జలమండలి పనులపై కెమెరా కన్ను!
మ్యాన్‌హోళ్లు, మరమ్మతులు, నిర్మాణం పనులపై సీసీటీవీ నిఘా
కేంద్ర కార్యాలయంలో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్
ఖైరతాబాద్‌లోని ప్రధాన కార్యాలయం నుంచి పర్యవేక్షణ
సిటీబ్యూరో: పోలీసు శాఖకే పరిమితమైన కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఇప్పుడు జలమండలిలోనూ త్వరలో ఏర్పాటు కానుంది. మూతలు లేనివి, దెబ్బతిన్న మ్యాన్‌హోళ్లు, మంచినీరు, మురుగునీటి పైపులైన్ల లీకేజీలు, మరమ్మతులు, రిజర్వాయర్ల నిర్మాణం పనులను నిరంతరం పర్యవేక్షించేందుకు జలమండలి కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను త్వరలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ కేంద్రానికి ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయం వేదిక కానుంది. ఈ కేంద్రంలో పోలీసుశాఖ నగరవ్యాప్తంగా ఏర్పాటు చేసిన సీసీటీవీల నుంచి వీడియో ఫుటేజీని రోజువారీగా సేకరించి అధికారులు విశ్లేషించడం ద్వారా క్షేత్రస్థాయి సిబ్బందికి దిశానిర్దేశం చేయనున్నారు. మరోవైపు నగరంలో నిర్మాణంలో ఉన్న 56 భారీ మంచినీటి స్టోరేజి రిజర్వాయర్ల పురోగతిని పర్యవేక్షించేందుకుసైతం పనులు జరుగుతున్న ప్రాంతాల్లో సీసీటీవీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
4500 కెమెరాల నుంచి ఫుటేజీ స్వీకరణ..
ప్రస్తుతానికి గ్రేటర్‌వ్యాప్తంగా పోలీసు శాఖ ఏర్పాటుచేసిన 4500 సీసీటీవీలతో ప్రధాన రహదారులపై ఉన్న మ్యాన్‌హోళ్లు, పైపులైన్లు, వాల్వ్‌లపైనా నిఘా పెట్టాలని నిర్ణయించింది. ఈవిషయంలో పూర్తిగా సహకరించేందుకు పోలీసువిభాగం సూత్రప్రాయంగా అంగీకరించడంతో..ఆయా కెమెరాల నుంచి ఆన్‌లైన్‌లోనే నిరంతరం ఫుటేజీ స్వీకరణకు జలమండలికి మార్గం సుగమం అయ్యింది. అంటే ప్రస్తుతం ముఖ్యమైన కూడళ్లు, ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీల నిఘా నేత్రం ఇక నుంచి మ్యాన్‌హోళ్లు, పైపులైన్లు, వాల్వ్‌లపైకీ మళ్లనుంది. ఈ ఫుటేజీని ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో వీక్షించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయనున్నట్లు ఎండీ దానకిశోర్ ‘సాక్షి’కి తెలిపారు. ఈ కేంద్రం ఏర్పాటుతో వర్షం కురిసిన ప్రతిసారీ వరద, మురుగునీరు కలిసి సుడులు తిరుగుతూ ఉప్పొంగే మూతలు లేని మ్యాన్‌హోళ్లు,పైపులైన్లు, వాల్వ్‌లకు పడుతున్న చిల్లులు వంటి అంశాలన్నీ ఎప్పటికప్పుడు తెరపై వీక్షించి వెంటనే మరమ్మతు పనులకు ఆదేశించవచ్చని బోర్డు ఉన్నతాధికారులు తెలిపారు.
స్టోరేజీ రిజర్వాయర్ల నిర్మాణం పనులపైనా నిఘా నేత్రం..
ప్రస్తుతం గ్రేటర్‌లో విలీనమైన 12 శివారు మున్సిపల్ సర్కిళ్ల పరిధిలో హడ్కోసంస్థ మంజూరుచేసిన రూ.1900 కోట్ల అంచనా వ్యయంతో స్టోరేజి రిజర్వాయర్ల నిర్మాణం పనులు జరుగుతున్నాయి. ఈ పనులను ఏడాదిలోగా పూర్తిచేయాలని లక్ష్యం నిర్దేశించారు. ఆయా మున్సిపల్ సర్కిళ్ల పరిధిలో సుమారు 56 భారీ స్టోరేజి రిజర్వాయర్లు, వందల కిలోమీటర్ల మేర నీటిసరఫరా పైపులైన్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ పనులపై సైతం సీసీటీవీలతో నిఘా ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. తద్వారా అక్రమాలకు తావుండదని, నిర్మాణం పనులు వేగం పుంజుకుంటాయని అధికారులు చెబుతున్నారు.