టన్నుకు అదనంగా రూ.300 వసూలు చేస్తున్నారు
ఆ సొమ్మంతా కూటమి నేతల జేబుల్లోకి వెళ్తోంది
గతంలోనే ఇసుక విధానం పారదర్శకంగా ఉండేది
విశాఖ కలెక్టర్‌కు క్వారీ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఫిర్యాదు
మహారాణిపేట (విశాఖ): శ్రీకాకుళంలోని ఇసుక రీచ్‌లలో దళారుల దోపిడీ దారుణంగా ఉందని, వారి నుంచి తమను కాపాడాలని విశాఖ కలెక్టర్‌కు క్వారీ లారీ ఓనర్స్ మొరపెట్టుకున్నారు. విశాఖ జిల్లా క్వారీ లారీ ఓనర్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కర్రి రమణ ఆధ్వర్యంలో అసోసియేషన్ ప్రతినిధులు కలెక్టరేట్‌లోని గ్రీవెన్స్‌లో సోమవారం ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గతంలోనే ఇసుక విధానం పారదర్శకంగా ఉండేదని చెప్పారు. కూటమి నాయకులు ఇసుక రీచ్‌ల వద్ద ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
టన్ను ఇసుకకు అదనంగా రూ.300 వసూలు చేస్తున్నారని, ఎందుకు అదనంగా ఇవ్వాలని అడిగితే వేధింపులకు గురి చేస్తున్నారని వాపోయారు. సీఎం చంద్రబాబు ఇసుక ఫ్రీ అంటే ఉచితంగా వస్తుందనుకున్నామని, కానీ డబ్బులు చెల్లించాలనడంతో ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. శ్రీకాకుళంలోని 11 ఇసుక రీచ్‌లలోనూ ఇదే పరిస్థితి నెలకొందన్నారు. విశాఖలో ఇసుక అమ్మాలంటే టన్ను రూ.వెయ్యి కంటే తక్కువకు విక్రయించలేని పరిస్థితి ఉందన్నారు.
సీఎం చంద్రబాబు ఇసుక ఫ్రీ అంటే మీరు ఇంత ఎక్కువ ధరకు ఎందుకు అమ్ముతున్నారని ప్రజలు తమను ప్రశ్నిస్తున్నారని అవేదన వ్యక్తం చేశారు. దీనిపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని అసోసియేషన్ కార్యదర్శి కర్రి రమణ తెలిపారు. గత ప్రభుత్వ ఇసుక విధానం వల్ల ప్రభుత్వానికి ఆదాయం వచ్చేదని, ఇప్పుడు కూటమి నేతల జేబుల్లోకి వెళుతోందని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment