కొల్లాపూర్‌లోని ఆస్పత్రి ఎదుట గూమిగూడిన మృతురాలి బంధువులు
కొల్లాపూర్: కొల్లాపూర్ పట్టణంలోని ఓ ప్రైవేటు నర్సింగ్ హోం వద్ద గురువారం కొందరు ఆందోళనకు దిగారు. బాలింత మృతికి మీ నిర్లక్ష్యమే కారణం అంటూ వైద్యురాలితో వాగ్వాదానికి దిగారు. ఈ పంచాయితీ పోలీస్‌స్టేషన్ వరకు చేరింది. చివరికి మధ్యవర్తులు రాజీ కుదిర్చారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దకొత్తపల్లి మండలం యాపట్లకి చెందిన రజిత(21)కు ఏడాదిన్నర కిందట చారకొండ మండలం తుర్కలపల్లికి చెందిన సురేష్‌తో వివాహమైంది.
రజిత గర్భిణి కావడంతో కొల్లాపూర్‌లోని ఓ ప్రైవేటు నర్సింగ్‌హోంలో ఈ నెల 3న ఆమెకు కాన్పు చేయించారు. సాధారణ కాన్పులో ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. హెర్నియా సమస్య కారణంగా ఆమె ఆరోగ్యం నిలకడగా లేకపోవడంతో మెరుగైన చికిత్స నిమిత్తం ఆస్పత్రి వైద్యురాలు మహబూబ్‌నగర్‌కు రెఫర్ చేశారు. అక్కడ కూడా ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగు పడకపోవడంతో హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
అక్కడ ఆమె చికిత్స పొందుతూ ఈ నెల 16న మృతిచెందింది. మృతురాలి కుటుంబీకులు కొందరు స్థానిక నాయకులతో కలిసి గురువారం సంబంధిత డాక్టర్ వద్దకు వెళ్లారు. రజిత అమ్మమ్మగారి ఊరు పెంట్లవెల్లి మండలంలోని మల్లేశ్వరం కావడంతో ఆ మండలానికి చెందిన హరిప్రసాద్, గోపినాయక్, తెలంగాణ దళితదండు నాయకులు బచ్చలకూర బాలరాజు మృతురాలి కుటుంబం తరఫున వైద్యురాలితో మాట్లాడారు. సరైన వైద్యం అందకపోవడంతోనే ఆమె మృతిచెందింది.
ఆమె బిడ్డకు తల్లి లేకుండా పోయింది. ఆ కుటుంబానికి పరిహారం చెల్లించాలని కోరారు. ఈ క్రమంలో వైద్యురాలిపై కొందరు దురుసుగా మాట్లాడారు. దీంతో ఆమె వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు స్టేషన్‌కు వెళ్లింది. పట్టణానికి చెందిన ప్రైవేటు ఆస్పత్రుల వైద్యులు ఆమెకు సంఘీభావంగా స్టేషన్‌కు చేరుకున్నారు. స్టేషన్‌లో వైద్యురాలికి, మృతురాలి తరఫున వచ్చిన వారికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
స్థానిక నాయకులు కొందరు జోక్యం చేసుకుని ఇరువురి మధ్య రాజీ కుదిర్చారు. రూ.లక్ష పరిహారం చెల్లించేలా వైద్యురాలిని ఒప్పించినట్లు తెలిసింది. అయితే పరిహారం చెల్లింపు విషయంలో ఎటువంటి స్పష్టత రాలేదని, శుక్రవారం మరోసారి చర్చలు జరుపుతామని మృతురాలి తరఫు వారు తెలిపారు. ఈ ఘటనపై ఇరువర్గాలు తమకు ఎటువంటి ఫిర్యాదులు ఇవ్వలేదని ఏఎస్‌ఐ రామస్వామిగౌడ్ తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment