ఆ శిశువు బతికింది రెండుగంటలే..!
కోఠి ప్రసూతి ఆసుపత్రిలో దారుణం
వైద్యుల నిర్లక్ష్యంతోనే శిశుమరణం జరిగిందంటున్న బంధువులు
పత్తాలేని ఉన్నతాధికారులు
సుల్తాన్‌బజార్: అది చిన్నారులకు ఆయువు పోసే ఆరోగ్యాలయం. నవమాసాలు మోసి బిడ్డలకు జన్మనివ్వాలనకున్న తల్లులకు కాన్పుచేసే ధర్మశాల. వైద్యులు, సిబ్బంది..ఒక్కరేమిటి అక్కడ పనిచేసే ప్రతీ ఒక్కరూ కర్తవ్యదీక్షా కంకణధారులై ఉంటారన్న విశ్వాసం అందరిదీ. అయితే ఇందుకు భిన్నంగా మారుతోంది సుల్తాన్‌బజార్ (కోఠి) ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి తీరు. తల్లుల గర్భంనుంచి ఈ లోకంలోకి అడుగు పెట్టాలనుకునే నవజాత శిశువుల స్వప్నాలను అది చిదిమేస్తోంది. బిడ్డల ఆయువుకు మధ్యలోనే చెల్లుచీటీ రాయించి కన్నవారికి శోకాన్ని మిగుల్చుతోంది. సరిగ్గా ఇలాంటి సంఘటనే ఆదివారం జరిగింది. ఆ ఆసుపత్రి ఒడిలో పుట్టిన ఓ మగబిడ్డ పట్టుమని రెండు గంటలు కూడా ఇక్కడి వాయువులను పీల్చుకోకుండా మృత్యు ఒడికి వెళ్లిపోయాడు.
బాధితుల కథనం మేరకు..నల్గొండ జిల్లా నకిరేకల్‌కు చెందిన వెంకన్న, సుమలత దంపతులు దిల్‌సుఖ్‌నగర్‌లోని మారుతీ నగర్‌లో ఉంటున్నారు. సుమలతకు నెలలు నిండడంతో ఈ నెల2న కోఠి ప్రసూతి ఆసుపత్రిలో చేర్చారు. ఆమెకు సాధారణ కాన్పు కోసం ఆసుపత్రి డాక్టర్లు ప్రయత్నిస్తూ ఆదివారం తెల్లవారుజాము వరకు ఆగారు. వేకువన 4 గంటల వేళ నొప్పుల కోసం ఇంజెక్షన్ ఇచ్చారు. సుమలత 5 గంటల సమయంలో మగశిశువుకు జన్మనిచ్చింది. అంతా సంబర పడ్డారు. అక్కడికి రెండుగంటల వరకూ అంటే ఉదయం 7 గంటల వరకు బాగానే ఉన్న శిశువు ఆశ్చర్యకరంగా విగతజీవుడయ్యాడు. తండ్రి వెంకన్నకు అనుమానం వచ్చి చూడడంతో శిశువు తలకు గాయాలు కనిపించాయి. ప్రసవం సమయంలో శిశువును బయటకు తీసేందుకు పట్టకార్‌తో గట్టిగాలాగడం వల్లనే ఇలా జరిగిందనీ ఆయన తన బంధువులకు సమాచారం అందించారు. దీంతో వారు వచ్చి ఆసుపత్రి వద్ద బైఠాయించి ధర్నా నిర్వహించారు. వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. కన్నీరు మున్నీరయ్యేలా విలపిస్తూ ఆసుపత్రి తీరుపై ఆగ్రహం వెలిబుచ్చారు. ఇంత జరిగినా ఉన్నతాధికారులు అక్కడకు రాలేదు. బాధితులను ఊరడించ లేదు. తమనుంచి శిశువును దూరంచేసిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని బాధితుడు వెంకన్న కోరినా పట్టించుకున్న వారు లేరు. చివరికి పోలీసులకు ఉప్పంది వచ్చాక పరిస్థితి అదుపులోకి వచ్చింది.
మా తప్పులేదు : వైద్యులు
దీనిపై వైద్యులు స్పందిస్తూ కాన్పు విషయంలో తమ తప్పులేదనీ, బిడ్డ ఉమ్మనీరు మింగడం వల్ల, జన్యుపరమైన ఇతర లోపాల వల్ల మరణించాడని చెప్పారు. కాగా విషయం తెలుసుకొని అక్కడికి చేరుకున్న ఎస్.ఐ రామిరెడ్డి.. ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి వైద్యుల నిర్లక్ష్యం ఉంటే చర్యలు తీసుకుంటామని బాధితులకు నచ్చజెప్పారు. దీనితో బాధను దిగమింగుకొని వెంకన్న, అతని బంధువులు మృతశిశువును తమ సొంతూరుకు తీసుకువెళ్లారు. బాధితురాలు సుమలత ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.