సాక్షి, అమరావతి : కాక్లియర్ ఇంప్లాంట్స్‌ను ఇకపై ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో వేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటి దాకా రెండు లేదా మూడు ప్రైవేటు ఆస్పత్రుల్లోనే వీటిని వేసేవారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఈ సర్జరీలు చేసేకంటే ప్రభుత్వాస్పత్రుల్లోనే చేస్తే.. ఆరోగ్యశ్రీ కింద వచ్చే సొమ్ము కూడా ప్రభుత్వాస్పత్రులకే వస్తుందన్నది ప్రధానోద్దేశం. అలాగే ఎక్కువ ఆస్పత్రుల్లో ఈ సర్జరీ చేసే అవకాశం ఉంటుంది.. ఫలితంగా చిన్నారులకు జాప్యం లేకుండా సర్జరీలు పూర్తవుతాయి. పుట్టుకతో చెవుడు, మూగతో ఉన్నవారికి కాక్లియర్ ఇంప్లాంట్స్ వేస్తారు.
దివంగత సీఎం వైఎస్సార్ ఈ చికిత్సను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చారు. దీంతో వందలాది మంది చిన్నారులకు మాటలు, వినికిడి వచ్చాయి. రాష్ట్రంలో 11 బోధనాస్పత్రులున్నాయి. సుమారు 100 మంది వరకూ ఈఎన్‌టీ సర్జన్‌లున్నారు. సీనియర్లు, నైపుణ్యం ఉన్న వాళ్లు చాలా మంది ఉన్నారు. బోధనాస్పత్రుల్లోనే కాక్లియర్ ఇంప్లాంట్స్ వేయడంపై గతంలోనే ప్రతిపాదనలు సిద్ధం కాగా, కోవిడ్ రాకతో ఆ ప్రక్రియ ఆగింది. మళ్లీ తాజాగా దీనిపై కసరత్తు మొదలైంది. కాక్లియర్ ఇంప్లాంట్స్ వేసేందుకు ఎలాంటి వైద్య ఉపకరణాలు కావాలి? ప్రస్తుతం ఉన్న వసతులేంటి? ఉన్న వైద్యులకు శిక్షణ ఎక్కడ ఇవ్వాలి? అన్న దానిపై కూడా చర్చిస్తున్నారు. గతంలో ఒక చిన్నారికి ఒక చెవికి మాత్రమే ఇంప్లాంట్స్ వేసేవారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక రెండు చెవులకూ వేయాలని ఆదేశాలిచ్చింది.
ప్రభుత్వాస్పత్రుల్లో మౌలిక వసతులు
కాక్లియర్ ఇంప్లాంట్ బోధనాస్పత్రుల్లో వేసేందుకు ప్రయత్నిస్తున్నాం. ఈఎన్‌టీ సర్జన్లకు శిక్షణ ఇస్తే సరిపోతుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే మౌలిక వసతులున్నప్పుడు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లడం ఎందుకనేది ప్రధానోద్దేశం. – డా.బి.సాంబశివారెడ్డి, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ వైస్ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment