
పదకొండు నెలల ఓ పసిబాలుడు సీసం గోలి మింగి శ్వాస ఆడక మృతి చెందాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కోరుట్లలో విషాదాన్ని నింపింది. స్థానిక పోచమ్మగల్లీకి చెందిన కోరుట్ల రవిరాజ్ మేడిపల్లి మండలం దమ్మన్నపేటలో కార్యదర్శిగా పనిచేస్తూ జగిత్యాలలో నివసిస్తున్నాడు. మహాశివరాత్రి సందర్భంగా శుక్రవారం రవిరాజ్ ఆయన భార్య అపర్ణ, కూతురు శాన్వీ (3), బాబు అభియాత్ (11 నెలలు)లతో కలిసి కోరుట్లకు వచ్చారు.
శనివారం మధ్యాహ్నం శాన్వీ, అభియాత్‌తో కలసి సీసం గోలీలతో ఆడుకునే క్రమంలో అభియాత్ గోలిని మింగాడు. శ్వాస తీయడం ఇబ్బందిగా మారడంతో గమనించిన తల్లి, వెంటనే కోరుట్లలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. పరిస్థితి విషమించిందని చెప్పి జగిత్యాలకు పంపారు. అక్కడికి తీసుకెళ్లేలోపే శ్వాస ఆడక తుదిశ్వాస విడిచాడు.
– కోరుట్ల