అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలం మల్లవరంకు చెందిన అడిగర్ల కొండబాబు, సత్యవేణి దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఆరేళ్ల క్రితం కుమారుడు పుట్టాడు. చిన్నారి శబ్దాలను గ్రహించలేకపోవడంతోపాటు ఎవరైనా పలకరించినా వారివైపు చూసేవాడు కాదు. దీంతో తల్లిదండ్రులు వైద్యులను సంప్రదించగా పుట్టుకతోనే వినికిడి లోపం ఉన్నట్టు నిర్ధారించారు. కాక్లియర్ ఇంప్లాంటేషన్ సర్జరీ చేయాలని.. ఇందుకు రూ.8 లక్షల వరకు ఖర్చవుతుందని చెప్పడంతో ఆ నిరుపేద దంపతులు హతాశులయ్యారు.
ఈ తరుణంలో వారిని వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ఆదుకుంది. ఈ పథకం కింద విశాఖలోని విమ్స్‌లో ఉచితంగా గతేడాది ఆగస్టులో బాబుకు సర్జరీ చేశారు. ప్రస్తుతం పిల్లాడికి వినిపిస్తోంది.. తల్లిదండ్రులు పిలిస్తే పలుకుతున్నాడు.. నెమ్మదిగా మాట్లాడుతున్నాడు. దీంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవు. ‘బాబుకు సర్జరీ చేయించేంత ఆర్థిక స్తోమత మాకు లేదు. అలాంటి మమ్మల్ని సీఎం వైఎస్ జగన్ ఆదుకున్నారు. బిడ్డకు మేం జన్మనిస్తే.. వాడికి మాటలు వచ్చేలా చేసి ఆరోగ్యశ్రీ పునర్జన్మను ప్రసాదించింది’ అని కొండబాబు సంతోషం వ్యక్తం చేస్తున్నాడు.
– సాక్షి, అమరావతి
..ఇది ఒక్క కొండబాబు ఆనందం మాత్రమే కాదు. రాష్ట్రంలో ఎంతో మంది వినికిడి శక్తి లేని చిన్నారులకు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ఆపద్బాంధవిలా నిలుస్తోంది. పేద, మధ్యతరగతి కుటుంబాల్లోని చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. ఈ పథకం కింద పుట్టుకతోనే వినికిడి లోపం ఉన్న పిల్లలకు అత్యంత ఖరీదైన కాక్లియర్ ఇంప్లాంటేషన్ సర్జరీలను వైఎస్ జగన్ ప్రభుత్వం పూర్తి ఉచితంగా నిర్వహిస్తోంది.
ఇప్పటివరకు 566 మందికి ..
2019లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీ పథకాన్ని బలోపేతం చేసింది. ఇందులో భాగంగా రెండు చెవులకు (బైలాటెరల్) కాక్లియర్ ఇంప్లాంటేషన్ సర్జరీని పథకంలోకి చేర్చింది. దీంతో దాదాపు రూ.12 లక్షలు ఖర్చయ్యే సర్జరీకి కూడా ఆరోగ్యశ్రీ వర్తించింది. 2019 నుంచి ఇప్పటివరకు 566 మంది వినికిడి లోపం ఉన్న పిల్లలకు ప్రభుత్వం కాక్లియర్ ఇంప్లాంటేషన్ సర్జరీలు నిర్వహించింది. ఇందుకు రూ.33.48 కోట్లు ఖర్చు చేసింది. అంతేకాకుండా ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాక వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద చిన్నారులకు విశ్రాంత సమయానికి భృతిని సైతం అందజేస్తున్నారు.
మా జీవితాల్లో సీఎం జగన్ సంతోషాన్ని నింపారు..
నేను ప్రైవేట్ బ్యాంక్‌లో ఉద్యోగిని. మా నాలుగేళ్ల బాబుకు పుట్టుకతోనే వినికిడి లోపం ఉంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో రూ.12 లక్షల వరకు ఖర్చవుతుందన్నారు. అంత ఆర్ధిక స్తోమత మాకు లేదు. గతేడాది ఆరోగ్యశ్రీ కింద పూర్తి ఉచితంగా రెండు చెవులకు బైలాటెరల్ కాక్లియర్ ఇంప్లాంటేషన్ జరిగింది. ప్రస్తుతం చిన్న చిన్నగా మాట్లాడగలుగుతున్నాడు.. స్కూల్‌కు కూడా వెళుతున్నాడు. మా జీవితాల్లో సంతోషాన్ని నింపిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మేలును ఎప్పటికీ మరిచిపోలేం.
– సీహెచ్ శ్రీధర్, నర్సిపురం, శ్రీకాకుళం జిల్లా
ప్రభుత్వం చేసిన మేలును ఈ జన్మకు మరువను..
మా బాబు జాన్విత్‌కు పుట్టుకతోనే వినికిడి లోపం ఉంది. దీంతో పెద్దయ్యేకొద్దీ బాబుకు మాటలు కూడా రావని వైద్యులు చెప్పారు. కాక్లియర్ ఇంప్లాంటేషన్ చేయిస్తే వినికిడి శక్తి వస్తుందన్నారు. మాది పేద కుటుంబం కావడంతో సర్జరీ చేయించే స్తోమత మాకు లేదు. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.12 లక్షల విలువైన ఆపరేషన్‌ను ఉచితంగా ప్రభుత్వం చేయించింది. ఏడాది పాటు ఉచితంగా సౌండ్ థెరపీ ఇచ్చి బాబుకు మాటలొచ్చేలా చేశారు. వాడు పుట్టిన కొన్నేళ్లకు అమ్మా అనే పిలుపునకు నోచుకున్నాను. ప్రభుత్వం చేసిన మేలును ఈ జన్మకు మరువను.
– లక్ష్మి, దొర్నిపాడు, నంద్యాల జిల్లా
Comments
Please login to add a commentAdd a comment