్నాళ్ల పాటు ఉపయోగించుకోవాలని సీఎం చంద్రబాబు భావించారు. చివరకు ఆయనను ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్‌కు చైర్మన్‌గా నియమించాలని నిర్ణయించారు. సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన సత్యప్రకాష్ ఠక్కర్ ప్రస్తుతం ప్రణాళికా శాఖలో ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
ఆయన యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ నుంచి న్యాయవిద్యలో పట్టభద్రులయ్యారు. 1981 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. 2004 నుంచి 2010 వరకు నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. అభివృద్ధి ప్రణాళికా రచనలో దాదాపు మూడు దశాబ్దాల అనుభవం ఆయనకు ఉంది. 2010 నవంబర్ నుంచి ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు.