ENT Specialist
-
మింగుడుపడని సమస్యా..? కారణాలు, పరిష్కారాలు ఇవిగో..!
మింగే సమయంలో నొప్పి రావడం, మింగడం ఇబ్బందిగా మారడం అనే సమస్యను ఈ ప్రపంచంలోని ఎదుర్కోని వారంటూ ఉండరు. కనీసం జలుబు వల్లనైనా గొంతునొప్పి వంటి సమస్య వచ్చి... ఏదో ఒక సమయంలో మింగడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇలాంటి ఒకటీ అరా సందర్భాల్లో, సంఘటనల్లో తప్ప... మింగలేకపోవడం అనేది ఎప్పుడూ ఓ సమస్యగా దాదాపుగా ఎవరికీ ఉండబోదు. కానీ చాలామందిలో అనేక కారణాలతో మింగడం ఓ కష్టసాధ్యమైన పని అవుతుంది. అలాంటి ఇబ్బందులు ఎవరెవరిలో, ఏయే కారణాలతో వస్తాయి, పరిష్కారాలేమిటి వంటి అంశాలను తెలుసుకుందాం. మింగడానికి వచ్చే అవరోధాలకు కారణాలు అనేకం. ఉదాహరణకు కొన్ని సమస్యలను చూద్దాం. వైరల్ సమస్యల వల్ల : ∙వైరల్ సమస్య కారణంగా వచ్చే జలుబు లేదా ఫ్లూ ∙ఇన్ఫెక్షియస్ మోనోన్యూక్లియోసిస్ (దీన్నే గ్లాండులార్ ఫీవర్ అంటారు. ఈ సమస్య కొందరిలో దాదాపు పదిరోజుల పాటు బాధిస్తుంటుంది) ∙మీజిల్స్ ∙చికెన్‌పాక్స్. ఉపశమనం కోసం ఏం చేయాలి? ∙మసాలాలు చాలా ఎక్కువగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి. సమస్య తగ్గేవరకు చప్పిడి భోజనం (బ్లాండ్డైట్) తీసుకోవాలి. ∙బాగా విశ్రాంతి తీసుకోవాలి, కంటినిండా నిద్రపోవడం అన్నది త్వరగా తగ్గడానికి చాలా బాగా తోడ్పడుతుంది. ∙గొంతుకు పూర్తి విశ్రాంతినివ్వాలి. గొంతుతో పనిచేసేవారు అంటే ఉదాహరణకు టీచర్లు, లెక్చరర్లు, గాయకులు, ఉపన్యాసకులు వంటి వారు సమస్య తగ్గేవరకు గొంతును వీలైనంతగా ఉపయోగించకపోవడమే మంచిది. ∙తగినన్ని నీళ్లు/ద్రవాహారం తీసుకుంటూ ఉండాలి. ∙వీలైనంతవరకు గోరువెచ్చటి లేదా వేడి చేసి, చల్లార్చిన ద్రవాలు తాగాలి. ∙రోజుకు కనీసం మూడు సార్లు ఉప్పు వేసిన గోరువెచ్చని నీటితో పుక్కిలించాలి. ∙పొగతాగడం, ఆల్కహాల్ వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. పై సూచనలు పాటించినప్పటికీ సమస్య తగ్గకపోతే ఓసారి ఈఎన్టీ డాక్టర్‌ను సంప్రదించడం మంచిది. అదెప్పుడంటే... ∙గొంతునొప్పి (సోర్ థ్రోట్)తో బాధపడుతూ వారం రోజులకు పైగా గడిచాక కూడా సమస్య తగ్గకపోతే ∙బొంగురుగొంతు సమస్య రెండు వారాలు గడిచాక కూడా తగ్గకపోతే ∙101 డిగ్రీల ఫారెన్‌హీట్‌కు తగ్గకుండా అదేపనిగా జ్వరం వస్తుంటే... జ్వరం తగ్గకుండా ఉంటే. ∙మింగడంతో పాటు శ్వాస తీసుకోవడమూ కష్టమవుతుంటే. ∙నోరు తెరవడానికే ఇబ్బందిగా ఉంటే, గొంతు పెగలడమూ కష్టమవుతుంటే ∙గొంతునొప్పితో పాటు కీళ్లనొప్పులు, చెవినొప్పి కూడా ఉంటే ∙వికారం, వాంతులు ఉంటే, తీవ్రమైన అలసట, నీరసం, నిస్సత్తువ ఉంటే ∙గొంతసమస్యతో పాటు చర్మంపై ర్యాష్ వస్తుంటే ∙మెడ దగ్గర లింఫ్‌గ్రంథులు వాచి, చేతికి/స్పర్శకు తెలుస్తుంటే ∙టాన్సిల్స్‌ను పరిశీలనగా చూసినప్పుడు వాటిపై తెల్లటి మచ్చలు (వైట్ ప్యాచెస్) కనిపిస్తే డాక్టర్‌ను సంప్రదించాలి. గొంతునొప్పిగా ఉండి మింగలేకపోవడం అన్నది తాత్కాలిక సమస్యే. కానీ పైన పేర్కొన్న కండిషన్లు చాలాకాలం కొనసాగుతుంటే మాత్రం ఈఎన్టీ వైద్యుని తప్పక సంప్రదించాల్సిందే. బ్యాక్టీరియల్‌తో పాటు ఇతర సమస్యల వల్ల ∙బ్యాక్టీరియా కారణంగా గొంతుభాగంలో ఇన్ఫెక్షన్లు ∙కోరింత దగ్గు ∙అలర్జీలు ∙వాతావరణం పూర్తిగా పొడిబారి ఉన్నప్పుడు కొందరిలో మింగడం సమస్య అవుతుంది ∙చాలాకాలంగా పొగతాగడం లేదా పొగాకు నమిలేవారిలో ∙కాలుష్యం ∙గొంతులోని కండరాలపై భారం పడటం ∙గొంతు/నోటిలో గడ్డలు ∙టాన్సిల్స్‌లో ఆహారాలు ఇరుక్కుపోయినప్పుడు ∙గొంతుపైన ఏదైనా దెబ్బతగిలినప్పుడు (ఎక్స్టర్నల్ నెక్ ట్రామా) ∙విటమిన్ లోపాలు ∙సర్వైకల్ స్పాండిలోసిస్ ∙హెర్పిస్ ఇవేగాక... గొంతులోని ఫ్యారింగ్స్ అనే భాగంలో వచ్చే ఇన్ఫెక్షన్ ‘ఫ్యారంజైటిస్’ సైతం దాదాపు మూడు నుంచి ఏడు రోజుల వరకు తీవ్రంగానే బాధించి, మింగడానికి అడ్డంకిగా మారుతుంది. -డాక్టర్ ఇ.సి. వినయ కుమార్, సీనియర్ ఈఎన్టి సర్జన్ -
ఇకపై బోధనాస్పత్రుల్లో కాక్లియర్ ఇంప్లాంట్స్
సాక్షి, అమరావతి : కాక్లియర్ ఇంప్లాంట్స్‌ను ఇకపై ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో వేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటి దాకా రెండు లేదా మూడు ప్రైవేటు ఆస్పత్రుల్లోనే వీటిని వేసేవారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఈ సర్జరీలు చేసేకంటే ప్రభుత్వాస్పత్రుల్లోనే చేస్తే.. ఆరోగ్యశ్రీ కింద వచ్చే సొమ్ము కూడా ప్రభుత్వాస్పత్రులకే వస్తుందన్నది ప్రధానోద్దేశం. అలాగే ఎక్కువ ఆస్పత్రుల్లో ఈ సర్జరీ చేసే అవకాశం ఉంటుంది.. ఫలితంగా చిన్నారులకు జాప్యం లేకుండా సర్జరీలు పూర్తవుతాయి. పుట్టుకతో చెవుడు, మూగతో ఉన్నవారికి కాక్లియర్ ఇంప్లాంట్స్ వేస్తారు. దివంగత సీఎం వైఎస్సార్ ఈ చికిత్సను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చారు. దీంతో వందలాది మంది చిన్నారులకు మాటలు, వినికిడి వచ్చాయి. రాష్ట్రంలో 11 బోధనాస్పత్రులున్నాయి. సుమారు 100 మంది వరకూ ఈఎన్టీ సర్జన్‌లున్నారు. సీనియర్లు, నైపుణ్యం ఉన్న వాళ్లు చాలా మంది ఉన్నారు. బోధనాస్పత్రుల్లోనే కాక్లియర్ ఇంప్లాంట్స్ వేయడంపై గతంలోనే ప్రతిపాదనలు సిద్ధం కాగా, కోవిడ్ రాకతో ఆ ప్రక్రియ ఆగింది. మళ్లీ తాజాగా దీనిపై కసరత్తు మొదలైంది. కాక్లియర్ ఇంప్లాంట్స్ వేసేందుకు ఎలాంటి వైద్య ఉపకరణాలు కావాలి? ప్రస్తుతం ఉన్న వసతులేంటి? ఉన్న వైద్యులకు శిక్షణ ఎక్కడ ఇవ్వాలి? అన్న దానిపై కూడా చర్చిస్తున్నారు. గతంలో ఒక చిన్నారికి ఒక చెవికి మాత్రమే ఇంప్లాంట్స్ వేసేవారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక రెండు చెవులకూ వేయాలని ఆదేశాలిచ్చింది. ప్రభుత్వాస్పత్రుల్లో మౌలిక వసతులు కాక్లియర్ ఇంప్లాంట్ బోధనాస్పత్రుల్లో వేసేందుకు ప్రయత్నిస్తున్నాం. ఈఎన్టీ సర్జన్లకు శిక్షణ ఇస్తే సరిపోతుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే మౌలిక వసతులున్నప్పుడు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లడం ఎందుకనేది ప్రధానోద్దేశం. – డా.బి.సాంబశివారెడ్డి, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ వైస్ చైర్మన్ -
లింగ నిర్ధారణ, అబార్షన్ : ఈఎన్టీ స్పెషలిస్ట్, నర్స్ అరెస్ట్
కృష్ణా జిల్లా : లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాక అబార్షన్ చేసిన ఓ ఈఎన్టీ స్పెషలిస్ట్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మంగళవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. కృష్ణా జిల్లాలోని గూడూరు మండలం మల్లవోలు గ్రామానికి చెందిన దుర్గాదేవికి తొలి కాన్పులో ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. దీంతో ఈ సారి పుట్టబోయేది మగబిడ్డా, కాదా.. అని నిర్ధారించుకోవడానికి పట్టణంలోని ఒక ఆస్పత్రికి వచ్చారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన స్కానింగ్ సెంటర్ యజమాని పుట్టబోయేది ఆడబిడ్డ అని చెప్పడంతో.. ఆ పసి కందును కడుపులోనే చంపేయాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం పట్టణంలోని ఈఎన్టీ స్పెషలిస్ట్ ఆర్.వి. లక్ష్మణస్వామి వద్దకు వచ్చారు. అతను రజిని నర్సింగ్ హోంకు వెళ్లి నా పేరు చెప్పండి తక్కువ డబ్బుతో పనైపోతుందని చెప్పాడు. దీంతో వారు రజిని నర్సింగ్ హోంకు వెళ్లారు. కాగా అబార్షన్లు నిర్వహిస్తున్నారనే నెపంతోనే రెండు రోజుల కిందట రజిని ఆస్పత్రిని పోలీసులు మూసివేశారు. దీంతో లక్ష్మణ స్వామి తన ఆస్పత్రిలోనే నర్సు సాయంతో దుర్గాదేవికి అబార్షన్ నిర్వహించారు. అయితే ఆమె ఆరోగ్యం దెబ్బతింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆపరేషన్ నిర్వహించడానికి సాయపడిన ఈఎన్టీ స్పెషలిస్ట్ లక్ష్మణస్వామిని, అర్హత లేకుండా అక్రమంగా ఆపరేషన్ చేసిన నర్సును అదుపులోకి తీసుకున్నారు. కాగా స్కానింగ్ సెంటర్ నిర్వహిస్తూ లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న డాక్టర్ ప్రసాద్ పరారీలో ఉన్నారు.