మూగవేదన.. చెవిన పడదా? | Deaf and Dumb problems is so far | Sakshi
Sakshi News home page

మూగవేదన.. చెవిన పడదా?

Published Wed, Apr 9 2014 2:40 AM | Last Updated on Tue, Aug 14 2018 4:46 PM

Deaf and Dumb problems is so far

* గుండం రామచంద్రారెడ్డి: ఆంక్షలతో కాక్లియర్ ఇంప్లాంట్స్‌కు కత్తెర
* అప్పట్లో అవాంతరాలొచ్చినా వెనుకడుగు వేయని వైఎస్
* దేశంలోనే తొలిసారి ప్రభుత్వ ఖర్చుతో కాక్లియర్ ఇంప్లాంట్స్
* వందలాది మంది చిన్నారులకు శాశ్వత వైకల్యం నుంచి విముక్తి

 
ముఖ్యమంత్రి అంటే ప్రభుత్వాన్ని నడిపించడమే కాదు.. సామాన్యుల ఆవేదననూ అర్థం చేసుకోవాలి. వారి కష్టాలు తీర్చాలి. స్పందించే హృదయం, సంకల్పం.. కార్యాచరణ ఉండాలి. ఇవన్నీ వైఎస్ రాజశేఖరరెడ్డి సొంతం. పుట్టుకతో బధిరులైన చిన్నారుల కోసం ఆయన కాక్లియర్ ఇంప్లాంట్స్ చికిత్స ప్రవేశపెట్టారు. వందలాది మంది మూగ, చెవిటి చిన్నారులకు మాటలు నేర్పారు. పాటలు వినిపించారు. అవిటి బిడ్డలను కన్నామా అనుకుంటూ రోదించే తల్లిదండ్రుల పెదవులపై చిరునవ్వులు నింపారు. కానీ ఇప్పుడు ఇలాంటి చిన్నారులు బధిరులుగానే మిగులుతున్నారు. ప్రభుత్వం కఠిన నిబంధనలు విధించడంతో చికిత్సకు దూరమవుతున్నారు.
 
 చిన్నారుల జీవితాల్లో వెలుగులు
ఆరోగ్యశ్రీ పథకంలో ఉన్న 938 చికిత్సల్లో కాక్లియర్ ఇంప్లాంట్స్ ఒకటి. ఈ చికిత్స చేయాలంటే రూ.6.5 లక్షలు అవుతుంది. ఖరీదైన వైద్యం... దీని పరిధిలోకి చాలామంది వస్తారు, ఇది ప్రభుత్వానికి వర్కవుట్ కాదన్నారు అధికారులు. కానీ వైఎస్ ఎవరి మాటా వినలేదు. ప్రభుత్వమంటే ప్రజల కోసమే కదా..ఆ బిడ్డలు మాట్లాడాలి, ఖర్చు ఎంతయినా ఫర్వాలేదు. ఖర్చు గురించి మీరు మర్చిపోండంటూ భరోసా ఇచ్చారు. ఇంకేముంది 2007 నుంచి కాక్లియర్ ఇంప్లాంట్స్ చికిత్స ఆరోగ్యశ్రీలో మొదలైంది.
  ఆరేళ్లలోపు పిల్లలకు పుట్టుకతో మూగ చెవుడు ఉంటే ఆరోగ్యశ్రీ పథకం కింద ఈ చికిత్స చేయించుకోవడానికి అనుమతి ఇచ్చారు.
  కాక్లియర్ ఇంప్లాంట్స్ వేయడమే కాకుండా ఏడాది పాటు వారికి ఉచిత చికిత్స కూడా ఇప్పించారు.
  ఆరేళ్లలోపు నిబంధన వల్ల కొంతమంది పథకం కిందకు రాలేక పోతున్నారని, అవసరమైతే పన్నెండేళ్లలోపు వారికీ చికిత్స అందించాలని ఆదేశాలు జారీ చేశారు.
  ఇప్పటివరకూ సుమారు 1,200 మందికి పైగా చిన్నారులకు కాక్లియర్ ఇంప్లాంట్స్ అమర్చారు.
  ఇందుకోసం సుమారు రూ.80 కోట్లు ఖర్చు చేశారు.
 
 ప్రజారోగ్యంపై చిన్నచూపు
-     సామాన్యులకు, పేదలకు మేలు చేసే ఆరోగ్య బీమా పథకాలు బాబు హయాంలో టార్చిలైట్ వేసి చూసినా కనిపించవు.
-     సాదాసీదా రోగాలొస్తేనే వైద్యానికి దిక్కు ఉండేది కాదు. ఆరోగ్యశ్రీ, 104, 108, కాక్లియర్ ఇంప్లాంట్స్ వంటి పథకాల గురించి ఆలోచించిన పాపాన పోలేదు.
-     {పభుత్వాసుపత్రులకు వెళితే వసతులుండేవి కాదు. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి వేలకు వేలు ఖర్చు పెట్టుకుని పేద, మధ్యతరగతి రోగులు  నరకం అనుభవించారు.
 
 నిబంధనలతో నీరుగార్చారు!
-  కాక్లియర్ ఇంప్లాంట్స్ అర్హత వయసును ఆరేళ్ల నుంచి రెండేళ్లకు తగ్గించారు.
-  ఆరేళ్ల వయసులో చికిత్స చేస్తే మంచి ఫలితాలు ఉండవనే సాకుతో ఈ నిబంధన విధించారు.
-  చెవుడు, మూగ ఉందో లేదో తెలుసుకునేందుకే రెండేళ్ల వయసు అయిపోతుంది. ఈ నిబంధనతో చికిత్సకు దూరమయ్యారు.
-  తెల్ల రేషన్ కార్డులో వివరాలు సరిగా లేవని, అబ్బాయిని చూస్తే రెండేళ్ల వయసు దాటి కనిపిస్తున్నాడని... ఇలా వివిధ రకాల ఆంక్షలతో చాలామందికి అనుమతి ఇవ్వలేదు.
-  చిన్నారికి చికిత్స కంటే ముందే తల్లికి కౌన్సెలింగ్ ఇవ్వాలని, కానీ కౌన్సెలింగ్‌కు సరిగా రాలేదని సాకులు చెప్పారు.
-  బర్త్ సర్టిఫికెట్ సరిగా లేదని, ఒక వేళ ఉన్నా టీకాలు వేసిన కాగితం కావాలని డిమాండ్ చేస్తున్నారు.
-  డెలివరీ సమయంలో నర్సు ఇచ్చిన అడ్మిషన్ వివరాలను జతపర్చాలని, లేదంటే  అనుమతులు మంజూరు చేయలేమని మొండికేశారు.
-  ఈ కారణాల వల్ల వందలాది మంది బధిర చిన్నారులు చికిత్సకు అర్హత కోల్పోయారు.
-  గతంలో ఏటా 200 చికిత్సలు చేశారు. ప్రస్తుతం 50 కూడా జరగడం లేదు.
 
 అవకాశమివ్వండి సారూ...
 నాకు ఇద్దరు కూతుళ్లు. ఇద్దరూ పుట్టుకతోనే మూగ చెవిటివారు. చిన్నకూతురు షీబాకు కాక్లియర్ ఇంప్లాంట్స్ వేశారు. ఇప్పుడిప్పుడే కొద్దికొద్దిగా మాటలు వస్తున్నాయి. కానీ ఐదేళ్ల మాలతికి పథకం వర్తించదని అంటున్నారు. నా పెద్దకూతురుకు కూడా కాక్లియర్ వేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా. లేదంటే ఈ పిల్ల శాశ్వతంగా మూగది అవుతుంది.
 - కాంతారత్నం, తూర్పుపాలెం,
 ఈస్ట్‌గోదావరి జిల్లా

 
 వైఎస్ చలవతోనే...
 నా బిడ్డపేరు సాయిదుర్గ. ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా కాక్లియర్ ఇంప్లాంట్స్ వేశారు. ఇప్పుడిప్పుడే మాటలు వస్తున్నాయి. ఆరున్నర లక్షలు ఖర్చయ్యే వీటిని ఉచితంగా వేశారంటే మహానుభావుడు వైఎస్  చలవే. ఇప్పుడేమో రెండేళ్లలోపే కాక్లియర్ అనే       సరికి చాలామందికి పథకం వర్తించడం లేదు.  
 -సైదాబి, వంకాయలపాడు, ప్రకాశం జిల్లా
 
 ఒక్కరికే వేశారు
 నాకు ముగ్గురు బిడ్డలు. అందరూ పుట్టుకతో మూగ చెవిటివారే. భర్త కూడా మూగవారే. పెద్దబ్బాయికి ఎలాగూ ఈ పథకం వర్తించలేదు. రెండో అమ్మాయికి ఆరేళ్లు. కానీ వర్తించదని చెబుతున్నారు. చిన్నబ్బాయి నందకిషోర్‌కు ఒక్కరికే కాక్లియర్ వేశారు. వ్యవసాయం చేసుకునే వాళ్లం. లక్షలు ఖర్చు చేయాలంటే మావల్ల కాదు. ఒక్కరికైనా ఈ పథకం వర్తించిందంటే .. అది వైఎస్ రాజశేఖరరెడ్డి చలవే.
 -వెంకటలక్ష్మమ్మ, తలుపుల (అనంతపురం జిల్లా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement