పునశ్చరణేదీ..!
పాఠ్యాంశాలు మారాయి. పదో తరగతి విద్యార్థులకు సృజనాత్మక బోధన చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఇందుకు ఉపక్రమించింది. వాటిని విద్యార్థులకు చేర్చాల్సిన ‘గురువులకు’ పునశ్చరణ జరగక పోవడంతో అసలు ఉద్దేశ్యం నెరవేరే అవకాశం లేదు. వారు పట్టు సాధిస్తేనే శిష్యులను తీర్చి దిద్దగలరు. ఈ అంశంపై మీన మేషాలు లెక్కిస్తున్న విద్యాశాఖ ఇప్పటి వరకూ శిక్షణపై పెదవి విప్పడం లేదు. విలువైన విద్యాసంవత్సరంలోనే ఇందుకు ఉపక్రమిస్తే బోధనాకాలం కొంత నష్టపోయినట్టే. ఇదే ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.
పాలమూరు, న్యూస్‌లైన్ : అసలు సమయం వృథా చేయడం.. ఆ తర్వాత హడావుడి చేయ డం విద్యాశాఖకు అలవాటుగా మారింది. ఈ కారణంగానే ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమంపై ఏమాత్రం ఊసెత్తడం లేదు. ఈ విద్యా సంవత్సరానికి పదోతరగతి సిలబస్ పూర్తిగా మారిపోయింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ముందస్తుగా శిక్షణ కార్యక్రమం చేపట్టాల్సి ఉండగా.. కనీసం ఎప్పటి నుంచి ఇవ్వనున్నది జిల్లా స్థాయి అధికారులు చెప్పలేని పరిస్థితి నెలకొంది. ప్రతీ విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయుల నైపుణ్యాన్ని పెంపొందించడంతోపాటు పాఠ్యాంశాల మార్పుపై పూర్తిస్థాయి అవగాహన వచ్చేందుకు పునశ్చరణ తరగతులు చేపట్టాలి. ఈసారి విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేందుకు కేవలం 6 రోజులు మాత్రమే మిగిలి ఉంది. అయినప్పటికీ శిక్షణపై ఎలాంటి సమాచారం లేదు.
‘వేసవి’లోనే చేపట్టాల్సి ఉన్నా...
ప్రాథమిక విద్య బలోపేతంలో భాగంగానే విద్యా హక్కు చట్టాన్ని అనుసరించి వేసవి సెలవుల్లో అధ్యాపకులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. రాజీవ్ విద్యామిషన్ ద్వారా 1-8 తరగతుల్లో బోధించే వారికి విడతల వారీగా గతంలో పాఠ్యాం శాల మార్పు. నైపుణ్యాలపై శిక్షణ అందించారు. గడిచిన ఏడాదిలో జిల్లా నుంచి 80 మంది టీచర్లను ఎంపిక చేసి రాష్ట్ర స్థా యిలో శిక్షణ అందించాక.. తిరిగి జిల్లాలోని అన్ని మండల వనరుల కేంద్రాల వారీగా మిగిలిన వారికి వారి ద్వారా శిక్షణ ఇప్పించారు. ఈ ప్రక్రియ మొత్తం జూన్ తొలి వారంలోగా పూర్తవ్వాలి.ఈ మారు రాష్ట్రంలో గవర్నర్ పాలన ఉండటం, రా ష్ట్ర విభజన ప్రక్రియ జరిగిన నేపథ్యంలో విద్యాశాఖ ఉన్నతాధికారులు దీన్ని పట్టిం చుకోలేదు. వాస్తవానికి మే 28 నుంచి పునశ్చరణ తరగతులు నిర్వహిస్తామని ఆర్‌వీఎం జిల్లా అధికారులకు ఇదివరకే మౌఖిక ఆదేశాలు అందాయి. ఆ తర్వాత ఆ ప్రస్తావనే లేదు. ఒకవైపు వి ద్యా సంవత్సరం ప్రారంభం కావడానికి కేవలం ఆరు రోజులు మాత్రమే ఉండటంతో సర్వత్రా ఆందోళనకు గురిచేస్తోంది.
సిలబస్‌లో ఊహించని మార్పులు
పదోతరగతి సిలబస్‌లో ఎస్‌సీఈఆర్‌టీ ఊహించని మార్పులు తీసుకొచ్చింది. ఇది విద్యార్థులకు ఎంతో మేలు కలిగే అంశమే అయినప్పటికీ వారికి అవగాహన కల్పించాల్సిన ఉపాధ్యాయులకు సిలబస్‌పై పట్టురాలేదు. ఇప్పటికే మారి న పాఠ్య పుస్తకాలు అన్ని పాఠశాలలకు చేరాయి. జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభం కాగానే తరగతులు ప్రారంభించటమే తరువాయి. ఈ సమయంలో కొత్త పాఠ్యాంశంపై ఏమాత్రం అవగాహన లేని ఉపాధ్యాయులు ఏమేరకు బోధిస్తారన్నది ప్రశ్నార్థకమే.
మరోవైపు జూన్ నెలాఖరులో శిక్షణ తరగతులు అందించే అవకాశాలు ఉన్నట్లు రాజీవ్ విద్యామిషన్ అధికారులు చెప్తున్నారు. ఆ సమయంలో శిక్షణ అందించినా మొత్తం మీద విద్యా సంవత్సరంలో నెలరోజుల సమయం వృథాకాక తప్పదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. దీనివల్ల పదోతరగతి విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదు. ఇవన్నీ ఇలా ఉంటే ప్రైవేటు పాఠశాలలు ముందస్తుగా తమ ఉపాధ్యాయులను బోధనకు సిద్ధం చేసుకోవటం ప్రభుత్వ పాఠశాలలపై ఉన్నతాధికారులకు ఉన్న శ్రద్ధ ఏమిటో తెలుస్తోంది.
ఆదేశాలు వచ్చాక
శిక్షణ ఇస్తాం
మారిన పదోతరగతి సిలబస్‌కు అనుగుణంగా బోధిం చే లా ఉపాధ్యాయులు శిక్షణ చేపట్టాల్సి ఉంది. తొందరలోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నాం. అయితే దీనిపై విద్యాశాఖ ఉన్నతాధికారుల నుంచి ఆదేశా లు రావాల్సి ఉంది. ఆ తర్వాతే దీనిపై షెడ్యూల్ సిద్ధం చేసి శిక్షణ ఇస్తాం.
- డీఈఓ చంద్రమోహన్
విద్యా సంవత్సరం
వృథా అవుతుంది
విద్యార్థులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలంటే మారిన సిలబస్‌పై ఉపాధ్యాయులకు మే నెలలోపే శిక్షణ ఇవ్వాల్సి ఉండేది. అధికారులు తర్వాత శిక్షణ చేపట్టడం వల్ల రెగ్యులర్ తరగతులకు ఆటంకం ఏర్పడుతుంది. దీనికి తోడు పదోతరగతి విద్యార్థులకు విద్యాసంవత్సరం వృథా అవుతుంది.
- గట్టు వెంకట్‌రెడ్డి, పీఆర్‌టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు.