సీఎం సారూ.. తప్పు తప్పు | Two more IAS Officers opposed the anti people decisions of Chandrababu | Sakshi
Sakshi News home page

సీఎం సారూ.. తప్పు తప్పు

Published Thu, Nov 22 2018 4:41 AM | Last Updated on Thu, Nov 22 2018 12:54 PM

Two more IAS Officers opposed the anti people decisions of Chandrababu - Sakshi

సత్యప్రకాశ్‌ టక్కర్, దినేశ్‌ కుమార్‌

సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న అక్రమ నిర్ణయాలను, ప్రభుత్వ దోపిడీ విధానాలను ఇప్పటిదాకా పనిచేసిన నలుగురు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు(సీఎస్‌) గట్టిగా ప్రతిఘటించారు. టీడీపీ సర్కారు అవినీతి, అక్రమాలపై మాజీ సీఎస్‌లు ఐవైఆర్‌ కృష్ణారావు, అజేయ కల్లాం ఇప్పటికే బహిరంగంగా గళమెత్తిన సంగతి తెలసిందే. రాష్ట్రంలో ప్రభుత్వ పెద్దలు బరితెగించారని, విచ్చలవిడిగా అవినీతి కార్యక లాపాలు సాగుతున్నాయని పలు వేదికలపై తెలియజేస్తున్నారు. సీఎస్‌లుగా పనిచేసిన మరో ఇద్దరు ఐఏఎస్‌ అధికారులు సత్యప్రకాశ్‌ టక్కర్, దినేశ్‌ కుమార్‌లు బయటకు వచ్చి బాహాటంగా మాట్లాడకపోయినప్పటికీ సీఎస్‌ హోదాలో వారు టీడీపీ ప్రభుత్వ దోపీడీ చర్యలను తీవ్రంగా వ్యతిరేకించారు. సంబంధిత ఫైళ్లపై తమ అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడించారు. సర్కారు తప్పుడు నిర్ణయాలతో రాష్ట్ర ఖజానాకు ఎలాంటి నష్టం వాటిల్లుతుందో తెలయజేశారు. సాధారణంగా కేబినెట్‌ గానీ, ముఖ్యమంత్రి గానీ ప్రజలకు ఆర్థిక ప్రయోజనం కలిగించే సబ్సిడీ పథకాలపై అధికారులు వద్దన్నప్పటికీ నిర్ణయాలు తీసుకుంటారు. రాష్ట్ర ఖజానాపై, ప్రజలపై భారం పడే నిర్ణయాలను అధికారులు వద్దంటే ఏ ముఖ్యమంత్రి, కేబినెట్‌ తీసుకోదు. అయితే, చంద్రబాబు మాత్రం స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ఖజానాకు గండికొడుతూ పలు నిర్ణయాలు తీసుకున్నారు. 

సీఎస్‌ వ్యతిరేకించారని చట్టాన్నే మార్చేశారు
రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో స్విస్‌ చాలెంజ్‌ విధానంలో సింగపూర్‌ కంపెనీల ప్రతిపాదనలను చట్టానికి విరుద్ధంగా ముందుగా ముఖ్యమంత్రి ఆమోదించేసిన తరువాత సీఎస్‌ నేతృత్వంలోని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అథారిటీకి పంపించడంపై అప్పటి సీఎస్‌ సత్యప్రకాశ్‌ టక్కర్‌ ఘాటుగా స్పందించారు. ఇదేం పద్ధతి అని ప్రశ్నించారు. సంబంధిత ఫైల్‌ను తొలుత ముఖ్యమంత్రి ఆమోదించిన తర్వాత అధికారులకు పంపడంపై ఉన్నతస్థాయి సమావేశంలో టక్కర్‌ విస్మయం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ ఎనేబిలింగ్‌ చట్టం(ఏపీఐడీఈఏ) నిబంధన  ప్రకారం స్విస్‌ చాలెంజ్‌ విధానంలో సింగపూర్‌ కంపెనీలు చేసిన ప్రతిపాదనలను సీఆర్‌డీఏ అధ్యయనంచేసిన తరువాత సీఎస్‌ నేతృత్వంలోని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అథారిటీ పరిశీలనకు పంపించాలి. ఆ అథారిటీకి విస్తృత అధికారాలున్నాయి. అయితే, ఇందుకు విరుద్ధంగా సింగపూర్‌ కంపెనీల ప్రతిపాదనలపై ఆర్థిక మంత్రి నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ రెండుసార్లు చర్చలు జరిపింది.

అంతకు ముందు సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు సంప్రదింపులు జరిపారు. మంత్రుల కమిటీ, సీఎం ఆమోదించిన తరువాత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అధారిటీకి ప్రతిపాదనలను పంపించారు. దీనిపై సీఎస్‌ టక్కర్‌ తీవ్రంగా స్పందించారు. సీఎం, మంత్రుల కమిటీ ఆమోదం తెలిపాక ఇక మంత్రివర్గానికి పంపాలి తప్ప అధికారులతో కూడిన అథారిటీకి కాదన్నారు. ప్రభుత్వ పెద్దలు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అధికారులు కూడా ఆమోదించారని చిత్రీకరించడానికి సీఎస్‌ నేతృత్వంలోని అథారిటీకి పంపించారని ఉన్నతాధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది స్విస్‌ చాలెంజ్‌ విధానంలా లేదని, నామినేషన్‌ విధానంలా ఉందని పేర్కొన్నారు. సింగపూర్‌ కంపెనీల ప్రతిపాదనలపై నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయం తీసుకోలేమని సీఎస్‌ టక్కర్‌ తేల్చిచెప్పారు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏకంగా చట్టాన్నే మార్చేశారు. సీఎస్‌ నేతృత్వంలోని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అథారిటీని తొగిస్తూ చట్టంలో సవరణలు తీసుకొచ్చారు. ఇదే అంశంపై హైకోర్టులో ప్రజా ప్రయోజనం వ్యాజ్యం(పిల్‌) దాఖలైంది. కోర్టు విచారణకు స్వీకరించి ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. 

అసైన్డు భూదందాకు బ్రేక్‌ 
కాకినాడ సెజ్‌కు గతంలో కేటాయించిన 1,589.74 ఎకరాల్లో 1,396.91 ఎకరాల అసైన్డ్‌ భూమితోపాటు 72 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ మొత్తం భూమిని పరిశ్రమల కోసమంటూ రైతుల నుంచి సేకరించి కాకినాడ సెజ్‌కు లీజుకిచ్చారు. అయితే, ఇప్పుడు ఆ అసైన్డ్‌ భూములను విక్రయించాలంటే సాధ్యం కాదని టక్కర్‌ స్పష్టం చేశారు. ఈ భూములను ప్రైవేట్‌ సంస్థకు విక్రయించేందుకు వీలుగా ఎస్‌ఈజడ్‌ నుంచి తొలుత ఏపీఐఐసీ డీనోటిఫై చేసింది. రైతుల నుంచి సేకరించిన అసైన్డ్‌ భూములను లీజుకు కాకుండా సర్వహక్తులతో ప్రైవేట్‌ సంస్థ పేరిట రిజిస్ట్రేషన్‌ చేయడం నిబంధనలకు విరుద్ధమని, దీనికి ఒప్పుకునే ప్రసక్తే లేదని టక్కర్‌ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఎన్నిసార్లు ఒత్తిడి తెచ్చినా ఆయన అంగీకరించలేదు. 

డిస్కంలను ముంచేస్తారా? 
రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు భారీ విద్యుత్‌ కొనుగోలు కుంభకోణానికి తెరతీయగా దాన్ని అడ్డుకోవడానికి సీఎస్‌గా పనిచేసి, ఇటీవల రిటైరైన దినేశ్‌ కుమార్‌ అన్ని ప్రయత్నాలు చేశారు. అయినా సరే ముఖ్యమంత్రి కేబినెట్‌లో పెట్టి మరీ ప్రైవేట్‌ విద్యుత్‌ సంస్థకు ఆర్థిక ప్రయోజనం కలిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో మిగలు విద్యుత్‌ ఉందని, ఎక్కువ ధరకు సుజ్లాను ప్రైవేట్‌ సంస్థ నుంచి పవన్‌ విద్యుత్‌ కొనుగోలుకు అంగీకరించరాదని సీఎస్‌ దినేశ్‌ కుమార్‌ స్పష్టం చేశారు. విద్యుత్‌ పంపిణీ సంస్థలు(డిస్కంలు) ఇప్పటికే నష్టాల్లో కొనసాగుతున్నాయని, పవన విద్యుత్‌ను యూనిట్‌ రూ.4.84 చొప్పున కొనుగోలు చేయడానికి ఒప్పందాలు చేసుకోవడం తగదని చెప్పారు. ఇప్పటికే ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తున్న ఒప్పందాలను సమీక్షించి, తక్కువ ధరకు కరెంటు కొనుగోలు చేయడంపై దృష్టి సారించాలని సూచించారు. సుజ్లాన్‌తో కొనుగోలు ఒప్పందం చేసుకుంటే నాలుగేళ్లలో డిస్కంలపై రూ.1,000 కోట్ల అదనపు భారం పడుతుందని, దీన్ని చివరకు విద్యుత్‌ వినియోగదారులే భరించాల్సి వస్తుందని పేర్కొన్నారు. అయినా ముఖ్యమంత్రి లెక్కచేయలేదు. హిందూజా థర్మల్‌ విద్యుత్తు కేంద్రం నుంచి కరెంటు కొనుగోలు ఒప్పందాలు చేసుకోవద్దని కూడా ప్రభుత్వానికి దినేష్‌కుమార్‌ స్పష్టం చేశారు. 

సాగునీటి ప్రాజెక్టుల్లో అక్రమాలపై నిలదీత 
ప్రభుత్వ పెద్దల ఒత్తిడి మేరకు హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం అంచనా వ్యయాన్ని రూ.6,850 కోట్ల నుంచి ఏకంగా రూ.11,722 కోట్లకు పెంచేస్తూ జలవనరుల శాఖ ప్రతిపాదనలు పంపింది. ఈ ప్రతిపాదనలను సర్కార్‌ ఆమోదించక ముందే ప్రభుత్వ పెద్దలు పాత కాంట్రాక్టర్లపై 60సీ నిబంధన కింద వేటు వేసి.. మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని పెంచేసి, కోటరీ కాంట్రాక్టర్లకు కట్టబెట్టి, భారీగా కమీషన్లు దండుకునేందుకు స్కెచ్‌ వేశారు. అంచనా వ్యయాన్ని పెంచేసే ప్రతిపాదనలను అంగీకరించే ప్రశ్నే లేదని సీఎస్‌ టక్కర్‌ తేల్చిచెప్పారు. దాంతో సీఎం చంద్రాబు హంద్రీ–నీవా అంచనా వ్యయాన్ని పెంచే ప్రతిపాదనపై కేబినెట్‌లో ఆమోదముద్ర వేయించారు. ఏలేరు ఆధునికీకరణ, చింతలపూడి ఎత్తిపోతల పథకం విస్తరణ పనుల టెండర్లలో కాంట్రాక్టర్లు, ప్రభుత్వ పెద్దలు కుమ్మక్కు కావడాన్ని హైపవర్‌ కమిటీ ఛైర్మన్‌ హోదాలో సీఎస్‌ దినేష్‌కుమార్‌ నిలదీశారు. కాంట్రాక్టర్లు కుమ్మక్కై అధిక ధరలకు షెడ్యూళ్లు దాఖలు చేస్తే టెండర్ల విధానానికి అర్థం ఏముంటుందని ప్రశ్నించారు. ఈ అక్రమాలను సహించేది లేదని సీఎస్‌ దినేష్‌కుమార్‌ పేర్కొనడంతో ఏకంగా టెండర్ల విధానంలో హైపవర్‌ కమిటీ పాత్ర లేకుండా ప్రభుత్వం దాన్ని రద్దు చేయడం గమనార్హం.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement