గత ప్రభుత్వ నిర్వాకంతోనే పేదలకు వైద్యం అందని పరిస్థితి: మంత్రి దామోదర ఫైర్
అప్పుడు వరుసగా బాలింతలు చనిపోతే ఏం చేశారు?
వైద్యులపై బురద చల్లే ప్రయత్నాలు మానుకోవాలని హితవు
సాక్షి, హైదరాబాద్: ‘‘గత ప్రభుత్వ హయాంలో 2017లో కోఠి మెటర్నిటీ ఆస్పత్రిలో మూడు రోజు ల్లో ఆరుగురు బాలింతలు, అదే ఏడాది ఐదు రోజు ల వ్యవధిలో నిలోఫర్ ఆస్పత్రిలో ఐదుగురు బాలింతలు, 2022లో డీపీఎల్ పద్ధతిలో చేసిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్లతో నలుగురు మహిళలు, 2019లో జూన్, జూలై నెలల్లో డెంగీతో 100 మంది చనిపోవడం.. ఇవన్నీ గుర్తులేవా కేటీఆర్? గత ప్ర భుత్వం శాశ్వత పరిష్కారాన్ని చూపకనే పేదలకు వైద్యం అందని ద్రాక్షగా మారింది..’’ అని వైద్యారో గ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ విమర్శించారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన జారీచేశారు.
గత పదేళ్లలో నిర్వీర్యమైన వైద్య రంగాన్ని తాము గాడిలో పెడుతున్నామని దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ రాజకీయం కోసం ఆస్పత్రులను వేదికగా వాడుకోవడం సరికాదని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో అనేక దుర్ఘటనలు జరిగాయని.. అవన్నీ బీఆర్‌ఎస్ నిజనిర్ధారణ కమిటీ తెలంగాణ సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. గాంధీ ఆస్పత్రిపై బురదజల్లే ప్రయత్నాలను మానుకోవాలని డాక్టర్లు విజ్ఞప్తి చేసినా.. కేటీఆర్‌కు తలకు ఎక్కడం లేదని మంత్రి మండిపడ్డారు.
ఖాళీలకు బాధ్యులు ఎవరు?
‘‘తప్పుడు సమాచారంతో ట్వీట్ చేసి, అడ్డంగా దొరికిపోయిన కేటీఆర్.. తప్పును కవర్ చేసుకునేందుకు ఫ్యాక్ట్ ఫైండింగ్ పేరిట డ్రామాలు చేస్తున్నారు. గత పదేళ్ల పాలనా వైఫల్యాలను పది నెలల ప్రభుత్వానికి ఆపాదిస్తున్నారు. గాంధీ ఆస్పత్రి మరణాలను ప్రభుత్వ వైద్యుల వైఫల్యంగా చిత్రీకరించడం బీఆర్‌ఎస్ అజ్ఞానానికి నిదర్శనం. అసలు వైద్యారోగ్యశాఖలో ఖాళీలకు బాధ్యులు ఎవరు?’’ అని దామోదర రాజనర్సింహ ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో మూడేళ్లలో హడావుడిగా 25 మెడికల్ కళాశాల ఏర్పాటుకు జీవోలు ఇచ్చి చేతులు ఎత్తేశారని.. 3,368 మంది టీచింగ్ స్టాఫ్ అవసరమైతే, కేవలం 1,078 మందిని భర్తీ చేశారని మండిపడ్డారు. స్టాఫ్, సదుపాయాలు లేకుండా మొక్కుబడిగా మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసిన ఘనత బీఆర్‌ఎస్‌కే దక్కుతుందని విమర్శించారు.
త్వరలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ
రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఆస్పత్రులలో అడ్మిని్రస్టేషన్ కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయబోతున్నామని మంత్రి దామోదర తెలిపారు. త్వరలోనే 612 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ చేపట్టబోతున్నామని వెల్లడించారు. కొత్త వైద్య కళాశాలల్లో డీఎంఈ కింద 19,530 పోస్టులకు ఆర్థికశాఖ అనుమతి ఇస్తే.. గత ప్రభుత్వం భర్తీ చేసింది 1,500 లోపేనని విమర్శించారు. తమ ప్రభుత్వం ఇప్పటికే అన్ని విభాగాల్లో కలిపి 7,308 పోస్టులు భర్తీ చేసిందని తెలిపారు. మరో 5,660 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. గాంధీ ఆస్పత్రిలో మాతాశిశు మరణాలు 2022లో 500 జరిగితే.. 2023లో 542 ఉండగా, 2024లో ఇప్పటివరకు 309 మరణాలు జరిగాయని వెల్లడించారు. నెలవారీ సగటు చూస్తే 2022లో 42 చొప్పున, 2023లో 45 చొప్పున, 2024లో 39 చొప్పున జరిగాయని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment