విజయవాడ: నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నియామకంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. ప్రస్తుత సీఎస్ టక్కర్ పదవీ కాలం రేపటితో (మంగళవారం)తో ముగియనుంది. దీంతో ఆయన స్థానంలో కొత్త సీఎస్ కోసం ప్రభుత్వం సమాచాలోచనలు చేస్తోంది. కాగా కొత్త సీఎస్ రేసులో అజయ్ కల్లాం, దినేష్ కుమార్, అనిల్ చంద్ర పునీత్ ఉన్నారు. కాగా అజయ్ కల్లాంను సీఎస్‌గా నియమించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావించినట్లు తెలుస్తోంది.
అయితే ఆయన మార్చి 31న పదవీ విరమణ చేయనున్నారు. దీంతో నెలలో రిటైర్ అయ్యే అధికారికి.. పదవీకాలం పొడిగింపు కుదరదని డీవోపీటీ, పీఎంవో స్పష్టం చేసింది. అజయ్ కల్లాం ప్రస్తుతం ఫైనాన్స్ విభాగం ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. ఆయన పదవీ పొడిగింపు కుదరదని తేల్చిచెప్పడంతో ఈ నేపథ్యంలో అజయ్ కల్లాం నియామకంపై సందిగ్ధత నెలకొంది. దీంతో సీనియారిటీ జాబితాలో గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి దినేశ్ కుమార్ ను పూర్తిస్థాయి సీఎస్‌గా నియమించడంపై ప్రభుత్వం పరిశీలన చేస్తున్నట్లు సమాచారం.