జూన్ 27వ తేదీ నుంచి కొత్త రాజధాని నుంచే శాఖాధిపతుల కార్యాలయాలు పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
సాక్షి, హైదరాబాద్: జూన్ 27వ తేదీ నుంచి కొత్త రాజధాని నుంచే శాఖాధిపతుల కార్యాలయాలు పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ లోగా అవి హైదరాబాద్ నుంచి రాజధాని ప్రాంతం గుంటూరు, విజయవాడలకు తరలి వెళ్లాల్సిందేనని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సత్యప్రకాశ్ టక్కర్ బుధవారం సర్క్యులర్ జారీ చేశారు. తొలి ప్రాధాన్యంగా శాఖలకు చెందిన ప్రభుత్వ భవనాలు ఉంటే అక్కడికి తరలి వెళ్లాలని చెప్పారు. లేదంటే గుంటూరు, విజయవాడల్లో ఆ జిల్లాల కలెక్టర్లు ప్రవేట్ భవనాలను గుర్తించారని, వెంటనే ఆ భవనాలు పరిశీలించి అద్దెకు తీసుకోవడంతో పాటు జూన్ 27లోగా వెళ్లాలన్నారు.
హైదరాబాద్‌లోని కార్యాలయాల్లో ఫర్నిచర్, పరికరాలతోపాటు ఉద్యోగులందరూ ఆలోగా తరలివెళ్లాల్సిందేనని పేర్కొన్నారు. కృష్ణా జిల్లా కలెక్టర్ ఇప్పటికే 16,96,231 చదరపు అడుగుల నిర్మాణ స్థలం గల 85 ప్రైవేట్ భవనాలను గుర్తించారని, 2,34,000 చ.అడుగుల పార్కింగ్ స్థలాన్ని గుర్తించారని తెలిపారు. గుంటూరు జిల్లా కలెక్టర్ 1,50,000 చ.అడుగుల నిర్మాణ స్థలమున్న నాలుగు ప్రైవేట్ భవనాలను గుర్తించారన్నారు.ఉన్నతాధికారులు ఆ జిల్లా ల కలెక్టర్ల సాయంతో ఆ భవనాలను పరిశీలించి అద్దె ఒప్పందాలను చేసుకోవాలన్నారు. రాష్ట్ర విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10ల్లో ఉన్న సంస్థలు మినహా మిగతా శాఖాధిపతుల కార్యాలయాలన్నీ తరలివెళ్లాల్సిందేనని ఉద్ఘాటించారు.
భారీగా అద్దెలు చెల్లించేందుకు సిద్ధం
శాఖాధిపతుల కార్యాలయాలకు అవసరమైన ప్రైవేట్ భవనాలకు ఎంత వరకైనా అద్దె చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల అధికారుల సమావేశంలో స్పష్టం చేశారు. చదరపు అడుగుకు రూ.25 వరకు నెలకు అద్దె చెల్లించేందుకు కూడా వెనుకాడేది లేదని ఆయన తెలిపారు.