శాఖాధిపతుల కేంద్రం.. ఇబ్రహీంపట్నం
- ఆంజనేయ టవర్స్‌లో ఎక్కువ శాఖల కార్యాలయాలు
- 27వ తేదీ కల్లా తరలివెళ్లేందుకు శాఖాధిపతుల ఏర్పాట్లు
- రెయిన్ ట్రీ పార్కులో ఐఏఎస్ అధికారులకు వసతి
- రవాణా చార్జీలపై నేడో రేపో ఉత్తర్వులు జారీ
- తరలింపు చర్యలపై సీఎస్ ఉన్నతస్థాయి సమీక్ష
సాక్షి, హైదరాబాద్: శాఖాధిపతుల కార్యాలయాలకు విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం కేంద్రం కానుంది. హైదరాబాద్ నుంచి నూతన రాజధాని ప్రాంతానికి తరలివెళ్లే శాఖాధిపతుల కార్యాలయాలు అత్యధిక భాగం ఇబ్రహీంపట్నంలోనే ఏర్పాటు కానున్నాయి. ఇబ్రహీంపట్నంలోని అంజనేయ టవర్స్‌లో ఎక్కువమంది శాఖాధిపతులు తమ కార్యాలయాల కోసం అద్దెకు తీసుకున్నారు. ఈ నెల 27వ తేదీ కల్లా శాఖాధిపతుల కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగుల్లో ఎంతో కొంత మంది నూతన రాజధాని ప్రాంతం నుంచి పనిచేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. 27వ తేదీ కల్లా శాఖాధిపతుల కార్యాలయాలను నూతన రాజధాని ప్రాంతం విజయవాడ-గుంటూరులకు తరలించేందుకు తీసుకున్న చర్యలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సత్య ప్రకాశ్ టక్కర్ సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రతీ శాఖాధిపతిని నూతన రాజధానిలో కార్యాలయాల గుర్తింపు, అద్దెకు తీసుకోవడంపై సీఎస్ అడిగి తెలుసుకున్నారు.
రవాణా చార్జీల ఖరారు..
అన్ని శాఖాధిపతులు కార్యాలయాలను గుర్తించినట్లు సమీక్షలో తెలిపారు. శాఖాధిపతుల కార్యాలయాల్లో ఫర్నీచర్, ఫైళ్లు, కంప్యూటర్ల తరలింపునకై రవాణా చార్జీలను కూడా ఖరారు చేశామని, నేడో రేపో ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు రహదారులు-భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంబాబ్ సమీక్షలో తెలిపారు. ఇబ్రహీంపట్నం నుంచి హైదరాబాద్‌కు రావడానికి, హైదరాబాద్ నుంచి ఇబ్రహీంపట్నం వెళ్లడానికి అనువుగా ఉంటుందనే భావనతోనే అత్యధిక శాతం శాఖాధిపతుల కార్యాలయాలను ఇంబ్రహీంపట్నంలో చూసుకున్నారు. ఇలా ఉండగా అఖిల భారత సర్వీసు అధికారులకు నివాస వసతిని రెయిన్ ట్రీ పార్కులో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రెయిన్ ట్రీ పార్కులోనే కుటుంబాలతో ఉండే అధికారులకు, అలాగే బ్యాచ్‌లర్ నివాస వసతిని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆర్థిక శాఖకు చెందిన శాఖాధిపతుల కార్యాలయాలన్నీ కూడా ఇబ్రహీంపట్నంలోనే ఉండనున్నాయి. కొద్దిమంది శాఖాధిపతులు తమ కార్యాలయాలను ఈ నెల 24వ తేదీ నుంచే తరలించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు