జనహృదయ స్పందన వింటున్నారు.. విన్నవిద్దాం.. | Every Monday In The Collectorate There Is An Increase In The Number Of Complaints Are Coming To The Spandana Program | Sakshi
Sakshi News home page

జనహృదయ స్పందన వింటున్నారు.. విన్నవిద్దాం..

Published Tue, Jul 30 2019 7:39 AM | Last Updated on Thu, Aug 1 2019 1:10 PM

Every Monday In The Collectorate There Is An Increase In The Number Of Complaints Are Coming To The Spandana Program - Sakshi

వినతులు ఇచ్చేందుకు కలెక్టరేట్‌లో బారులు తీరిన ప్రజలు

ఇది ఏ ఒక్కరి ఆవేదనో కాదు.. కలెక్టరేట్‌లో వారం వారం జరుగుతున్న స్పందన కార్యక్రమానికి వస్తున్న వేలాది ఆర్తుల ఆక్రందన. అందరిదీ ఒకటే మాట. గత ప్రభుత్వం గ్రీవెన్స్‌ పేరుతో హడావుడి చేసి.. ఆనక అందిన దరఖాస్తులను రకరకాల కొర్రీలతో బుట్టదాఖలు చేసేది. ఫలితంగా ఒకటికి పదిసార్లు కాళ్లరిగేలా తిరిగినా బాధితులకు న్యాయం జరిగేది కాదు. కానీ వైఎస్‌జగన్‌ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జవాబుదారీతనం పెరిగింది. ప్రజల వినతులకు రోజుల వ్యవధిలోనే స్పందన లభిస్తోంది. జూలై నెల పరిస్థితినే పరిశీలిస్తే.. ఈ నెల ఒకటి నుంచి 25వ తేదీ వరకు స్పందన కార్యక్రమానికి మొత్తం 6,719 వినతులు అందితే.. వాటిలో సుమారు 72 శాతం పరిష్కారం సాధించడం ద్వారా విశాఖ జిల్లా రాష్ట్రంలోనే మూడో స్థానంలో నిలిచింది. కేవలం 179 అర్జీలనే అనర్హమైనవిగా తేల్చి తిరస్కరించారు. అదే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అధిక శాతం అర్జీలు కుంటి సాకులతో తిరస్కరణకు గురయ్యేవి. వైఎస్‌జగన్‌ ప్రభుత్వం ప్రతి అర్జీని ఆన్‌లైన్‌లో పొందుపర్చి, నెంబరు కేటాయించడం, ఏ స్థాయిలో ఉందో తెలుసుకునే వీలు కల్పించడంతోపాటు నిర్ధిష్ట గడువు విధించడంతో స్పందన వినతులకు త్వరితగతిన పరిష్కారం లభిస్తోంది. ఇవే కారణాలతో స్పందన ప్రజామన్ననలు చురగొంటోంది. ఏళ్ల తరబడి పరిష్కారం కాని తమ సమస్యలు పరిష్కారమవుతాయన్న నమ్మకంతో ప్రజలు వేల సంఖ్యలో వినతులిచ్చేందుకు ముందుకు వస్తున్నారు. ఫలితంగా ఏ వారానికావారం వినతుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. అయినా అధికార యంత్రాంగం ఓపికగా వాటిని స్వీకరించి.. పరిష్కారం చూపుతున్నారు.
– సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం

జూలై 1–25 మధ్య అందిన వినతులు.. పరిష్కారాలు
కేటగిరీ                 వినతుల             పరిష్కార 
                           సంఖ్య               శాతం

రేషన్‌ కార్డులు        2,619             88.62
భూసమస్యలు       1,831              47.84
పింఛన్లు               1,655             92.27
పురపాలన           1,298              86.06
హౌసింగ్‌               654                89.45
పంచాయతీరాజ్‌      349                77.36
విద్యుత్తు               331               88.22

సాక్షి, విశాఖపట్నం: ప్రతి సోమవారం ‘స్పందన’ కార్యక్రమానికి వస్తున్న ఆర్జీల సంఖ్య పెరుగుతోంది. తొలిసారిగా ఈనెల 1వ తేదీన జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ‘స్పందన’లోనే 513 ఆర్జీలు వచ్చాయి. రెండో సోమవారం 454 వచ్చాయి. గత ప్రభుత్వంలో ఎన్నిసార్లు ఆర్జీలు ఇచ్చినా తమ సమస్య పరిష్కారంగాక నిరాశలో ఉన్నవారు ఇప్పుడు ‘స్పందన’ తీరు తెలుసుకొంటున్నారు. తమకొక మార్గం దొరుకుతుందనే కొండంత ఆశతో వస్తున్నారు. దీంతో మూడో వారం నుంచి ఆర్జీల సంఖ్య మరింత పెరిగింది. మూడో సోమవారం 897 ఆర్జీలు రాగా నాలుగో సోమవారానికి ఏకంగా 985 ఆర్జీలు దాఖలయ్యాయి. ఇక ఐదో సోమవారం కూడా అదే రీతిలో పెరుగుతూ 1,062 ఆర్జీలు వచ్చాయి. మరోవైపు జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ కార్యాలయంలో 19, మహావిశాఖ నగరపాలక సంస్థ కార్యాలయంలో 228 వినతులు అందాయి. 

పరిష్కారానికి పట్టుదల
ఈనెల 1వ తేదీ నుంచి 25వ తేదీ వరకూ కలెక్టరేట్‌ సహా జిల్లా వ్యాప్తంగా ‘స్పందన’కు 6,719 అర్జీలు వచ్చాయి. వాటిలో 179 అనర్హమైనవిగా తిరస్కరించారు. మిగిలిన వాటిలో 1,927 అర్జీలు పరిశీలన దశలో ఉన్నాయి. 2,889 అర్జీల పరిశీలన పూర్తి అయింది. వాటిని మంజూరుకు సిద్ధం చేశారు. 1,922 ఆర్జీలను పరిష్కరించారు. ఇలా 72.17 శాతం అర్జీలను పరిష్కరించడంతో జిల్లా రాష్ట్రంలోనే మూడో స్థానంలో నిలిచింది. ఏదో మొక్కుబడిగా ఎండార్స్‌మెంట్‌ ఇచ్చేయకుండా ప్రతి అర్జీకి సరైన పరిష్కారం చూపించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతి మంగళవారం నిర్వహిస్తున్న వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులకు స్పష్టం చేస్తున్నారు. అందుకు తగినట్లుగా అర్జీల పరిష్కారం ఏవిధంగా చేయాలో ఇప్పటికే ఒకటికి రెండుసార్లు అధికార యంత్రాంగానికి జిల్లా కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌ వివరించారు. దీంతో అర్జీల పరిష్కారానికి అధికారులు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. 

ప్రతి అర్జీకి ఒక సంఖ్య...
ప్రజలు సమర్పించే ప్రతి అర్జీకి ఒక నంబరు కేటాయిస్తున్నారు. వాటిని ఆన్‌లైన్‌ చేసేందుకు జిల్లా కలెక్టరేట్‌లోనే 16 కౌంటర్లు ఏర్పాటు చేశారు. వాటిని ఉన్నతాధికారులు పరిశీలించి విభాగాల వారీగా ఆయా అర్జీలను విభాగాధిపతులకు పంపిస్తున్నారు. అలా వచ్చిన ప్రతీ అర్జీని సంబంధిత విభాగాధిపతి స్వయంగా పరిశీలించాల్సిందే. దిగువ స్థాయి సిబ్బంది ఇచ్చే ఎండార్స్‌మెంట్‌ను చూడకుండా డిస్పోజ్‌ చేయవద్దని ఇప్పటికే కలెక్టరు హెచ్చరించారు. అవసరమైతే క్షేత్రస్థాయిలో పరిశీలించి డిస్పోజ్‌ చేసినట్లు అప్‌లోడ్‌ చేయాలని చెప్పారు. పనిదినాల్లో ప్రతి రోజూ కార్యాలయానికి రాగానే అరగంట సమయాన్ని ఈ అర్జీల పరిష్కారానికి వెచ్చించాలని ఆదేశాలిచ్చారు. ఇలా ‘స్పందన’ దరఖాస్తుల పరిష్కారానికి అధికార యంత్రాంగం కృషి చేస్తోందని జాయింట్‌ కలెక్టరు ఎల్‌.శివశంకర్‌ చెప్పారు. 

కొన్ని సమస్యలపైనే అత్యధికం..
ఆర్జీల్లో ఎక్కువగా రేషన్‌కార్డులు, పింఛన్లు, ఇల్లు, ఇంటిస్థలం మంజూరు కోసమే ఉంటున్నాయి. అలాగే భూసంబంధిత సమస్యల పరిష్కారానికి ఎక్కువ అర్జీలు వస్తున్నాయి. మొత్తం 64 విభాగాల్లో అర్జీలను అంశాల వారీగా పొందుపర్చుతున్నారు. 

పోలీస్‌ కమిషనరేట్‌కు 103 ఫిర్యాదులు
ద్వారకానగర్‌(విశాఖ దక్షిణ): నగర పోలీస్‌ కమిషనరేట్‌లో సోమవారం జరిగిన స్పందనకు 103 ఫిర్యాదులు అందాయి. 19 ఫిర్యాదులను సీపీ ఆర్కే మీనా స్వయంగా స్వీకరించారు. ఇతర 84 ఫిర్యాదులు సంబంధింత పోలీస్‌స్టేషన్లలో సీఐలు స్వీకరించారు. వీటిలో ఆస్తులు, కుటుంబ కలహాలు, ఆర్థిక పరమైన అంశాలు, చీటింగ్‌లకు సంబంధించిన ఫిర్యాదులు ఉన్నాయి.  

జీవీఎంసీకి 228 ఫిర్యాదులు
సాక్షి,విశాఖపట్నం: జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి మొత్తం 228 ఫిర్యాదులు అందాయి. జీవిఎసీ కమిషనర్‌ జి.సృజన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వీటిని తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మొత్తం ఫిర్యాదుల్లో ప్రధాన కార్యాలయానికి 88, ఒకటో జోన్‌కు సంబంధించి 30, మూడో జోన్‌కు సంబంధించి రెండు, నాలుగో జోన్‌కు సంబంధించి 12, ఐదో జోన్‌కు సంబంధించి 72, ఆరో జోన్‌కు సంబంధించి 10, భీమిలి జోన్‌కు సంబంధించి 14 ఫిర్యాదులందాయి. వీటిలో టౌన్‌ప్లానింగ్‌ విభాగానికి 31, ప్రజారోగ్య విభాగానికి 14, ఇంజనీరింగ్‌ విభాగానికి 41, ఇ.ఇ విభాగానికి 4, డిప్యూటీ కమిషనర్‌ రెవెన్యూ విభాగానికి 54, యుసీడీ విభాగానికి 16 ఫిర్యాదులు అందాయి. 

డయల్‌ యువర్‌ కమిషనర్‌కు 23 ఫిర్యాదులు 
జీవిఎంసీ డయల్‌ యువర్‌ కమిషనర్‌ కార్యక్రమానికి 23 ఫిర్యాదులు అందాయి. కమిషనర్‌ జి.సృజన పలువురి నుంచి వచ్చిన ఫోన్‌ కాల్స్‌కు సమాధానం చెప్పారు. ఇందులో ఒకటో జోన్‌ నుంచి 2, రెండో జోన్‌ నుంచి 6, మూడో జోన్‌ నుంచి రెండు, నాలుగో జోన్‌ నుంచి 4, ఐదో జోన్‌ నుంచి 1, ఆరో జోన్‌ నుంచి 5, అనకాపల్లి జోన్‌ నుంచి 1, భీమిలి జోన్‌ నుంచి 2 ఫిర్యాదులు అందాయి. సంబంధిత అధికారులు ఫిర్యాదులను స్వయంగా పరిశీలించి మూడు రోజులులోగా నివేదిక సమర్పించాలని ఆదేశించారు.     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement