గర్భిణులను చెట్ల కింద వదిలేస్తారా?
- కోఠి ప్రసూతి ఆస్పత్రిలో వసతులపై హైకోర్టు ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: ‘ఆస్పత్రికి చికిత్స కోసం ఎంత మంది వచ్చినా వారికి తగిన ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. సామర్థ్యానికి మించి రోగులు వస్తే చికిత్స నిమిత్తం వేరే ఆస్పత్రికి తరలించాలే తప్ప, ఇలా చెట్లు, పుట్ల కింద వదిలేస్తే ఎలా’ అని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైదరాబాద్‌లోని కోఠి ప్రసూతి ఆస్పత్రిలో వసతులపై తాము సంతృప్తికరంగా లేమని వ్యాఖ్యానించింది. ఆస్పత్రిలోని పరిస్థితులను పరిశీలించేందుకు మహిళా న్యాయవాదులు జయంతి, పద్మజలతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. అక్కడున్న సౌకర్యాలపై మూడు వారాల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది.
ఈ ఇద్దరు న్యాయవాదుల ఆస్పత్రి సందర్శనకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కోఠి ప్రసూతి ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రసూతి ఆస్పత్రిలో సరైన వసతులు లేక గర్భిణిలు చెట్ల కింద పడుకుంటున్న వైనంపై పత్రికల్లో వచ్చిన కథనాలను సుమోటోగా స్వీకరించాలని కోరుతూ ఏసీజే జస్టిస్ దిలీప్ బి.బొసాలేకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యు.దుర్గాప్రసాదరావు లేఖ రాశారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఏసీజే పత్రిక కథనాలను పిల్‌గా మలచాలని రిజిస్ట్రీని ఆదేశించారు. ఈమేరకు వ్యాజ్యాన్ని జస్టిస్ బొసాలే నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారించింది. ఈ సందర్భంగా కోఠి ప్రసూతి ఆస్పత్రిలో పరిస్థితులపై తాము ఎంత మాత్రం సంతృప్తికరంగా లేమన్న ధర్మాసనం వ్యాఖ్యానించింది. అంతేకాకుండా కోఠి ప్రసూతి ఆస్పత్రిలో పరిస్థితులపై నివేదిక ఇచ్చేందుకు ఇద్దరు మహిళా న్యాయవాదులతో కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.