Cochlear implants
-
చిట్టి చెవులకు గట్టి భరోసా
అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలం మల్లవరంకు చెందిన అడిగర్ల కొండబాబు, సత్యవేణి దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఆరేళ్ల క్రితం కుమారుడు పుట్టాడు. చిన్నారి శబ్దాలను గ్రహించలేకపోవడంతోపాటు ఎవరైనా పలకరించినా వారివైపు చూసేవాడు కాదు. దీంతో తల్లిదండ్రులు వైద్యులను సంప్రదించగా పుట్టుకతోనే వినికిడి లోపం ఉన్నట్టు నిర్ధారించారు. కాక్లియర్ ఇంప్లాంటేషన్ సర్జరీ చేయాలని.. ఇందుకు రూ.8 లక్షల వరకు ఖర్చవుతుందని చెప్పడంతో ఆ నిరుపేద దంపతులు హతాశులయ్యారు. ఈ తరుణంలో వారిని వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ఆదుకుంది. ఈ పథకం కింద విశాఖలోని విమ్స్‌లో ఉచితంగా గతేడాది ఆగస్టులో బాబుకు సర్జరీ చేశారు. ప్రస్తుతం పిల్లాడికి వినిపిస్తోంది.. తల్లిదండ్రులు పిలిస్తే పలుకుతున్నాడు.. నెమ్మదిగా మాట్లాడుతున్నాడు. దీంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవు. ‘బాబుకు సర్జరీ చేయించేంత ఆర్థిక స్తోమత మాకు లేదు. అలాంటి మమ్మల్ని సీఎం వైఎస్ జగన్ ఆదుకున్నారు. బిడ్డకు మేం జన్మనిస్తే.. వాడికి మాటలు వచ్చేలా చేసి ఆరోగ్యశ్రీ పునర్జన్మను ప్రసాదించింది’ అని కొండబాబు సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. – సాక్షి, అమరావతి ..ఇది ఒక్క కొండబాబు ఆనందం మాత్రమే కాదు. రాష్ట్రంలో ఎంతో మంది వినికిడి శక్తి లేని చిన్నారులకు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ఆపద్బాంధవిలా నిలుస్తోంది. పేద, మధ్యతరగతి కుటుంబాల్లోని చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. ఈ పథకం కింద పుట్టుకతోనే వినికిడి లోపం ఉన్న పిల్లలకు అత్యంత ఖరీదైన కాక్లియర్ ఇంప్లాంటేషన్ సర్జరీలను వైఎస్ జగన్ ప్రభుత్వం పూర్తి ఉచితంగా నిర్వహిస్తోంది. ఇప్పటివరకు 566 మందికి .. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీ పథకాన్ని బలోపేతం చేసింది. ఇందులో భాగంగా రెండు చెవులకు (బైలాటెరల్) కాక్లియర్ ఇంప్లాంటేషన్ సర్జరీని పథకంలోకి చేర్చింది. దీంతో దాదాపు రూ.12 లక్షలు ఖర్చయ్యే సర్జరీకి కూడా ఆరోగ్యశ్రీ వర్తించింది. 2019 నుంచి ఇప్పటివరకు 566 మంది వినికిడి లోపం ఉన్న పిల్లలకు ప్రభుత్వం కాక్లియర్ ఇంప్లాంటేషన్ సర్జరీలు నిర్వహించింది. ఇందుకు రూ.33.48 కోట్లు ఖర్చు చేసింది. అంతేకాకుండా ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాక వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద చిన్నారులకు విశ్రాంత సమయానికి భృతిని సైతం అందజేస్తున్నారు. మా జీవితాల్లో సీఎం జగన్ సంతోషాన్ని నింపారు.. నేను ప్రైవేట్ బ్యాంక్‌లో ఉద్యోగిని. మా నాలుగేళ్ల బాబుకు పుట్టుకతోనే వినికిడి లోపం ఉంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో రూ.12 లక్షల వరకు ఖర్చవుతుందన్నారు. అంత ఆర్ధిక స్తోమత మాకు లేదు. గతేడాది ఆరోగ్యశ్రీ కింద పూర్తి ఉచితంగా రెండు చెవులకు బైలాటెరల్ కాక్లియర్ ఇంప్లాంటేషన్ జరిగింది. ప్రస్తుతం చిన్న చిన్నగా మాట్లాడగలుగుతున్నాడు.. స్కూల్‌కు కూడా వెళుతున్నాడు. మా జీవితాల్లో సంతోషాన్ని నింపిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మేలును ఎప్పటికీ మరిచిపోలేం. – సీహెచ్ శ్రీధర్, నర్సిపురం, శ్రీకాకుళం జిల్లా ప్రభుత్వం చేసిన మేలును ఈ జన్మకు మరువను.. మా బాబు జాన్విత్కు పుట్టుకతోనే వినికిడి లోపం ఉంది. దీంతో పెద్దయ్యేకొద్దీ బాబుకు మాటలు కూడా రావని వైద్యులు చెప్పారు. కాక్లియర్ ఇంప్లాంటేషన్ చేయిస్తే వినికిడి శక్తి వస్తుందన్నారు. మాది పేద కుటుంబం కావడంతో సర్జరీ చేయించే స్తోమత మాకు లేదు. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.12 లక్షల విలువైన ఆపరేషన్‌ను ఉచితంగా ప్రభుత్వం చేయించింది. ఏడాది పాటు ఉచితంగా సౌండ్ థెరపీ ఇచ్చి బాబుకు మాటలొచ్చేలా చేశారు. వాడు పుట్టిన కొన్నేళ్లకు అమ్మా అనే పిలుపునకు నోచుకున్నాను. ప్రభుత్వం చేసిన మేలును ఈ జన్మకు మరువను. – లక్ష్మి, దొర్నిపాడు, నంద్యాల జిల్లా -
ఇకపై బోధనాస్పత్రుల్లో కాక్లియర్ ఇంప్లాంట్స్
సాక్షి, అమరావతి : కాక్లియర్ ఇంప్లాంట్స్‌ను ఇకపై ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో వేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటి దాకా రెండు లేదా మూడు ప్రైవేటు ఆస్పత్రుల్లోనే వీటిని వేసేవారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఈ సర్జరీలు చేసేకంటే ప్రభుత్వాస్పత్రుల్లోనే చేస్తే.. ఆరోగ్యశ్రీ కింద వచ్చే సొమ్ము కూడా ప్రభుత్వాస్పత్రులకే వస్తుందన్నది ప్రధానోద్దేశం. అలాగే ఎక్కువ ఆస్పత్రుల్లో ఈ సర్జరీ చేసే అవకాశం ఉంటుంది.. ఫలితంగా చిన్నారులకు జాప్యం లేకుండా సర్జరీలు పూర్తవుతాయి. పుట్టుకతో చెవుడు, మూగతో ఉన్నవారికి కాక్లియర్ ఇంప్లాంట్స్ వేస్తారు. దివంగత సీఎం వైఎస్సార్ ఈ చికిత్సను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చారు. దీంతో వందలాది మంది చిన్నారులకు మాటలు, వినికిడి వచ్చాయి. రాష్ట్రంలో 11 బోధనాస్పత్రులున్నాయి. సుమారు 100 మంది వరకూ ఈఎన్టీ సర్జన్‌లున్నారు. సీనియర్లు, నైపుణ్యం ఉన్న వాళ్లు చాలా మంది ఉన్నారు. బోధనాస్పత్రుల్లోనే కాక్లియర్ ఇంప్లాంట్స్ వేయడంపై గతంలోనే ప్రతిపాదనలు సిద్ధం కాగా, కోవిడ్ రాకతో ఆ ప్రక్రియ ఆగింది. మళ్లీ తాజాగా దీనిపై కసరత్తు మొదలైంది. కాక్లియర్ ఇంప్లాంట్స్ వేసేందుకు ఎలాంటి వైద్య ఉపకరణాలు కావాలి? ప్రస్తుతం ఉన్న వసతులేంటి? ఉన్న వైద్యులకు శిక్షణ ఎక్కడ ఇవ్వాలి? అన్న దానిపై కూడా చర్చిస్తున్నారు. గతంలో ఒక చిన్నారికి ఒక చెవికి మాత్రమే ఇంప్లాంట్స్ వేసేవారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక రెండు చెవులకూ వేయాలని ఆదేశాలిచ్చింది. ప్రభుత్వాస్పత్రుల్లో మౌలిక వసతులు కాక్లియర్ ఇంప్లాంట్ బోధనాస్పత్రుల్లో వేసేందుకు ప్రయత్నిస్తున్నాం. ఈఎన్టీ సర్జన్లకు శిక్షణ ఇస్తే సరిపోతుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే మౌలిక వసతులున్నప్పుడు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లడం ఎందుకనేది ప్రధానోద్దేశం. – డా.బి.సాంబశివారెడ్డి, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ వైస్ చైర్మన్ -
చెవిటి–మూగ వైకల్య రహిత రాష్ట్రమే లక్ష్యం
అప్పుడే పుట్టిన శిశువులు, విలేజ్ క్లినిక్‌లకు వచ్చే చిన్నారులు, స్కూలు విద్యార్థులలో చెవిటి – మూగ లోపాలను ముందుగానే గుర్తించ డానికి పరీక్షలు నిర్వహించాలి. ‘కంటి వెలుగు’ తరహాలో స్క్రీనింగ్ చేయాలి. అప్పుడే అవగాహన, చైతన్యం కలిగించగలుగుతాం. ఆ తర్వాత అవసరమైన వారికి కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చేయిస్తాం. ఈ మేరకు చర్యలు తీసుకోవాలి. లేదంటే వారి జీవితం అంధకారంగా ఉంటుంది. వినికిడి సమస్యపై స్క్రీనింగ్ నిర్వహించేందుకు, ఆ తర్వాత అవసరమైన పిల్లలకు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీలు చేయించేందుకు తగిన పరికరాలు, మౌలిక సదుపాయాలు, వాటి నిర్వహణ విధానంపై దృష్టి పెట్టాలి. ఈ సమస్యపై విదేశాల్లో అనుసరిస్తున్న విధానాలపై దృష్టి సారించడంతో పాటు, కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చేసే సదుపాయం ప్రతి బోధనాసుపత్రిలో ఉండాలి. ఈ మేరకు ప్రతి దశలోనూ ఎస్వోపీ (స్టాండర్ట్ ఆపరేటింగ్ ప్రొసీజర్) తయారు చేయాలి. సర్జరీ అవసరం లేని వారికి అందించాల్సిన పరికరాల గురించి కూడా ఆలోచించాలి. అవ్వాతాతలు కూడా వినికిడి సమస్యతో బాధపడుతున్నారు. వారికి కూడా పరికరాలు అందించేలా కార్యాచరణ సిద్ధం చేయాలి. కోవిడ్ కారణంగా నిలిచిపోయిన కంటి వెలుగు ఆపరేషన్లను పూర్తి చేయాలి. సాక్షి, అమరావతి: చెవిటి–మూగ వైకల్య రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం కంటి వెలుగు తరహాలో పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు చేయాలని స్పష్టం చేశారు. బాధితుల్లో ఇలాంటి లోపాలను ముందుగా గుర్తించి, వారికి వీలైనంత త్వరగా ఆపరేషన్లు చేయాలని సూచించారు. పాదయాత్రలో కనీసం 100 మంది పిల్లలు తన దగ్గరకు వచ్చారని, వారందరికీ ఆపరేషన్లు చేయించామని వెల్లడించారు. ఇలాంటి వైకల్యంతో బాధపడే వారికి అండగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. కాక్లియర్ ఇంప్లాంట్, డెఫ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టుపై మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. చెవిటి – మూగ వైకల్యం నివారించడానికి అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా దేశాల్లో అమలు చేస్తున్న విధానాలపై సమావేశంలో ముఖ్యమంత్రి చర్చించారు. చిన్నారులకు వివిధ దశల్లో నిర్వహించే వ్యాక్సినేషన్ కార్యక్రమంతో పాటే ఈ పరీక్షలను అనుసంధానం చేయాలని చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలతో వినికిడి లోపాన్ని ముందుగానే గుర్తించి తగిన విధంగా వైద్యం చేయించే అవకాశం ఉంటుందన్నారు. ఈ మేరకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. పూర్తి స్థాయిలో స్క్రీనింగ్ ► ఎంఆర్ఐ కంపాటిబిలిటీ, ఆధునిక పరిజ్ఞానం సహాయంతో కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీలను నిర్వహించే విషయమై సమావేశంలో చర్చించారు. పూర్తి స్థాయిలో స్క్రీనింగ్ నిర్వహించి, లోపాలు గుర్తించిన వారికి పూర్తి స్థాయి వైద్యం, ఆపరేషన్లు చేయించడంపై సమగ్ర కార్యాచరణ ప్రణాళిక ఉండాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. ► శిశువులకు 1వ నెల, 3వ నెల, 6వ నెలల్లో పరీక్షలు చేయించాల్సి ఉంటుందని అధికారులు వివరించారు. పీహెచ్‌సీలు, 104లలో కూడా పరీక్షలు చేసేందుకు పరికరాలు అందుబాటులో ఉంచే విషయం ఆలోచించాలని, పరీక్షలు చేశాక లోపాలు లేకపోతే, ఆ మేరకు సర్టిఫై చేయాలని సీఎం సూచించారు. ► కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీలను దేశంలో తొలిసారిగా ప్రారంభించిన ఘనత ఏపీకే దక్కుతుందని, ఏపీ సీఎం జగన్.. వినికిడి – మూగ లోపాలతో బాధ పడుతున్న చిన్నారులకు అండగా నిలుస్తున్నారనే ప్రశంసలు అందుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. ► ఈ సమీక్షలో వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు నీలం సాహ్ని, ఆరోగ్యశ్రీ సీఈవో డాక్టర్ మల్లికార్జున, సొసైటీ టు ఎయిడ్ ద హియరింగ్ ఇంపెయిర్డ్ (సాహి) సెక్రటరీ డాక్టర్ ఈసీ వినయ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ ఆరోగ్య శ్రీ ద్వారా రెండు చెవులకు కాక్లియర్ ఇంప్లాంట్
గుంటూరు మెడికల్: పుట్టుకతోనే చెవుడు సమస్యతో బాధపడుతున్న బాలుడి రెండు చెవులకు రూ.12 లక్షలు ఖర్చయ్యే కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్‌ను గుంటూరులో డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా చేశారు. దేశంలోనే మొదటిసారిగా రెండు చెవులకు కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ సౌకర్యాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కల్పించారు. దీంతో గుంటూరు ఈఎన్టీ వైద్యులు తొలిసారిగా రెండు చెవులకు ఆపరేషన్ చేసి బాలుడి వినికిడి సమస్యను తొలగించారు. గుంటూరు కొత్తపేటలోని బయ్యా ఈఎన్టీ హాస్పిటల్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్ డాక్టర్ బయ్యా శ్రీనివాసరావు ఈ వివరాలు తెలిపారు. గుంటూరుకు చెందిన పఠాన్ ఆరిఫ్‌ఖాన్, రిహానాల రెండో సంతానం హర్షద్‌ఖాన్ (3)కు పుట్టుకతోనే వినికిడి సమస్య ఉంది. తల్లిదండ్రులు డాక్టర్ బయ్యా శ్రీనివాసరావును సంప్రదించగా ఆరునెలల కిందట ఒక చెవికి కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ చేశారు. రెండునెలల కిందట హర్షద్‌ఖాన్ తల్లిదండ్రులు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి తమ బిడ్డ ఆరోగ్య పరిస్థితిని వివరించగా ఆయన రెండో చెవికి కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ చేసేందుకు ఆదేశాలు జారీచేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ మొదటిసారిగా ఆరోగ్యశ్రీ పథకంలో ఒక చెవికి కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ సౌకర్యం కల్పించారు. ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ రెండు చెవులకు ఉచితంగా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా బైలేటరల్ కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ సౌకర్యం కల్పించారు. ఈ సౌకర్యాన్ని వినియోగించి బాలుడికి ఉచితంగా ఆపరేషన్ చేసినట్లు డాక్టర్ బయ్యా శ్రీనివాసరావు చెప్పారు. ఆరునెలల కిందట ఒక చెవికి, నవంబర్ 30న రెండో చెవికి విజయవంతంగా ఆపరేషన్ చేశామన్నారు. ఆపరేషన్లోసర్జన్ డాక్టర్ బయ్యా సుధీర్ తదితరులు పాల్గొన్నారు. -
8 నెలలు..7.5 కేజీల బరువు
సాక్షి, హైదరాబాద్: పుట్టుకతోనే మూగ, వినికిడిలోపంతో బాధపడుతున్న ఎనిమిది నెలలు..7.5 కేజీల బరువు ఉన్న శిశువుకు ఒకే సమయంలో రెండు వైపులా కాక్లియర్ ఇంప్లాంట్స్‌ను విజయవంతంగా అమర్చారు. ప్రస్తుతం ఆ శిశువు వినికిడి లోపాన్ని జయించడమే కాకుండా స్వయంగా మాట్లాడుతోంది. చిన్నవయసులోనే ఒకే సమయంలో రెండు వైపులా చికిత్స చేయడం దేశంలోనే ఇదే తొలిదని ఆస్పత్రి వైద్యులు స్పష్టం చేశారు. ఈ మేరకు శనివారం కాక్లియర్ ఇంప్లాంటేషన్ సర్జన్ డాక్టర్ సత్యకిరణ్ చికిత్స వివరాలను మీడియాకు వెల్లడించారు. బెంగళూరుకు చెందిన జశ్వంత్(8 నెలలు) మెదడు సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. ఇది చెవి, గొంతు పనితీరుపై ప్రభావం చూపింది. మాట్లాడలేక పోవడమే కాకుండా వినికిడిలోపం తలెత్తింది. దీంతో శిశువు తల్లి దండ్రులు ఇటీవల బంజారాహిల్స్‌లోని రెయిన్బో ఆస్పత్రిలోని సత్యకిరణ్, మనుసృత్లను సంప్రదించగా, వారు శిశువుకు పలు పరీక్షలు నిర్వహించి, కాక్లియర్ ఇంప్లాంట్ ఒక్కటే దీనికి పరిష్కారమని సూచించారు. ఇందుకు తల్లిదండ్రులు అంగీకరించడంతో మార్చి 21న ఒకే సమయంలో రెండు వైపులా కాక్లియర్ ఇంప్లాంట్స్‌ను విజయవంతంగా అమర్చారు. ఈ నెల 17న స్పీచ్ ప్రోసెసర్‌ను అమర్చి, పనితీరును పరిశీలించారు. ప్రస్తుతం బాలుడు వినడంతో పాటు నోటిద్వారా పలు శబ్దాలను చేయగలుగుతున్నాడని తెలిపారు. -
మూగవేదన.. చెవిన పడదా?
* గుండం రామచంద్రారెడ్డి: ఆంక్షలతో కాక్లియర్ ఇంప్లాంట్స్‌కు కత్తెర * అప్పట్లో అవాంతరాలొచ్చినా వెనుకడుగు వేయని వైఎస్ * దేశంలోనే తొలిసారి ప్రభుత్వ ఖర్చుతో కాక్లియర్ ఇంప్లాంట్స్ * వందలాది మంది చిన్నారులకు శాశ్వత వైకల్యం నుంచి విముక్తి ముఖ్యమంత్రి అంటే ప్రభుత్వాన్ని నడిపించడమే కాదు.. సామాన్యుల ఆవేదననూ అర్థం చేసుకోవాలి. వారి కష్టాలు తీర్చాలి. స్పందించే హృదయం, సంకల్పం.. కార్యాచరణ ఉండాలి. ఇవన్నీ వైఎస్ రాజశేఖరరెడ్డి సొంతం. పుట్టుకతో బధిరులైన చిన్నారుల కోసం ఆయన కాక్లియర్ ఇంప్లాంట్స్ చికిత్స ప్రవేశపెట్టారు. వందలాది మంది మూగ, చెవిటి చిన్నారులకు మాటలు నేర్పారు. పాటలు వినిపించారు. అవిటి బిడ్డలను కన్నామా అనుకుంటూ రోదించే తల్లిదండ్రుల పెదవులపై చిరునవ్వులు నింపారు. కానీ ఇప్పుడు ఇలాంటి చిన్నారులు బధిరులుగానే మిగులుతున్నారు. ప్రభుత్వం కఠిన నిబంధనలు విధించడంతో చికిత్సకు దూరమవుతున్నారు. చిన్నారుల జీవితాల్లో వెలుగులు ఆరోగ్యశ్రీ పథకంలో ఉన్న 938 చికిత్సల్లో కాక్లియర్ ఇంప్లాంట్స్ ఒకటి. ఈ చికిత్స చేయాలంటే రూ.6.5 లక్షలు అవుతుంది. ఖరీదైన వైద్యం... దీని పరిధిలోకి చాలామంది వస్తారు, ఇది ప్రభుత్వానికి వర్కవుట్ కాదన్నారు అధికారులు. కానీ వైఎస్ ఎవరి మాటా వినలేదు. ప్రభుత్వమంటే ప్రజల కోసమే కదా..ఆ బిడ్డలు మాట్లాడాలి, ఖర్చు ఎంతయినా ఫర్వాలేదు. ఖర్చు గురించి మీరు మర్చిపోండంటూ భరోసా ఇచ్చారు. ఇంకేముంది 2007 నుంచి కాక్లియర్ ఇంప్లాంట్స్ చికిత్స ఆరోగ్యశ్రీలో మొదలైంది. ఆరేళ్లలోపు పిల్లలకు పుట్టుకతో మూగ చెవుడు ఉంటే ఆరోగ్యశ్రీ పథకం కింద ఈ చికిత్స చేయించుకోవడానికి అనుమతి ఇచ్చారు. కాక్లియర్ ఇంప్లాంట్స్ వేయడమే కాకుండా ఏడాది పాటు వారికి ఉచిత చికిత్స కూడా ఇప్పించారు. ఆరేళ్లలోపు నిబంధన వల్ల కొంతమంది పథకం కిందకు రాలేక పోతున్నారని, అవసరమైతే పన్నెండేళ్లలోపు వారికీ చికిత్స అందించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటివరకూ సుమారు 1,200 మందికి పైగా చిన్నారులకు కాక్లియర్ ఇంప్లాంట్స్ అమర్చారు. ఇందుకోసం సుమారు రూ.80 కోట్లు ఖర్చు చేశారు. ప్రజారోగ్యంపై చిన్నచూపు - సామాన్యులకు, పేదలకు మేలు చేసే ఆరోగ్య బీమా పథకాలు బాబు హయాంలో టార్చిలైట్ వేసి చూసినా కనిపించవు. - సాదాసీదా రోగాలొస్తేనే వైద్యానికి దిక్కు ఉండేది కాదు. ఆరోగ్యశ్రీ, 104, 108, కాక్లియర్ ఇంప్లాంట్స్ వంటి పథకాల గురించి ఆలోచించిన పాపాన పోలేదు. - {పభుత్వాసుపత్రులకు వెళితే వసతులుండేవి కాదు. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి వేలకు వేలు ఖర్చు పెట్టుకుని పేద, మధ్యతరగతి రోగులు నరకం అనుభవించారు. నిబంధనలతో నీరుగార్చారు! - కాక్లియర్ ఇంప్లాంట్స్ అర్హత వయసును ఆరేళ్ల నుంచి రెండేళ్లకు తగ్గించారు. - ఆరేళ్ల వయసులో చికిత్స చేస్తే మంచి ఫలితాలు ఉండవనే సాకుతో ఈ నిబంధన విధించారు. - చెవుడు, మూగ ఉందో లేదో తెలుసుకునేందుకే రెండేళ్ల వయసు అయిపోతుంది. ఈ నిబంధనతో చికిత్సకు దూరమయ్యారు. - తెల్ల రేషన్ కార్డులో వివరాలు సరిగా లేవని, అబ్బాయిని చూస్తే రెండేళ్ల వయసు దాటి కనిపిస్తున్నాడని... ఇలా వివిధ రకాల ఆంక్షలతో చాలామందికి అనుమతి ఇవ్వలేదు. - చిన్నారికి చికిత్స కంటే ముందే తల్లికి కౌన్సెలింగ్ ఇవ్వాలని, కానీ కౌన్సెలింగ్‌కు సరిగా రాలేదని సాకులు చెప్పారు. - బర్త్ సర్టిఫికెట్ సరిగా లేదని, ఒక వేళ ఉన్నా టీకాలు వేసిన కాగితం కావాలని డిమాండ్ చేస్తున్నారు. - డెలివరీ సమయంలో నర్సు ఇచ్చిన అడ్మిషన్ వివరాలను జతపర్చాలని, లేదంటే అనుమతులు మంజూరు చేయలేమని మొండికేశారు. - ఈ కారణాల వల్ల వందలాది మంది బధిర చిన్నారులు చికిత్సకు అర్హత కోల్పోయారు. - గతంలో ఏటా 200 చికిత్సలు చేశారు. ప్రస్తుతం 50 కూడా జరగడం లేదు. అవకాశమివ్వండి సారూ... నాకు ఇద్దరు కూతుళ్లు. ఇద్దరూ పుట్టుకతోనే మూగ చెవిటివారు. చిన్నకూతురు షీబాకు కాక్లియర్ ఇంప్లాంట్స్ వేశారు. ఇప్పుడిప్పుడే కొద్దికొద్దిగా మాటలు వస్తున్నాయి. కానీ ఐదేళ్ల మాలతికి పథకం వర్తించదని అంటున్నారు. నా పెద్దకూతురుకు కూడా కాక్లియర్ వేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా. లేదంటే ఈ పిల్ల శాశ్వతంగా మూగది అవుతుంది. - కాంతారత్నం, తూర్పుపాలెం, ఈస్ట్‌గోదావరి జిల్లా వైఎస్ చలవతోనే... నా బిడ్డపేరు సాయిదుర్గ. ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా కాక్లియర్ ఇంప్లాంట్స్ వేశారు. ఇప్పుడిప్పుడే మాటలు వస్తున్నాయి. ఆరున్నర లక్షలు ఖర్చయ్యే వీటిని ఉచితంగా వేశారంటే మహానుభావుడు వైఎస్ చలవే. ఇప్పుడేమో రెండేళ్లలోపే కాక్లియర్ అనే సరికి చాలామందికి పథకం వర్తించడం లేదు. -సైదాబి, వంకాయలపాడు, ప్రకాశం జిల్లా ఒక్కరికే వేశారు నాకు ముగ్గురు బిడ్డలు. అందరూ పుట్టుకతో మూగ చెవిటివారే. భర్త కూడా మూగవారే. పెద్దబ్బాయికి ఎలాగూ ఈ పథకం వర్తించలేదు. రెండో అమ్మాయికి ఆరేళ్లు. కానీ వర్తించదని చెబుతున్నారు. చిన్నబ్బాయి నందకిషోర్‌కు ఒక్కరికే కాక్లియర్ వేశారు. వ్యవసాయం చేసుకునే వాళ్లం. లక్షలు ఖర్చు చేయాలంటే మావల్ల కాదు. ఒక్కరికైనా ఈ పథకం వర్తించిందంటే .. అది వైఎస్ రాజశేఖరరెడ్డి చలవే. -వెంకటలక్ష్మమ్మ, తలుపుల (అనంతపురం జిల్లా)