బహిరంగ వేలం ద్వారానే కేటాయింపులు జరగాలి
హౌసింగ్ బోర్డు స్థలాలపై హైకోర్టు వ్యాఖ్య
సాక్షి, హైదరాబాద్ : హౌసింగ్ బోర్డుకు చెందిన స్థలాలను ఎలా పడితే అలా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం సాధ్యం కాదని, కేవలం బహిరంగ వేలం ద్వారా మాత్రమే కేటాయించాలని హైకోర్టు స్పష్టం చేసింది. హైదరాబాద్‌లోని అమీర్‌పేట్‌లో 1,200 చదరపు అడుగుల స్థలాన్ని తమకు కేటాయించేలా హౌసింగ్ బోర్డును ఆదేశించాలని కోరుతూ ఎ.బాలామణి, మరో నలుగురు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయిలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
తమ ఇంటికి వెళ్లేందుకు మరో దారి లేనందున తమకు ఆ 1,200 చదరపు అడుగుల స్థలాన్ని కేటాయించాలని బాలామణి తదితరులు 2001లో ప్రభుత్వాన్ని కోరారు. సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం చదరపు గజానికి రూ.5 వేలు చెల్లిస్తే స్థలాన్ని ఇవ్వాలని హౌసింగ్ బోర్డును ఆదేశిస్తూ ఆ మేరకు జీవో జారీ చేసింది. అయితే బాలామణి తదితరులు రూ. 5 వేలు చెల్లించలేదు. ఆ తరువాత ఈ జీవో అమలు కోసం హైకోర్టులో బాలామణి తదితరులు పిటిషన్ దాఖలు చేయగా, సింగిల్ జడ్జి దానిని తోసిపుచ్చారు. దీనిపై ధర్మాసనం ముందు మరోసారి అప్పీల్ చేశారు. దీనిని బుధవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులను సమర్థించింది.