Infant Death
-
బిడ్డను చూడకుండానే కన్నుమూసిన తల్లి
మంచిర్యాలక్రైం: నవమాసాలు మోసి బిడ్డకు జన్మనిచ్చిన ఓ తల్లి కళ్లనిండా చూసుకోకుండానే కాటికి చేరుకున్న ఘటన సోమవారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం బెల్లంపల్లికి చెందిన బొల్లు వెంకటేశ్ భార్య రవళిక (26) సోమవారం ఉదయం జిల్లా కేంద్రంలోని నందిని ఆస్పత్రిలో ప్రసవం నిమిత్తం చేరింది. ఆస్పత్రి వైద్యురాలు సాధారణ డెలివరీ చేయడంతో బాబుకు జన్మనిచ్చింది. సదరు మహిళకు అధిక రక్తస్రావం కావడంతో వైద్యురాలు అర్జంటుగా రక్తం కావాలని బాధిత కుటుంబ సభ్యులకు తెలిపింది. వెంకటేశ్ బ్లడ్ బ్యాంకుకు వెళ్లి రక్తం తీసుకు వచ్చే లోగానే వైద్యురాలు నందిని బాధిత కుటుంబ సభ్యులకు చెప్పకుండానే మహిళను సమీపంలోని మెడిలైఫ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రవళిక మృతి చెందింది. విషయం తెలుసుకున్న మృతురాలి కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వైద్యురాలు నందిని, మెడిలైఫ్ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే రవళిక మృతి చెందిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న సీఐ బన్సీలాల్ సిబ్బందితో కలిసి ఆసుపత్రి వద్దకు చేరుకుని బాధితులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు. -
బాలింత మృతి.. వైద్యురాలి నిర్లక్ష్యమే కారణమన్న బంధువులు.. పోలీస్ స్టేషన్‌కు పంచాయతీ!
కొల్లాపూర్: కొల్లాపూర్ పట్టణంలోని ఓ ప్రైవేటు నర్సింగ్ హోం వద్ద గురువారం కొందరు ఆందోళనకు దిగారు. బాలింత మృతికి మీ నిర్లక్ష్యమే కారణం అంటూ వైద్యురాలితో వాగ్వాదానికి దిగారు. ఈ పంచాయితీ పోలీస్‌స్టేషన్ వరకు చేరింది. చివరికి మధ్యవర్తులు రాజీ కుదిర్చారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దకొత్తపల్లి మండలం యాపట్లకి చెందిన రజిత(21)కు ఏడాదిన్నర కిందట చారకొండ మండలం తుర్కలపల్లికి చెందిన సురేష్‌తో వివాహమైంది. రజిత గర్భిణి కావడంతో కొల్లాపూర్‌లోని ఓ ప్రైవేటు నర్సింగ్‌హోంలో ఈ నెల 3న ఆమెకు కాన్పు చేయించారు. సాధారణ కాన్పులో ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. హెర్నియా సమస్య కారణంగా ఆమె ఆరోగ్యం నిలకడగా లేకపోవడంతో మెరుగైన చికిత్స నిమిత్తం ఆస్పత్రి వైద్యురాలు మహబూబ్‌నగర్‌కు రెఫర్ చేశారు. అక్కడ కూడా ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగు పడకపోవడంతో హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ ఈ నెల 16న మృతిచెందింది. మృతురాలి కుటుంబీకులు కొందరు స్థానిక నాయకులతో కలిసి గురువారం సంబంధిత డాక్టర్ వద్దకు వెళ్లారు. రజిత అమ్మమ్మగారి ఊరు పెంట్లవెల్లి మండలంలోని మల్లేశ్వరం కావడంతో ఆ మండలానికి చెందిన హరిప్రసాద్, గోపినాయక్, తెలంగాణ దళితదండు నాయకులు బచ్చలకూర బాలరాజు మృతురాలి కుటుంబం తరఫున వైద్యురాలితో మాట్లాడారు. సరైన వైద్యం అందకపోవడంతోనే ఆమె మృతిచెందింది. ఆమె బిడ్డకు తల్లి లేకుండా పోయింది. ఆ కుటుంబానికి పరిహారం చెల్లించాలని కోరారు. ఈ క్రమంలో వైద్యురాలిపై కొందరు దురుసుగా మాట్లాడారు. దీంతో ఆమె వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు స్టేషన్‌కు వెళ్లింది. పట్టణానికి చెందిన ప్రైవేటు ఆస్పత్రుల వైద్యులు ఆమెకు సంఘీభావంగా స్టేషన్‌కు చేరుకున్నారు. స్టేషన్లో వైద్యురాలికి, మృతురాలి తరఫున వచ్చిన వారికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. స్థానిక నాయకులు కొందరు జోక్యం చేసుకుని ఇరువురి మధ్య రాజీ కుదిర్చారు. రూ.లక్ష పరిహారం చెల్లించేలా వైద్యురాలిని ఒప్పించినట్లు తెలిసింది. అయితే పరిహారం చెల్లింపు విషయంలో ఎటువంటి స్పష్టత రాలేదని, శుక్రవారం మరోసారి చర్చలు జరుపుతామని మృతురాలి తరఫు వారు తెలిపారు. ఈ ఘటనపై ఇరువర్గాలు తమకు ఎటువంటి ఫిర్యాదులు ఇవ్వలేదని ఏఎస్ఐ రామస్వామిగౌడ్ తెలియజేశారు. -
మిరాకిల్: అంత్యక్రియలు చేస్తుండగా కళ్లు తెరిచిన 3 ఏళ్ల చిన్నారి
మెక్సికో సిటీ: చనిపోయిన వ్యక్తులు మళ్లీ ప్రాణంతో తిరిగిరావటం సినిమాల్లో చూసే ఉంటాం. అయితే.. నిజ జీవితంలో అలా జరగటం దాదాపుగా అసాధ్యం. కానీ, డాక్టర్లు చనిపోయిందని ప్రకటించిన ఓ మూడేళ్ల పాప అంత్యక్రియలు చేస్తుండగా లేచింది. నేను బతికే ఉన్నాను అంటూ కళ్లు తెరిచింది. ఈ అరుదైన సంఘటన ఆగస్టు 17న మెక్సికోలో జరిగింది. ఆసుపత్రి వర్గాల నిర్లక్ష్యంతో తన పాపను చనిపోయిందని ప్రకటించారని ఆరోపించారు తల్లి మారీ జాన్ మెండోజా. ఏం జరిగింది? విల్లా డీ రమోస్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు కమిలా రోక్సానా అనే మహిళ. ఆమె 3 ఏళ్ల కూతురు కమిలా రోక్సానా మార్టినెజ్ మెన్డోజా.. కడుపు నొప్పి, వాంతులు, జ్వరంతో బాధపడుతుండగా స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, మరో పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లాలని అక్కడి వైద్యులు చెప్పారు. అప్పటిలోపు పారాసిటమల్ ట్యాబ్లెట్స్ వేయాలని ప్రిస్క్రిప్షన్ ఇచ్చారు. మరో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లేలోపు పాప ఆరోగ్యం మరింత విషమించింది. అక్కడి వైద్యులు మందులు ఇచ్చి, చిన్నారికి పండ్లు, వాటర్ ఇవ్వాలని సూచించారు. అయినప్పటికీ ఆమె పరిస్థితిలో ఎలాంటి పురోగతి కనిపించలేదు. దీంతో ఎమర్జెన్సీ రూమ్‌కు తరలించి చికిత్స అందించారు. ఆసుపత్రి సిబ్బంది పాపకు ఎక్కువ సమయం ఆక్సిజన్ పెట్టి ఉంచారని తల్లి ఆరోపించారు. 10 నిమిషాల పాటు ఇంట్రావీనస్ ద్రవాలను ఎక్కించిన తర్వాత వాటిని తొలగించి చనిపోయినట్లు వెల్లడించారని తెలిపారు. డీహైడ్రేషన్ కారణంగా చనిపోయిందని వైద్యులు పేర్కొననారు. ఆ తర్వాతి రోజు అంత్యక్రియలు చేసేందుకు సిద్ధమయ్యారు కుటుంబ సభ్యులు. ఈ క్రమంలో చిన్నారిని ఉంచిన శవ పేటికలో ఓ గాజు ముక్క గాలిలో తెలుతుండటాన్ని గమనించింది ఆమె తల్లి. పక్కవారికి చెప్పగా వారు కొట్టిపారేశారు. ఆ తర్వాత కమిలా కళ్లు కదిలించినట్లు ఆమె బామ్మ గమనించింది. వెంటనే తెరిచి చూడగా నాడి కొట్టుకుంటుంది. హుటాహుటిన అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. అయితే, వైద్యులు తీవ్రంగా శ్రమించినప్పటికీ కొద్ది సేపటికే పాప మరణించింది. పాప చనిపోయిందని నిర్లక్ష్యంతో ప్రకటించిన డాక్టర్లపై బాధితురాలి తల్లి మెండోజా కేసు నమోదు చేశారు. వైద్యులపై తనకు ఎలాంటి పగ లేదని, అయితే, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. అప్పుడే ఇలాంటివి మళ్లీ జరగకుండా ఉంటాయన్నారు. ఇదీ చదవండి: ప్యాంటులో దాచి 60 పాములు, బల్లుల స్మగ్లింగ్.. అధికారులే షాక్! -
కోతుల దాడి: తండ్రి చేతుల్లోంచి ఎత్తుకెళ్లి మరీ..
లక్నో: ఉత్తర ప్రదేశ్ బరేలీ జిల్లాలో ఘోరం జరిగింది. ఓ వ్యక్తి చేతిలోంచి అతని నాలుగు నెలల పసికందును ఎత్తుకెళ్లిన కోతులు.. భవనం నుంచి కింద పడేశాయి. ఈ దుర్ఘటనలో చిన్నారి అక్కడికక్కడే కన్నుమూసింది. శుక్రవారం సాయంత్రం చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బరేలీలోని డుంకా ప్రాంతంలో బాధిత కుటుంబం నివసిస్తోంది. శుక్రవారం సాయంత్రం వ్యక్తి తన బిడ్డను ఎత్తుకుని బిల్డింగ్ పైన నడుస్తున్నాడు. ఆ సమయంలో హఠాత్తుగా వచ్చిన ఓ కోతుల గుంపు అతనిపై దాడి చేసింది. అతన్ని తీవ్రంగా గాయపరిచి.. బిడ్డను ఎత్తుకెళ్లాయి. సాయం కోసం అతను కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్లంతా వచ్చారు. వాళ్ల మీదా కోతులు దాడికి పాల్పడ్డాయి. పలువురిని కరిచాయి. దీంతో కొందరు రాళ్లు, కర్రలు విసరడంతో గందరగోళంలో ఆ కోతులు బిడ్డను కిందకు విసిరేశాయి. మూడంతస్తుల బిల్డింగ్ కావడంతో బిడ్డ అక్కడికక్కడే మృతి చెందింది. నామకరణం వేడుక కోసం ఏర్పాట్లు చేస్తున్న సమయంలోనే ఇది జరగడం ఆ కుటుంబాన్ని విషాదంలోకి నెట్టేసింది. షాహీ పోలీసులతో పాటు ఈ ఘటనపై స్థానిక అటవీ శాఖ దర్యాప్తు చేపట్టారు. -
నడిరోడ్డుపై విగతజీవిగా పసిపాప
సాలూరు (విజయనగరం): అప్పుడే పుట్టింది.. ఇంకా కళ్లు కూడా తెరవలేదు.. కన్నపేగు వసివాడ లేదు.. తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన పసిపాప నడిరోడ్డుపై విగతజీవిగా కనిపించిన దృశ్యం విజయనగరం జిల్లా సాలూరు పట్టణ వాసులను మంగళవారం కంటతడి పెట్టించింది. సాలూరు ఎస్ఐ ఫకృద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ) వెనుక ఉన్న సీసీ రోడ్డు సమీపంలో ఓ చిన్నారి రోడ్డుపై మరణించి ఉందని సమాచారం అందడంతో పోలీసులు వెళ్లి చూశారు. అప్పుడే పుట్టినట్టుగా గుర్తించారు. సీహెచ్‌సీ వెనుక కవరులో కప్పి పడవేయగా.. ఏదైనా వాహనం ఆ కవరును రోడ్డుపైకి ఈడ్చుకొచ్చి ఉంటుందని పోలీసులు, స్థానికులు అనుమానిస్తున్నారు. పాపకు సంబంధించిన వివరాలు వెల్లడి కాలేదు. ఈ మేరకు కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నట్టు ఎస్ఐ తెలిపారు. -
గాంధీ వైద్యుల తీరు మారదా..
గాంధీ ఆస్పత్రి: ఒకరికి చేయాల్సిన డెలివరీ మరొకరికి చేయడమే కాకుండా శిశువులను సైతం తారుమారు చేసి, గాంధీ గైనకాలజీ వైద్యులు తమ జీవితాలతో ఆడుకున్నారని బాధితులు ఆరోపించారు. శిశువు మృతి చెందడంతోపాటు బాలింత పరిస్థితి కూడా విషమంగా ఉందని, దీనికి కారణమైన వైద్యులపై చట్ట ప్రకారం చర్యలు చేపట్టి తమకు న్యాయం చేయాలని కోరుతూ వారు పోలీసులను ఆశ్రయించారు. బాధిత మహిళ భర్త ఎనగందుల హరీశ్‌తోపాటు కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం వడ్డెకొత్తపల్లి గ్రామానికి చెందిన సమత, హరీశ్ భార్యాభర్తలు. ఏడునెలల గర్భవతి అయిన సమతను ఈనెల 11వ తేదీన వరంగల్ సీకేఎం ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడి వైద్యుల సూచన మేరకు అదే రోజు రాత్రి సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తీసుకువచ్చి గైనకాలజీ విభాగం లేబర్ వార్డులో చేర్పించారు. 12వ తేదీ రాత్రి ఐసీయూకు రమ్మని పిలిచి, అత్యవసర పరిస్థితుల్లో డెలివరీ చేశామని చెప్పి మగశిశువును చూపించారు. ట్యాగ్‌లో మాత్రం ఆడశిశువుగా నమోదు చేశారు. 15వ తేదీ ఉదయం శిశువు పరిస్థితి విషమంగా ఉందని సమాచారం ఇచ్చి, గంట తర్వాత శిశువు మృతి చెందిందని చెప్పి మగ శిశువు మృతదేహాన్ని ఇచ్చారని, మరణ ధ్రువీకరణ పత్రంలో మాత్రం ఆడశిశువుగా నమోదు చేశారని చెప్పారు. కేస్‌షీట్, ట్యాగులలో ఉన్న ఫిమేల్‌ను మేల్‌గా మార్చి, మరణ ధ్రువీకరణ పత్రంలో మేల్‌గా సరిదిద్దారని తెలిపారు. సదరు ట్యాగులను సిబ్బందే తీసుకున్నారని, ఆర్ఎంఓకు ఫిర్యాదు చేయగా ట్యాగ్ విషయంలో తప్ప అన్నీ సక్రమంగానే ఉన్నాయని నమ్మించారని తెలిపారు. కేస్‌షీట్‌లోనూ ఫిమేల్‌ను మేల్‌గా, శిశువు బరువు 1 కేజీకి బదులుగా 900 గ్రాములని, పుట్టిన సమయం కూడా మార్పు చేశారని ఆరోపించారు. అదే కేస్‌షీట్‌లో సమతకు బదులుగా మాధవి, లక్ష్మమ్మలకు చెందిన రిపోర్టులు ఉన్నాయన్నారు. మాధవి, లక్ష్మమ్మ రిపోర్టుల ఆధారంగా సమతకు వైద్యచికిత్సలు అందించారని, సమత చేతిపై భవానీ అనే పేరు రాసి ఉన్నట్లు తర్వాత గుర్తించామన్నారు. భవానీకి జరగాల్సిన డెలివరీ సమతకు చేశారని, ఏడునెలలకే డెలివరీ చేసి శిశువు మృతికి, బాలింత సమత ప్రాణాపాయస్థితికి కారణమైన వైద్యులు, సిబ్బందిపై తగిన చర్యలు చేపట్టి న్యాయం చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని చిలకలగూడ సీఐ బాలగంగిరెడ్డి తెలిపారు. అయితే డెలివరీ కోసం వచ్చే గర్భిణీల చేతులకు ట్యాగులు మాత్రమే కట్టి వివరాలు అందులో పొందుపర్చుతామని, అరచేతిపై పేర్లు రాసే పద్ధతి లేదని గాంధీ వైద్యులు స్పష్టం చేస్తున్నారు. నలుగురు వైద్యులతో నిజనిర్ధారణ కమిటీ బాధితుడు హరీశ్ ఫిర్యాదు మేరకు నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు గాంధీ సూపరింటెండెంట్ శ్రవణ్‌కుమార్ తెలిపారు. కమిటీలో కృష్ణమోహన్ (జనరల్ సర్జరీ హెచ్ఓడీ), డాక్టర్ జార్జ్ (పీడియాట్రిక్ ప్రొఫెసర్), రాజారావు (జనరల్ మెడిసిన్ హెచ్ఓడీ), పద్మ (లేడీ ఆర్ఎంఓ)లు సభ్యులుగా ఉంటారని, బుధవారం సాయంత్రంలోగా నివేదిక అందిస్తారని, వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు రుజువైతే తగిన చర్యలు తీసుకుంటామని శ్రవణ్‌కుమార్ స్పష్టం చేశారు. -
పాపం.. పసివాడు
పదకొండు నెలల ఓ పసిబాలుడు సీసం గోలి మింగి శ్వాస ఆడక మృతి చెందాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కోరుట్లలో విషాదాన్ని నింపింది. స్థానిక పోచమ్మగల్లీకి చెందిన కోరుట్ల రవిరాజ్ మేడిపల్లి మండలం దమ్మన్నపేటలో కార్యదర్శిగా పనిచేస్తూ జగిత్యాలలో నివసిస్తున్నాడు. మహాశివరాత్రి సందర్భంగా శుక్రవారం రవిరాజ్ ఆయన భార్య అపర్ణ, కూతురు శాన్వీ (3), బాబు అభియాత్ (11 నెలలు)లతో కలిసి కోరుట్లకు వచ్చారు. శనివారం మధ్యాహ్నం శాన్వీ, అభియాత్‌తో కలసి సీసం గోలీలతో ఆడుకునే క్రమంలో అభియాత్ గోలిని మింగాడు. శ్వాస తీయడం ఇబ్బందిగా మారడంతో గమనించిన తల్లి, వెంటనే కోరుట్లలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. పరిస్థితి విషమించిందని చెప్పి జగిత్యాలకు పంపారు. అక్కడికి తీసుకెళ్లేలోపే శ్వాస ఆడక తుదిశ్వాస విడిచాడు. – కోరుట్ల -
షహీన్‌బాగ్ శిశువు మృతి
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా షహీన్‌బాగ్‌లో నిరసన తెలుపుతున్న నాలుగు నెలల శిశువు మృతిచెందాడు. బాలుడు నిరసన తెలపడం ఏంటి అనుకుంటున్నారా? మీరు చదివింది నిజమే. షహీన్‌బాగ్ వద్ద నిరసనలో పాల్గొనడానికి మహ్మద్ జహాన్ అనే బాలుడిని అతని తల్లి ప్రతిరోజూ తనతోపాటు అక్కడికి తీసుకెళ్లేది. అక్కడ ఉన్న నిరసనకారులంతా కూడా జహాన్‌ను ముద్దుచేసేవారు. అలాగే బాలుడి బుగ్గ మీద త్రివర్ణ పతాకాన్ని రంగులతో వేసేది. కానీ, ఆ పాలబుగ్గల చిన్నారి ఇక నుంచి కనబడడు. చలితీవ్రత పెరగడంతో, తట్టుకోలేక ఆ చిన్నారి కన్నుమూశాడు. అయినప్పటికీ జహాన్ తల్లి ఆ నిరసనల్లో పాల్గొనడానికి నిశ్చయించుకోవడం గమనార్హం. ‘నేను నా పిల్లల భవిష్యత్తు కోసం అందులో పాల్గొంటాను’ అని తెలిపింది. జహాన్ తల్లిదండ్రులు మహ్మద్ ఆరిఫ్, నజియా బట్లా హౌజ్ ప్రాంతంలో ప్లాస్టిక్ షీట్లు, వస్త్రాలతో చేసిన ఓ చిన్న గుడిసెలో నివసిస్తున్నారు. వారికి మరో ఇద్దరు ఐదేళ్ల కుమార్తె, ఒక సంవత్సరం కొడుకు ఉన్నారు. ‘జహాన్ జనవరి 30వ తేదీనే మృతిచెందాడు. షహీన్‌బాగ్ ప్రాంతం నుంచి ఆరోజు రాత్రి 1 గంటకు ఇంటికొచ్చి జహాన్‌ను నిద్రపుచ్చి నేను కూడా నిద్రపోయాను. ఉదయం లేవగానే తాను కదలకపోవడాన్ని గమనించాను. తను నిద్రలోనే చనిపోయాడు’ అని నజియా వెల్లడించింది. -
విమానంలో విషాదం; కన్నతల్లికి కడుపుకోత
ముంబై : విమానంలో ప్రయాణిస్తున్న నెలలు నిండని ఓ చిన్నారి దురదృష్టవశాత్తు మార్గమధ్యలోనే మరణించింది. బిడ్డ పడుకుందని భావించిన ఆ తల్లి కూతురు శాశ్వత నిద్రలోకి వెళ్లిందని గమనించలేకపోయింది. ఈ హృదయ విదారకర ఘటన శుక్రవారం మహరాష్టలో చోటుచేసుకుంది. నాలుగు నెలల చిన్నారి రియా.. తల్లి ప్రీతి జిందల్, అమ్మమ్మ తాతయ్యలతో కలిసి జైపూర్ నుంచి ముంబై వస్తున్న స్పైస్‌జెట్ విమానంలో ప్రయాణిస్తుంది. వీరు సూరత్‌లో విమానం ఎక్కగా.. ముంబైలో విమానం దిగే సరికి చిన్నారి నుంచి ఎలాంటి అలికిడి, స్పందన లేకపోవడంతో కంగారుపడిన కుటుంబ సభ్యులు ముంబై విమానాశ్రయంలో దిగగానే విమాన సిబ్బందికి తెలియజేసి వైద్య సహాయాన్ని కోరారు. వెంటనే స్పందించిన ఎయిర్‌పోర్టు సిబ్బంది హుటాహుటిన చిన్నారిని స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే శిశువును పరీక్షించిన వైద్యులు అప్పటికే చిన్నారి మరణించిందని ధ్రువీకరించడంలో ఆ తల్లి ఆర్తనాదాలు మిన్నంటాయి. విమానం ఎక్కే సమయంలో కూతురు బాగానే ఉందని, అంతకముందే పాపకు పాలు తాగించానని, తరువాత పడుకోవడంతో నిద్రలోకి వెళ్లిందనుకున్నానని తల్లి కన్నీరు మున్నీరవడం అక్కడున్న వారిని కలిచివేసింది. ఇక శిశువు మృతికి కారణాలు వెల్లడి కాలేదు. శిశువు మృతదేహానికి పోస్టుమార్టం చేసినా కారణాలు తెలియకపోవడంతో శరీరం నుంచి నమూనాలను సేకరించి ఆసుపత్రికి పంపించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై తాము దర్యాప్తు చేస్తామని సంబంధిత విమాన అధికారులు తెలిపారు. -
ప్రసవ వేదన.. అరణ్యరోదన
వేమనపల్లి: గతుకుల రోడ్లు.. స్థానికంగా ఉండని వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా నిండు గర్భిణికి గర్భశోకం మిగిలింది. పురిటి నొప్పులతో అడవిలోనే మృతశిశువుకు జన్మనిచ్చింది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం బుయ్యారంలో శనివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గోమాస లావణ్యకు శనివారం తెల్లవారుజామున పురిటి నొప్పులు మొదలయ్యాయి. మొదటి కాన్పు కావడంతో కుటుంబ సభ్యులు 108కు సమాచారం అందించారు. అయితే.. సిబ్బంది అందుబాటులో లేని కారణంగా రాలేమని చెప్పారు. దీంతో గ్రామంలోని ఆశవర్కర్ సరస్వతీ, ఆర్ఎంపీ సహాయం తీసుకున్నారు. పక్క గ్రామం జిల్లెడలో ఆరోగ్య ఉప కేంద్రం ఉంది. ఎన్నడూ ఏఎన్ఎం, ఇతర సిబ్బంది గానీ స్థానికంగా ఉండరు. ఇటీవల ప్రైవేటు ఆస్పత్రిలో లావణ్య స్కానింగ్ పరీక్ష చేయించుకోగా.. పాప ఎదురుకాళ్లతో జన్మించే అవకాశం ఉందని వైద్యులు నిర్ధారించారు. నిబంధనల ప్రకారం పాప అలాంటి స్థితిలో ఉన్నప్పుడు వైద్యుడు, హెల్త్ సూపర్వైజర్, ఏఎన్ఎం పర్యవేక్షణ అవసరం కానీ.. ఎవరూ అందుబాటులో లేరు. ఇంటి వద్ద సాధారణ ప్రసవం కాకపోవడంతో చేసేదేమీ లేక ఆటోలో వేమనపల్లి పీహెచ్‌సీకి బయల్దేరారు. మార్గమధ్యంలోని నాగారం గ్రామం నుంచి మంగనపల్లి వరకు అటవీమార్గం మట్టిరోడ్డు గుంతలమయంగా ఉంది. గతుకులతో ఉన్న మట్టి రోడ్డులో కుదుపులే ప్రమాదకరంగా మారాయి. నాగారం అటవీ ప్రాంతంలోనే రాళ్లకుప్ప వద్దకు రాగానే నొప్పులు తీవ్రమయ్యాయి. అక్కడే లావణ్య మగ మృతశిశువుకు జన్మనిచ్చింది. అనంతరం బాలింతను వేమనపల్లి పీహెచ్‌సీకి తీసుకెళ్లి వైద్యం అందిస్తున్నారు. -
‘అనంత’ ఆసుపత్రిలో మరణమృదంగం
అనంతపురం న్యూసిటీ:అనంతపురం సర్వజనాస్పత్రిలోని చిన్నపిల్లల విభాగంలో మంగళవారం ఐదుగురు చిన్నారులు మృత్యువాత పడడం కలకలం సృష్టించింది. చిన్నపిల్లల వార్డులో ఒకరు, అదే విభాగానికి సంబంధించి ఎస్‌ఎన్‌సీయూలో ఒకరు, లేబర్ వార్డులో ముగ్గురు పసికందులు మృతిచెందారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ బిడ్డ మృతి చెందారంటూ ఓ బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగడంతో ఆస్పత్రిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మరోవైపు అల్లారుముద్దుగా పెంచుకున్న తన బాబు వైద్యుల నిర్లక్ష్యం వల్ల చనిపోయాడంటూ విలపించిన ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. అక్కడే ఉన్న స్వీపర్లు గమనించి విషయాన్ని సెక్యూరిటీ సిబ్బందికి తెలియజేయడంతో పెనుప్రమాదం తప్పింది. బిడ్డ కడుపులోనే చనిపోయిందన్నారు.. పెదవడుగూరు మండలం మేడమాకులపల్లికి చెందిన వీరనారాయణచారి తన భార్య ప్రమీలకు మంగళవారం ఉదయం నొప్పులు రావడంతో హుటాహుటిన సర్వజనాస్పత్రికి తీసుకొచ్చాడు. పరీక్షించిన వైద్యులు కాసేపట్లో కాన్పు చేస్తామని చెప్పారు. అనంతరం కాన్పు చేసిన వైద్యులు.. మృత శిశువును అప్పగించారు. దీనిపై బాధిత కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. గైనిక్ వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ పాప చనిపోయిందని వీరనారాయణచారి ఆరోపించాడు. మూడ్రోజుల క్రితమే బిడ్డ కడుపులోనే చనిపోయిందని చెప్పడమేంటని తప్పుపట్టాడు. గత నెల 28న పరీక్షలకు వచ్చినప్పుడు కడుపులో బేబి, తల్లి బాగా ఉన్నారని చెప్పి.. అంతలోనే మూడ్రోజుల క్రితమే పాప చనిపోయిందని చెప్పడమేంటన్నాడు. వైద్యుల నిర్వాకంతోనే తమ పాప చనిపోయిందని మండిపడ్డాడు. దీనిపై ఆర్ఎంఓ డాక్టర్ విజయమ్మకు ఆయన లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. సాధారణ వార్డుకు మార్చిన గంటల వ్యవధిలోనే.. గార్లదిన్నె మండలం కొప్పలకొండ గ్రామానికి చెందిన మల్లికార్జున కుమారుడు జశ్వంత్(11నెలలు) నిమోనియాతో బాధపడుతుండడంతో గత నెల 25న చిన్నపిల్లల వార్డులో చేర్చారు. మంగళవారం ఉదయం బాబు ఆరోగ్యం కుదుటపడిందని పీఐసీయూ నుంచి సాధారణ వార్డులోకి వైద్యులు మార్చారు. తల్లి కాస్త ఇడ్లీ తిన్పించింది. ఆ తరువాత కొద్ది గంటలకే ఆ తల్లి కేకలేస్తూ పీఐసీయూలోకి వచ్చింది. దీంతో పరీక్షించిన వైద్యులు.. అప్పటికే బాబు మృతి చెందినట్టు తెలిపారు. సాధారణ వార్డుకు మార్చిన గంటల వ్యవధిలోనే తన కుమారుడు ప్రాణాలు కోల్పోవడంతో ఆ తల్లి దిగ్భ్రాంతికి గురైంది. అయ్యో దేవుడా! ఎంత పని చేశావయ్యా.. రేపోమాపో ఇంటికి తీసుకెళ్దామనుకుంటే అంతలోనే ఘోరం జరిగిందయ్యా. నాకింకెవ్వరు దిక్కయ్కా అంటూ.. రోదించడం అందర్నీ కలచివేసింది. కుమారుడు మరణాన్ని జీర్ణించుకోలేని ఆ తల్లి బాత్రూంలోకి వెళ్లి చీరతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అయితే అక్కడే ఉన్న స్వీపర్లు గమనించి సెక్యూరిటీ సిబ్బంది సహాయంతో తలుపులు పగులగొట్టి ఆమెను రక్షించారు. మరో ముగ్గురూ.. మరోవైపు ఎన్‌ఎస్‌సీయూలో శెట్టూరు యాటకల్లు గ్రామానికి చెందిన నగ్మ అనే మహిళకు జన్మించిన నెలలు నిండని ఆడబిడ్డ(980 గ్రాములు) మృతిచెందగా, కాన్పుల వార్డులో కూడేరు మండలం కమ్మూరు గ్రామానికి చెందిన గౌతమికి పుట్టిన మగబిడ్డ పురిట్లోనే చనిపోయాడు. అదే వార్డులో మరో మహిళకు పుట్టిన మగబిడ్డ కూడా పురిట్లోనే మరణించాడు. ఎన్నడూ లేనివిధంగా లేబర్‌వార్డులో ముగ్గురు చనిపోవడం కలకలం రేపింది. విచారణకు ఆదేశిస్తాం.. లేబర్‌వార్డులో పసికందులు చనిపోయిన విషయం తెలియదు. విచారణకు ఆదేశిస్తా. చిన్నపిల్లల వార్డులో జశ్వంత్ అనే బాబు చనిపోయాడు. ఇడ్లీ తిన్పించే సమయంలో అన్నవాహికలో కాకుండా లంగ్స్‌లో పడింది. అందుకే బాబు మృతిచెందాడు. ఎన్‌ఎస్‌సీయూలో ఓ బిడ్డ మృతిచెందింది. –డాక్టర్ జగన్నాథ్, ఆసుపత్రి సూపరింటెండెంట్ -
ఆ శిశువు బతికింది రెండుగంటలే..!
కోఠి ప్రసూతి ఆసుపత్రిలో దారుణం వైద్యుల నిర్లక్ష్యంతోనే శిశుమరణం జరిగిందంటున్న బంధువులు పత్తాలేని ఉన్నతాధికారులు సుల్తాన్‌బజార్: అది చిన్నారులకు ఆయువు పోసే ఆరోగ్యాలయం. నవమాసాలు మోసి బిడ్డలకు జన్మనివ్వాలనకున్న తల్లులకు కాన్పుచేసే ధర్మశాల. వైద్యులు, సిబ్బంది..ఒక్కరేమిటి అక్కడ పనిచేసే ప్రతీ ఒక్కరూ కర్తవ్యదీక్షా కంకణధారులై ఉంటారన్న విశ్వాసం అందరిదీ. అయితే ఇందుకు భిన్నంగా మారుతోంది సుల్తాన్‌బజార్ (కోఠి) ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి తీరు. తల్లుల గర్భంనుంచి ఈ లోకంలోకి అడుగు పెట్టాలనుకునే నవజాత శిశువుల స్వప్నాలను అది చిదిమేస్తోంది. బిడ్డల ఆయువుకు మధ్యలోనే చెల్లుచీటీ రాయించి కన్నవారికి శోకాన్ని మిగుల్చుతోంది. సరిగ్గా ఇలాంటి సంఘటనే ఆదివారం జరిగింది. ఆ ఆసుపత్రి ఒడిలో పుట్టిన ఓ మగబిడ్డ పట్టుమని రెండు గంటలు కూడా ఇక్కడి వాయువులను పీల్చుకోకుండా మృత్యు ఒడికి వెళ్లిపోయాడు. బాధితుల కథనం మేరకు..నల్గొండ జిల్లా నకిరేకల్‌కు చెందిన వెంకన్న, సుమలత దంపతులు దిల్‌సుఖ్‌నగర్‌లోని మారుతీ నగర్లో ఉంటున్నారు. సుమలతకు నెలలు నిండడంతో ఈ నెల2న కోఠి ప్రసూతి ఆసుపత్రిలో చేర్చారు. ఆమెకు సాధారణ కాన్పు కోసం ఆసుపత్రి డాక్టర్లు ప్రయత్నిస్తూ ఆదివారం తెల్లవారుజాము వరకు ఆగారు. వేకువన 4 గంటల వేళ నొప్పుల కోసం ఇంజెక్షన్ ఇచ్చారు. సుమలత 5 గంటల సమయంలో మగశిశువుకు జన్మనిచ్చింది. అంతా సంబర పడ్డారు. అక్కడికి రెండుగంటల వరకూ అంటే ఉదయం 7 గంటల వరకు బాగానే ఉన్న శిశువు ఆశ్చర్యకరంగా విగతజీవుడయ్యాడు. తండ్రి వెంకన్నకు అనుమానం వచ్చి చూడడంతో శిశువు తలకు గాయాలు కనిపించాయి. ప్రసవం సమయంలో శిశువును బయటకు తీసేందుకు పట్టకార్తో గట్టిగాలాగడం వల్లనే ఇలా జరిగిందనీ ఆయన తన బంధువులకు సమాచారం అందించారు. దీంతో వారు వచ్చి ఆసుపత్రి వద్ద బైఠాయించి ధర్నా నిర్వహించారు. వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. కన్నీరు మున్నీరయ్యేలా విలపిస్తూ ఆసుపత్రి తీరుపై ఆగ్రహం వెలిబుచ్చారు. ఇంత జరిగినా ఉన్నతాధికారులు అక్కడకు రాలేదు. బాధితులను ఊరడించ లేదు. తమనుంచి శిశువును దూరంచేసిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని బాధితుడు వెంకన్న కోరినా పట్టించుకున్న వారు లేరు. చివరికి పోలీసులకు ఉప్పంది వచ్చాక పరిస్థితి అదుపులోకి వచ్చింది. మా తప్పులేదు : వైద్యులు దీనిపై వైద్యులు స్పందిస్తూ కాన్పు విషయంలో తమ తప్పులేదనీ, బిడ్డ ఉమ్మనీరు మింగడం వల్ల, జన్యుపరమైన ఇతర లోపాల వల్ల మరణించాడని చెప్పారు. కాగా విషయం తెలుసుకొని అక్కడికి చేరుకున్న ఎస్.ఐ రామిరెడ్డి.. ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి వైద్యుల నిర్లక్ష్యం ఉంటే చర్యలు తీసుకుంటామని బాధితులకు నచ్చజెప్పారు. దీనితో బాధను దిగమింగుకొని వెంకన్న, అతని బంధువులు మృతశిశువును తమ సొంతూరుకు తీసుకువెళ్లారు. బాధితురాలు సుమలత ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.