సాక్షి, సిటీ బ్యూరో: రాష్ట్రానికే తలమానికంగా దేశానికే ఆదర్శంగా నగరంలో ఏర్పాటైన తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (టీఎస్‌ఐసీసీసీ) ఆధునిక సాంకేతికతకు కేరాఫ్ అడ్రస్‌గా మారనుంది. అత్యాధునిక సాంకేతికతను జోడిస్తూ దీన్ని నిర్మించారు. గురువారం జరగనున్న దీని ప్రారంభ వేడుకలను చిరస్థాయిగా నిలిచేలా నిర్వహించాలని నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ నిర్ణయించారు.
చదవండి: టీఆర్‌ఎస్‌లో టెన్షన్.. మునుగోడుపై ‘ఐ ప్యాక్’ కీలక నివేదిక!
ఈ నేపథ్యంలోనే వీటి కోసం నగర పోలీసు విభాగానికి చెందిన 25 మంది అధికారులను నియమించారు. ఆద్యంతం పర్యవేక్షించే బాధ్యతల్ని అదనపు సీపీ (శాంతిభద్రతలు) డీఎస్ చౌహాన్‌కు అప్పగించారు. ప్రభుత్వ ఉన్నతాధికారులతో పాటు పదవీ విరమణ చేసిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఆహ్వానిస్తున్నారు.
టీఎస్‌పీఐసీసీసీ హంగులివే..
పోలీసు సింగిల్ విండో: నగర కమిషనరేట్ పరిధిలోని శాంతిభద్రతలు, సీసీఎస్, టాస్క్‌ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్.. ఇలా అన్ని విభాగాలనూ ఒకే గొడుకు కిందికి తీసుకువస్తున్నారు. వీటిలో ఏ విభాగానికి సంబంధించిన పని కోసమైనా ప్రజలు వివిధ చోట్లకు తిరగాల్సిన అవసరం లేకుండా సింగిల్ విండో విధానం అమలుకానుంది.
కేంద్రీకృత పరిపాలన వ్యవస్థ:
టీఎస్‌ఐసీసీసీలో విపత్కర, అత్యవసర పరిస్థితుల్లో అని విభాగాల అధిపతులూ ఒకేచోట సమావేశమై నిర్ణయాలు తీసుకుంటారు. వేగంగా నిర్ణయాలు తీసుకోవడం, ఇవి తక్కువ సమయంలో అందరికీ చేరడం అదనపు ఆకర్షణలు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో కార్పొరేట్ స్థాయి సేవలు అందుబాటులోకి వస్తాయి. దీనికోసం ఏడో అంతస్తులో ముఖ్యమంత్రి, ప్రధాన కార్యదర్శి, డీజీపీ సహా కీలక విభాగాల అధిపతులకు ఛాంబర్లు ఉంటాయి.
ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టం:
డయల్– 100, అంబులెన్స్, ఫైర్స్, మహిళా భద్రత, షీ–టీమ్స్, హాక్ ఐ... ఈ వ్యవస్థలన్నీ ఒకే చోట ఉంటాయి. దీంతో అత్యవసర సమయాలతో పాటు బాధితుల నుంచి ఫిర్యాదు అందిన వెంటనే ఎలాంటి జాప్యం లేకుండా తక్షణం స్పందించేలా కంప్యూటర్ ప్రొగ్రామింగ్ ఉండనుంది. జీపీఎస్ పరిజ్ఞానం ఉన్న వాహనాలతో పాటు ఆస్పత్రులు, బ్లడ్ బ్యాంకులతో అనుసంధానమైన వ్యవస్థ ఇది.
సిటిజన్ పిటిషన్ మేనేజ్‌మెంట్:
ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల్ని విభాగాల వారీగా కేటాయింపు, సత్వర స్పందన, పరిష్కారం, వీటి మ్యాపింగ్ మొత్తం కంప్యూటర్ ద్వారా జరుగుతుంది. మార్కెట్, సోషల్ మీడియా విశ్లేషణ, మెబైల్ యాప్స్ ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థ ఉంటుంది. రిసెప్షన్ సెంటర్‌లో కియోస్‌్కలు ఏర్పాటు చేస్తారు.
శాంతిభద్రతల విభాగం
నగర వ్యాప్తంగా ఉండే సీసీ కెమెరాల్లో రికార్డు అవుతున్న దృశ్యాలను భారీ వీడియో వాల్ సహాయంతో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. ప్రత్యేక ఎనలటిక్స్‌గా పిలిచే సాఫ్ట్‌వేర్స్ ద్వారా శాంతిభద్రతల పరిస్థితుల్ని అంచనా వేస్తారు జీపీఎస్ పరిజ్ఞానం ఉన్న వాహనాలను అవసరమైన చోటుకు మళ్ళిస్తారు.
ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టం
నగరంలో ట్రాఫిక్ నిర్వహణకూ సాంకేతిక పరిజ్ఞానం వాడనున్నారు. సెన్సర్ల ద్వారా వివిధ మార్గాల్లో ట్రాఫిక్‌ను అధ్యయనం చేసి మార్పు చేర్పులు సూచిస్తారు. ఆర్టీఏ డేటాబేస్–అనుమానిత వాహనాల డేటాబేస్‌లను అనుసంధానిస్తారు. తక్షణ స్పందన కోసం ఇన్సిడెంట్ మేనేజ్‌మెంట్ టూల్స్ ఉంటాయి.
క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ సిస్టం:
ఎఫ్‌ఐఆర్ మొదలు కేసు స్థితిగతుల నిశిత పరిశీలన, నేరగాళ్ల డేటాబేస్ నిర్వహణ, నేరాలు జరిగే ప్రాంతాల క్రైమ్ మ్యాపింగ్, అధ్యయనం, జైలు నుంచి విడుదలయ్యే నేరగాళ్లపై పర్యవేక్షణ, డిజిటల్ ఇన్వెస్టిగేషన్ లాబ్ ఇతర టూల్స్ నేరాల నిరో«ధం, కేసుల సత్వర పరిష్కారానికి ఉపకరిస్తాయి.
బిజినెస్ ఇంటెలిజెన్స్:
నేరాలను పసిగట్టే, నేరగాళ్ల కదలికల్ని గుర్తించే సాఫ్ట్‌వేర్ ఎనలటికల్ టూల్స్ అందుబాటులోకి రానున్నాయి. వీటితో పాటు డేటా ఎనాలసిస్, అడ్వాన్స్ సెర్చ్‌కూ సాంకేతిక పరిజ్ఞానం వాడనున్నారు. అదనంగా ప్రత్యేక వెబ్ డిజైనింగ్ టూల్స్‌తో మెరుగైన సేవలు అందించనున్నారు.
అనేక కార్యాలయాల మార్పు..
నగర పోలీసు కమిషనరేట్ ఆగస్టు నెలాఖరు కల్లా టీఎస్‌ఐసీసీసీలోకి తరలనుంది. 18వ అంతస్తులో కొత్వాల్ కార్యాలయం ఉంటుంది. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, టెక్నాలజీ ఫ్యూజన్ సెంటర్, ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ తదితరాలు సైతం అక్కడకే వెళ్తాయి. ఇవి అయిదో అంతస్తులో ఉండనున్నాయి. ఏడో అంతస్తును ఇతర విభాగాల కోసం కేటాయించారు.
ప్రధాన కంట్రోల్ రూమ్‌లోనూ వీరికి భాగస్వామ్యం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న బషీర్‌బాగ్‌లోని పోలీసు కమిషనరేట్ సిటీ ట్రాఫిక్ కమిషనరేట్‌గా మారనుంది. దీంతో పాత కంట్రోల్ రూమ్‌ను పూర్తి స్థాయిలో సీసీఎస్, డిటెక్టివ్ డిపార్ట్‌మెంట్‌లతో పాటు మధ్య మండల కార్యాలయానికి అప్పగిస్తారు. ఫలితంగా సిట్ కార్యాలయం కూడా ఇక్కడకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం పాతబస్తీలో ఉన్నట్లే బషీర్‌బాగ్‌లోనూ కమిషనర్ కోసం ఓ కార్యాలయం ఉండనుంది.
ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
తెలంగాణ పోలీసును దేశంలోనే బెస్ట్ పోలీసింగ్‌గా తయారు చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సదుపాయాలు కల్పించారని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. బుధవారం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు రూపకల్పన చేసినట్లు చెప్పారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను గురువారం సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారన్నారు. 18వ అంతస్తులో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం, 14వ అంతస్తులో గ్యాలరీని ప్రారంభిస్తారని తెలిపారు.
పకడ్బందీ ఏర్పాట్లు..
కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం రానున్న నేపథ్యంలో పోలీసులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు వారం రోజుల నుంచి ఏర్పాట్లలో మునిగిపోయారు. బుధవారం సీఎం కాన్వాయ్ రిహార్సల్స్‌ను నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్
పర్యవేక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment