కృష్ణా జిల్లా : లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాక అబార్షన్ చేసిన ఓ ఈఎన్‌టీ స్పెషలిస్ట్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మంగళవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. కృష్ణా జిల్లాలోని గూడూరు మండలం మల్లవోలు గ్రామానికి చెందిన దుర్గాదేవికి తొలి కాన్పులో ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. దీంతో ఈ సారి పుట్టబోయేది మగబిడ్డా, కాదా.. అని నిర్ధారించుకోవడానికి పట్టణంలోని ఒక ఆస్పత్రికి వచ్చారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన స్కానింగ్ సెంటర్ యజమాని పుట్టబోయేది ఆడబిడ్డ అని చెప్పడంతో.. ఆ పసి కందును కడుపులోనే చంపేయాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం పట్టణంలోని ఈఎన్‌టీ స్పెషలిస్ట్ ఆర్.వి. లక్ష్మణస్వామి వద్దకు వచ్చారు. అతను రజిని నర్సింగ్ హోంకు వెళ్లి నా పేరు చెప్పండి తక్కువ డబ్బుతో పనైపోతుందని చెప్పాడు.
దీంతో వారు రజిని నర్సింగ్ హోంకు వెళ్లారు. కాగా అబార్షన్‌లు నిర్వహిస్తున్నారనే నెపంతోనే రెండు రోజుల కిందట రజిని ఆస్పత్రిని పోలీసులు మూసివేశారు. దీంతో లక్ష్మణ స్వామి తన ఆస్పత్రిలోనే నర్సు సాయంతో దుర్గాదేవికి అబార్షన్ నిర్వహించారు. అయితే ఆమె ఆరోగ్యం దెబ్బతింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆపరేషన్ నిర్వహించడానికి సాయపడిన ఈఎన్‌టీ స్పెషలిస్ట్ లక్ష్మణస్వామిని, అర్హత లేకుండా అక్రమంగా ఆపరేషన్ చేసిన నర్సును అదుపులోకి తీసుకున్నారు. కాగా స్కానింగ్ సెంటర్ నిర్వహిస్తూ లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న డాక్టర్ ప్రసాద్ పరారీలో ఉన్నారు.
లింగ నిర్ధారణ, అబార్షన్ : ఈఎన్‌టీ స్పెషలిస్ట్, నర్స్ అరెస్ట్
Published Tue, Jul 28 2015 5:29 PM | Last Updated on Tue, Oct 2 2018 4:09 PM
Advertisement
Advertisement