rain tree park
-
మహిళా ఉద్యోగులకు 6నెలల ఉచిత వసతి
గుంటూరు: అమరావతి వచ్చే మహిళా ఉద్యోగుల వసతి ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్గదర్శాకాలు జారీ చేసింది. ఆరు నెలల పాటు మహిళా ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం ఉచితంగా నివాస సదుపాయం కల్పించనుంది. సచివాలయ మహిళా ఉద్యోగులకు రెయిన్ ట్రీ పార్క్‌లో నివాస సదుపాయాలు కల్పించనుంది. వసతి సదుపాయం కావలసిన మహిళా ఉద్యోగులు ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. -
శాఖాధిపతుల కేంద్రం.. ఇబ్రహీంపట్నం
- ఆంజనేయ టవర్స్‌లో ఎక్కువ శాఖల కార్యాలయాలు - 27వ తేదీ కల్లా తరలివెళ్లేందుకు శాఖాధిపతుల ఏర్పాట్లు - రెయిన్ ట్రీ పార్కులో ఐఏఎస్ అధికారులకు వసతి - రవాణా చార్జీలపై నేడో రేపో ఉత్తర్వులు జారీ - తరలింపు చర్యలపై సీఎస్ ఉన్నతస్థాయి సమీక్ష సాక్షి, హైదరాబాద్: శాఖాధిపతుల కార్యాలయాలకు విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం కేంద్రం కానుంది. హైదరాబాద్ నుంచి నూతన రాజధాని ప్రాంతానికి తరలివెళ్లే శాఖాధిపతుల కార్యాలయాలు అత్యధిక భాగం ఇబ్రహీంపట్నంలోనే ఏర్పాటు కానున్నాయి. ఇబ్రహీంపట్నంలోని అంజనేయ టవర్స్‌లో ఎక్కువమంది శాఖాధిపతులు తమ కార్యాలయాల కోసం అద్దెకు తీసుకున్నారు. ఈ నెల 27వ తేదీ కల్లా శాఖాధిపతుల కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగుల్లో ఎంతో కొంత మంది నూతన రాజధాని ప్రాంతం నుంచి పనిచేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. 27వ తేదీ కల్లా శాఖాధిపతుల కార్యాలయాలను నూతన రాజధాని ప్రాంతం విజయవాడ-గుంటూరులకు తరలించేందుకు తీసుకున్న చర్యలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సత్య ప్రకాశ్ టక్కర్ సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రతీ శాఖాధిపతిని నూతన రాజధానిలో కార్యాలయాల గుర్తింపు, అద్దెకు తీసుకోవడంపై సీఎస్ అడిగి తెలుసుకున్నారు. రవాణా చార్జీల ఖరారు.. అన్ని శాఖాధిపతులు కార్యాలయాలను గుర్తించినట్లు సమీక్షలో తెలిపారు. శాఖాధిపతుల కార్యాలయాల్లో ఫర్నీచర్, ఫైళ్లు, కంప్యూటర్ల తరలింపునకై రవాణా చార్జీలను కూడా ఖరారు చేశామని, నేడో రేపో ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు రహదారులు-భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంబాబ్ సమీక్షలో తెలిపారు. ఇబ్రహీంపట్నం నుంచి హైదరాబాద్‌కు రావడానికి, హైదరాబాద్ నుంచి ఇబ్రహీంపట్నం వెళ్లడానికి అనువుగా ఉంటుందనే భావనతోనే అత్యధిక శాతం శాఖాధిపతుల కార్యాలయాలను ఇంబ్రహీంపట్నంలో చూసుకున్నారు. ఇలా ఉండగా అఖిల భారత సర్వీసు అధికారులకు నివాస వసతిని రెయిన్ ట్రీ పార్కులో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రెయిన్ ట్రీ పార్కులోనే కుటుంబాలతో ఉండే అధికారులకు, అలాగే బ్యాచ్‌లర్ నివాస వసతిని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆర్థిక శాఖకు చెందిన శాఖాధిపతుల కార్యాలయాలన్నీ కూడా ఇబ్రహీంపట్నంలోనే ఉండనున్నాయి. కొద్దిమంది శాఖాధిపతులు తమ కార్యాలయాలను ఈ నెల 24వ తేదీ నుంచే తరలించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు -
హైదరాబాద్ రన్నర్స్..
-
ఐపీఎస్‌ల భార్యలతో డీజీపీ సతీమణి సమావేశం
విజయవాడ సిటీ: రాష్ట్ర డీజీపీ జె.వి.రాముడు సతీమణి జె.పద్మావతి మంగళవారం సీనియర్ పోలీసు అధికారుల సతీమణులతో అతిథి గృహంలో సమావేశమయ్యారు. జూన్ నాటికి విజయవాడ వచ్చేందుకు ఉన్న ఇబ్బందులు, తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. వచ్చే జూన్ నాటికి అధికార యంత్రాంగం విజయవాడకు తరలి రావాలంటూ ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో సీనియర్ పోలీసు అధికారుల భార్యలతో ఆమె సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. విజయవాడకు రావాల్సిన ఆవశ్యకత ఆమె వారికి వివరించినట్టు తెలిసింది. ఇదే సమయంలో వారితో కలసి ఉన్నతాధికారుల వసతి కోసం నిర్దేశించిన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సమీపంలోని రెయిన్ ట్రీ పార్కు భవనాలను పరిశీలించారు. -
రెయిన్‌ట్రీ తో అద్దె బేరాలు పూర్తి
హైదరాబాద్: రాజధాని ప్రాంతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్‌కే చెందిన రెయిన్ ట్రీ పార్కులో మంత్రులు, ఎమ్మెల్యేలు, అఖిల భారత సర్వీసు అధికారుల నివాసాలకు అపార్టుమెంట్లను, విల్లాలను మూడేళ్ల పాటు అద్దెకు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా కలెక్టర్ రెయిన్ ట్రీ పార్కు యాజమాన్యంతో సంప్రదింపులను చేశారు. ఆ సంస్థ యాజమాన్యం ప్రతిపాదనలకు యనమల ఆమోదం తెలిపారు. వాటికి సీఎం ఆమోదమే తరువాయి. రెయిన్ ట్రీ పార్కులోని అపార్టుమెంట్లలో 500 ఫ్లాట్లు, 100 విల్లాలు ఖాళీగా ఉన్నాయి. ఫ్లాట్లను అఖిల భారత సర్వీసు అధికారుల కోసం, 100 విల్లాలను మంత్రులు, ఎమ్మెల్యేల కోసం అద్దెకు తీసుకోవాలని నిర్ణయించారు. తాత్కాలిక సచివాలయం ఎక్కడో ఇంకా చెప్పకుండా రెయిన్ ట్రీ పార్కు యాజమాన్యానికి ప్రయోజనం చేకూర్చేందుకే ప్రభుత్వ పెద్దలు ఆరాటపడుతున్నారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. నూతన రాజధాని ప్రాంతం గుంటూరు, కృష్ణా జిల్లాల్లో అద్దెలు ఎక్కువగా ఉండటంతో అధికారులు అద్దె నియంత్రణ చట్టం తీసుకురావాలని ప్రతిపాదించారు. అయితే ముఖ్యమంత్రి దీనికి అంగీకరించలేదు. ఫ్లాట్లు, విల్లాలకు రూ. 12 వేలు, 30 వేలు అద్దెగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ అద్దెలు ఏటా 7 శాతం పెరుగుతాయి. 2 నెలల అద్దె అడ్వాన్స్‌గా చెల్లించాల్సి ఉంటుంది. ఫ్లాట్లలో ఉండేవారు పలు నిర్వహణ చార్జీలు చెల్లించాలని, అవి ఎప్పటికప్పుడు మారుతాయని రెయిన్ ట్రీ యాజమాన్యం పేర్కొంది. అయితే నూతన రాజధానిలో తాత్కాలిక సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలు ఎక్కడ ఏర్పాటు చేయాలో ఇంకా ఖరారు చేయని రాష్ట్ర ప్రభుత్వం.. మరో పక్క మంత్రులు, ఎమ్మెల్యేలు, అఖిల భారత సర్వీసు అధికారుల నివాసాలను మాత్రం నిర్ధారించింది. సదుపాయాల కోసం ఫ్లాట్లలో ఉండేవారు చెల్లించాల్సిన బిల్లులపై ఆ సంస్థ ప్రతిపాదనలు ఈ విధంగా ఉన్నాయి. నెలకు జిమ్‌కు రూ. 500, స్విమ్మింగ్ పూల్‌కు రూ. 600, గేమ్స్‌కు రూ. 500 చొప్పున చెల్లించాలి అద్దె చెల్లించేందుకు వీలుగా ప్రత్యేకంగా హెచ్డీఎఫ్సీ బ్యాంకులో ఎస్క్రో అకౌంట్ తెరవాలి. అద్దె అగ్రిమెంట్‌కు స్టాంపు డ్యూటీ 0.4 శాతం చెల్లించాల్సి ఉంది. దీన్ని మినహాయింపు ఇవ్వాలి. నిర్వహణ చార్జీలు కింద నెలకు చదరపు అడుగుకు రూపాయిన్నర చొప్పున అద్దెకు ఉండేవారు చెల్లించాలి. విద్యుత్ చార్జీలను, నీటి చార్జీలను అద్దెకు ఉండేవారు నెల నెలా చెల్లించాలి.