సం‘క్షేమమేనా..’! | WELFARE | Sakshi
Sakshi News home page

సం‘క్షేమమేనా..’!

Published Sun, Jun 8 2014 1:56 AM | Last Updated on Wed, Sep 5 2018 8:24 PM

సం‘క్షేమమేనా..’! - Sakshi

సం‘క్షేమమేనా..’!

 కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది.. కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. నిన్నామొన్నటి వరకు సమైక్య రాష్ట్రంలో అమలైన సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుం దా లేదా అని లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది. సంక్షేమ పథకాలపైనే ఆధారపడిన వేలాది కుటుంబాలు ఆతృతగా ఎదురుచూస్తున్నాయి. ముఖ్యంగా ఇందిర మ్మ ఇళ్లు, రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపాధి హామీ పథకం, పింఛన్ల పంపిణీ, బంగారు తల్లి వంటి వివిధ సంక్షేమ పథకాలతో జిల్లాలో వేల సంఖ్యలో  లబ్ధిదారులు ఉన్నారు.

అయితే.. ఈ పథకాల అమలుపై ఇంతవరకు అధికారులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గదర్శకాలు రాలేదు. దీంతో గందరగోళం నెలకొంది. ఇదిలా ఉంటే.. గత ప్రభుత్వ పథకాలనే కొనసాగించి అమలు చేస్తే.. ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వానికి గుర్తింపు ఉండదని.. అందుకే కొత్త పథకాలు ప్రవేశపెట్టి లబ్ధిపొందడమో లేదా ఉన్న పథకాలకు మార్పులు చేర్పులు చేయడమో అనే కోణంలో ప్రభుత్వం ఆలోచనలు చేస్తున్నట్లు పలువురు నేతలు, అధికారులు చెబుతున్నారు. జిల్లాలో వివిధ పథకాల ద్వారా లబ్ధిపొందిన వారి వివరాలు ఓసారి పరిశీలిస్తే..
 

రాజీవ్ ఆరోగ్యశ్రీ..
 నిరుపేదలతోపాటు ఇతరులకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు ప్రవేశపెట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం పేద ప్రజలకు అండగా నిలిచింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచిత వైద్య చికిత్సలు అందుతాయి. తెల్లరేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ ఈ పథకానికి అర్హులు. పథకం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 45 వేల వివిధ రకాల చికిత్సలు జరిగాయి. చికిత్సలకు సుమారు రూ.125 కోట్లు ఖర్చు చేశారు. ఈ పథకం కింద నమోదైన వారు ప్రైవేట్, కార్పొరేట్, ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందొచ్చు.
 
ఇందిరమ్మ ఇళ్లు..
 జిల్లాలో ఇందిరమ్మ పథకం ద్వారా 2006 నుంచి 2009 వరకు మూడు విడతలుగా ఇళ్లు మంజూరయ్యాయి. 2010 నుంచి 2014 వరకు మూడు విడతలుగా నిర్వహించిన రచ్చబండ కార్యక్రమం ద్వారా వీటిని మంజూరు చేశారు. దీంతోపాటు రీ హ్యాబిటేషన్, రీ సెటిల్‌మెంట్ కింద లబ్ధిదారులకు ఇళ్లు వచ్చాయి. జిల్లాకు 2006 నుంచి 2014 వరకు మొత్తం 3,80,787 ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో 2,14,912 ఇళ్ల నిర్మాణం పూర్తయ్యాయి. 1,65,875 ఇళ్లు వివిధ దశల నిర్మాణంలో ఉన్నాయి. దీంతోపాటు రచ్చబండ కార్యక్రమం ద్వారా ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు దాదాపు 50 వేలకు పైగా ఉన్నారు.
 
ఉపాధి హామీ పథకం..

 జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఈజీఎస్) ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఏటా వేసవిలో ఉపాధి భరోసా కల్పించింది. పథకం ప్రారంభం నుంచి గ్రామీణ ప్రజలు దీనిపై ఆధారపడ్డారు. జిల్లాలో ఈ పథకం కింద 31,613 శ్రమశక్తి సంఘాలు పనిచేస్తున్నాయి. 5,71,130 మంది కూలీలు ఈ పథకం ద్వారా ఉపాధి పొందుతున్నారు. 739 వికలాంగుల శ్రమశక్తి సంఘాలు ఉన్నాయి. దీని ద్వారా 5,548 మంది కూలీలు ఉపాధి పొందుతున్నారు. ఈ యేడాది సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఉపాధి హామీ పనులు సక్రమంగా కొనసాగలేదు. గతేడాది వేసవిలో రోజుకు 2 లక్షల 50 వేల మంది కూలీలు పని చేశారు. అయితే వీరికి రోజుకు రూ.3 కోట్ల 12 లక్షల 50 వేలు అధికారులు కూలీ చెల్లించారు.
 
పింఛన్లు, అభయహస్తం..
 జిల్లాలో 60 ఏళ్లకు పైబడిన వారికి పింఛన్ సౌకర్యం ఉంది. ప్రస్తుతం 2,62,004 మంది వివిధ రకాల పింఛన్లు పొందుతున్నారు. వృద్ధాప్య పింఛన్లు పింఛన్లు 1,35,750 ఉండగా, 537 చేనేత, 26,924 వికలాంగ, 79,921 వితంతు, 283 కల్లుగీత కార్మిక పింఛన్లు ఉన్నాయి. దీంతోపాటు అభయహస్తం కింద ప్రతినెలా 18,528 మంది పింఛన్ పొందుతున్నారు. వృద్ధులకు, వితంతువులకు ప్రతినెలా రూ. 200 చొప్పున, వికలాంగులు, అభయహస్తం పింఛన్‌దారులు రూ.500 చొప్పున పింఛన్ తీసుకుంటున్నారు. ఈ లెక్కన ప్రతినెలా రూ.7.75 కోట్లు పింఛన్ల రూపంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా చెల్లింపులు జరుగుతున్నాయి. అభయహస్తంలో 1,49,183 మంది మహిళలు నమోదై ఉన్నారు. పింఛన్ డబ్బులు పక్కదారి పట్టకుండా డబ్బులు అర్హులకు అందించేందుకు బయోమెట్రిక్, యాక్సిస్‌బ్యాంకు, తదితర పద్ధతులను అనుసరిస్తున్నారు.
 
ఫీజు రీయింబర్స్‌మెంట్..

 నిరుపేద విద్యార్థులు కార్పొరేట్ కళాశాలల్లో ఉన్నత చదువులు చదవాలనే లక్ష్యంతో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన మహోన్నత పథకం ఫీజు రీయింబర్స్‌మెంట్. ఈ పథకం ద్వారా ఎంతో మంది విద్యార్థులు తమ కలలను సాకారం చేసుకుంటున్నారు. జిల్లాలో పోస్ట్‌మెట్రిక్ స్కాలర్‌షిప్ కింద 64,624 మంది ఎస్సీ, బీసీ, ఈబీసీ విద్యార్థులు ఉన్నారు. వీరిలోంచి 52,738 మంది విద్యార్థులకు ఈ యేడాది స్కాలర్‌షిప్‌లు అందాయి. రూ.36.93 కోట్లు విద్యార్థులకు స్కాలర్‌షిప్ రూపంలో అందజేశారు. మిగతా 8,886 మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు చెల్లించాల్సి ఉంది. విద్యార్థులకు ఇంకా రూ.27.55 కోట్లు రావాల్సి ఉంది. ప్రీమెట్రిక్ స్కాలర్‌షిప్‌లో ఎస్సీ విద్యార్థులు 22,227 మంది ఉన్నారు. వీరిలోంచి 14,929 మందికి రూ.1.98 కోట్లు అందజేశారు. ఇం కా రూ.1.44 కోట్లు రావాల్సి ఉంది. బీసీ విద్యార్థులు 15,504 మందికిగాను 5,369 మంది స్కాలర్‌షిప్ పొందారు. వీరికి రూ.53 లక్షలు స్కాలర్‌షిప్ రూపం లో అందింది. మిగతా 10,135 మంది విద్యార్థులకు సంబంధించి రూ.49 లక్షలు చెల్లించాల్సి ఉంది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement