Kothi maternity hospital
-
నాటి చావులు గుర్తులేవా కేటీఆర్?
సాక్షి, హైదరాబాద్: ‘‘గత ప్రభుత్వ హయాంలో 2017లో కోఠి మెటర్నిటీ ఆస్పత్రిలో మూడు రోజు ల్లో ఆరుగురు బాలింతలు, అదే ఏడాది ఐదు రోజు ల వ్యవధిలో నిలోఫర్ ఆస్పత్రిలో ఐదుగురు బాలింతలు, 2022లో డీపీఎల్ పద్ధతిలో చేసిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్లతో నలుగురు మహిళలు, 2019లో జూన్, జూలై నెలల్లో డెంగీతో 100 మంది చనిపోవడం.. ఇవన్నీ గుర్తులేవా కేటీఆర్? గత ప్ర భుత్వం శాశ్వత పరిష్కారాన్ని చూపకనే పేదలకు వైద్యం అందని ద్రాక్షగా మారింది..’’ అని వైద్యారో గ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ విమర్శించారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన జారీచేశారు.గత పదేళ్లలో నిర్వీర్యమైన వైద్య రంగాన్ని తాము గాడిలో పెడుతున్నామని దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. బీఆర్ఎస్ రాజకీయం కోసం ఆస్పత్రులను వేదికగా వాడుకోవడం సరికాదని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో అనేక దుర్ఘటనలు జరిగాయని.. అవన్నీ బీఆర్ఎస్ నిజనిర్ధారణ కమిటీ తెలంగాణ సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. గాంధీ ఆస్పత్రిపై బురదజల్లే ప్రయత్నాలను మానుకోవాలని డాక్టర్లు విజ్ఞప్తి చేసినా.. కేటీఆర్‌కు తలకు ఎక్కడం లేదని మంత్రి మండిపడ్డారు. ఖాళీలకు బాధ్యులు ఎవరు? ‘‘తప్పుడు సమాచారంతో ట్వీట్ చేసి, అడ్డంగా దొరికిపోయిన కేటీఆర్.. తప్పును కవర్ చేసుకునేందుకు ఫ్యాక్ట్ ఫైండింగ్ పేరిట డ్రామాలు చేస్తున్నారు. గత పదేళ్ల పాలనా వైఫల్యాలను పది నెలల ప్రభుత్వానికి ఆపాదిస్తున్నారు. గాంధీ ఆస్పత్రి మరణాలను ప్రభుత్వ వైద్యుల వైఫల్యంగా చిత్రీకరించడం బీఆర్ఎస్ అజ్ఞానానికి నిదర్శనం. అసలు వైద్యారోగ్యశాఖలో ఖాళీలకు బాధ్యులు ఎవరు?’’ అని దామోదర రాజనర్సింహ ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో మూడేళ్లలో హడావుడిగా 25 మెడికల్ కళాశాల ఏర్పాటుకు జీవోలు ఇచ్చి చేతులు ఎత్తేశారని.. 3,368 మంది టీచింగ్ స్టాఫ్ అవసరమైతే, కేవలం 1,078 మందిని భర్తీ చేశారని మండిపడ్డారు. స్టాఫ్, సదుపాయాలు లేకుండా మొక్కుబడిగా మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసిన ఘనత బీఆర్ఎస్కే దక్కుతుందని విమర్శించారు. త్వరలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఆస్పత్రులలో అడ్మిని్రస్టేషన్ కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయబోతున్నామని మంత్రి దామోదర తెలిపారు. త్వరలోనే 612 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ చేపట్టబోతున్నామని వెల్లడించారు. కొత్త వైద్య కళాశాలల్లో డీఎంఈ కింద 19,530 పోస్టులకు ఆర్థికశాఖ అనుమతి ఇస్తే.. గత ప్రభుత్వం భర్తీ చేసింది 1,500 లోపేనని విమర్శించారు. తమ ప్రభుత్వం ఇప్పటికే అన్ని విభాగాల్లో కలిపి 7,308 పోస్టులు భర్తీ చేసిందని తెలిపారు. మరో 5,660 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. గాంధీ ఆస్పత్రిలో మాతాశిశు మరణాలు 2022లో 500 జరిగితే.. 2023లో 542 ఉండగా, 2024లో ఇప్పటివరకు 309 మరణాలు జరిగాయని వెల్లడించారు. నెలవారీ సగటు చూస్తే 2022లో 42 చొప్పున, 2023లో 45 చొప్పున, 2024లో 39 చొప్పున జరిగాయని వివరించారు. -
మరో మూడు ఆస్పత్రుల్లో నైట్ షెల్టర్లు ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగుల బంధువుల కోసం జీహెచ్ఎంసీ మరిన్ని నైట్ షెల్టర్లను ఏర్పాటు చేసింది. ఇప్పటికే 12 ఉండగా మరో మూడింటిని కొత్తగా ఏర్పాటు చేశారు. నిలోఫర్, మహావీర్, కోఠి ప్రసూతి ఆస్పత్రుల్లో రూ.4.8 కోట్లతో వీటిని ఏర్పాటు చేశారు. ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, నగర మేయర్ రామ్మోహన్‌లు వీటిని ప్రారంభించారు. ఇప్పటివరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న తమ వారి కోసం వచ్చే అటెండెంట్లు రాత్రివేళ బస చేసేందుకు సరైన నీడ లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నైట్ షెల్టర్లు వారికి ఎంతో ఉపయోగకరంగా ఉండనున్నాయి. -
గర్భిణులను చెట్ల కింద వదిలేస్తారా?
- కోఠి ప్రసూతి ఆస్పత్రిలో వసతులపై హైకోర్టు ఆగ్రహం సాక్షి, హైదరాబాద్: ‘ఆస్పత్రికి చికిత్స కోసం ఎంత మంది వచ్చినా వారికి తగిన ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. సామర్థ్యానికి మించి రోగులు వస్తే చికిత్స నిమిత్తం వేరే ఆస్పత్రికి తరలించాలే తప్ప, ఇలా చెట్లు, పుట్ల కింద వదిలేస్తే ఎలా’ అని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైదరాబాద్‌లోని కోఠి ప్రసూతి ఆస్పత్రిలో వసతులపై తాము సంతృప్తికరంగా లేమని వ్యాఖ్యానించింది. ఆస్పత్రిలోని పరిస్థితులను పరిశీలించేందుకు మహిళా న్యాయవాదులు జయంతి, పద్మజలతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. అక్కడున్న సౌకర్యాలపై మూడు వారాల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈ ఇద్దరు న్యాయవాదుల ఆస్పత్రి సందర్శనకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కోఠి ప్రసూతి ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రసూతి ఆస్పత్రిలో సరైన వసతులు లేక గర్భిణిలు చెట్ల కింద పడుకుంటున్న వైనంపై పత్రికల్లో వచ్చిన కథనాలను సుమోటోగా స్వీకరించాలని కోరుతూ ఏసీజే జస్టిస్ దిలీప్ బి.బొసాలేకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యు.దుర్గాప్రసాదరావు లేఖ రాశారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఏసీజే పత్రిక కథనాలను పిల్‌గా మలచాలని రిజిస్ట్రీని ఆదేశించారు. ఈమేరకు వ్యాజ్యాన్ని జస్టిస్ బొసాలే నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారించింది. ఈ సందర్భంగా కోఠి ప్రసూతి ఆస్పత్రిలో పరిస్థితులపై తాము ఎంత మాత్రం సంతృప్తికరంగా లేమన్న ధర్మాసనం వ్యాఖ్యానించింది. అంతేకాకుండా కోఠి ప్రసూతి ఆస్పత్రిలో పరిస్థితులపై నివేదిక ఇచ్చేందుకు ఇద్దరు మహిళా న్యాయవాదులతో కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. -
ఆ శిశువు బతికింది రెండుగంటలే..!
కోఠి ప్రసూతి ఆసుపత్రిలో దారుణం వైద్యుల నిర్లక్ష్యంతోనే శిశుమరణం జరిగిందంటున్న బంధువులు పత్తాలేని ఉన్నతాధికారులు సుల్తాన్‌బజార్: అది చిన్నారులకు ఆయువు పోసే ఆరోగ్యాలయం. నవమాసాలు మోసి బిడ్డలకు జన్మనివ్వాలనకున్న తల్లులకు కాన్పుచేసే ధర్మశాల. వైద్యులు, సిబ్బంది..ఒక్కరేమిటి అక్కడ పనిచేసే ప్రతీ ఒక్కరూ కర్తవ్యదీక్షా కంకణధారులై ఉంటారన్న విశ్వాసం అందరిదీ. అయితే ఇందుకు భిన్నంగా మారుతోంది సుల్తాన్‌బజార్ (కోఠి) ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి తీరు. తల్లుల గర్భంనుంచి ఈ లోకంలోకి అడుగు పెట్టాలనుకునే నవజాత శిశువుల స్వప్నాలను అది చిదిమేస్తోంది. బిడ్డల ఆయువుకు మధ్యలోనే చెల్లుచీటీ రాయించి కన్నవారికి శోకాన్ని మిగుల్చుతోంది. సరిగ్గా ఇలాంటి సంఘటనే ఆదివారం జరిగింది. ఆ ఆసుపత్రి ఒడిలో పుట్టిన ఓ మగబిడ్డ పట్టుమని రెండు గంటలు కూడా ఇక్కడి వాయువులను పీల్చుకోకుండా మృత్యు ఒడికి వెళ్లిపోయాడు. బాధితుల కథనం మేరకు..నల్గొండ జిల్లా నకిరేకల్‌కు చెందిన వెంకన్న, సుమలత దంపతులు దిల్‌సుఖ్‌నగర్‌లోని మారుతీ నగర్లో ఉంటున్నారు. సుమలతకు నెలలు నిండడంతో ఈ నెల2న కోఠి ప్రసూతి ఆసుపత్రిలో చేర్చారు. ఆమెకు సాధారణ కాన్పు కోసం ఆసుపత్రి డాక్టర్లు ప్రయత్నిస్తూ ఆదివారం తెల్లవారుజాము వరకు ఆగారు. వేకువన 4 గంటల వేళ నొప్పుల కోసం ఇంజెక్షన్ ఇచ్చారు. సుమలత 5 గంటల సమయంలో మగశిశువుకు జన్మనిచ్చింది. అంతా సంబర పడ్డారు. అక్కడికి రెండుగంటల వరకూ అంటే ఉదయం 7 గంటల వరకు బాగానే ఉన్న శిశువు ఆశ్చర్యకరంగా విగతజీవుడయ్యాడు. తండ్రి వెంకన్నకు అనుమానం వచ్చి చూడడంతో శిశువు తలకు గాయాలు కనిపించాయి. ప్రసవం సమయంలో శిశువును బయటకు తీసేందుకు పట్టకార్తో గట్టిగాలాగడం వల్లనే ఇలా జరిగిందనీ ఆయన తన బంధువులకు సమాచారం అందించారు. దీంతో వారు వచ్చి ఆసుపత్రి వద్ద బైఠాయించి ధర్నా నిర్వహించారు. వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. కన్నీరు మున్నీరయ్యేలా విలపిస్తూ ఆసుపత్రి తీరుపై ఆగ్రహం వెలిబుచ్చారు. ఇంత జరిగినా ఉన్నతాధికారులు అక్కడకు రాలేదు. బాధితులను ఊరడించ లేదు. తమనుంచి శిశువును దూరంచేసిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని బాధితుడు వెంకన్న కోరినా పట్టించుకున్న వారు లేరు. చివరికి పోలీసులకు ఉప్పంది వచ్చాక పరిస్థితి అదుపులోకి వచ్చింది. మా తప్పులేదు : వైద్యులు దీనిపై వైద్యులు స్పందిస్తూ కాన్పు విషయంలో తమ తప్పులేదనీ, బిడ్డ ఉమ్మనీరు మింగడం వల్ల, జన్యుపరమైన ఇతర లోపాల వల్ల మరణించాడని చెప్పారు. కాగా విషయం తెలుసుకొని అక్కడికి చేరుకున్న ఎస్.ఐ రామిరెడ్డి.. ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి వైద్యుల నిర్లక్ష్యం ఉంటే చర్యలు తీసుకుంటామని బాధితులకు నచ్చజెప్పారు. దీనితో బాధను దిగమింగుకొని వెంకన్న, అతని బంధువులు మృతశిశువును తమ సొంతూరుకు తీసుకువెళ్లారు. బాధితురాలు సుమలత ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.