ప్రచార హోరు సద్దుమణిగింది. ఇంకో ఇరవై నాలుగు గంటలే ఉంది. ఓటరు అన్నీ విన్నాడు. అందరి తీరూ కన్నాడు. విజ్ఞతతో తన తీర్పు వెలువరించేందుకు సిద్ధంగా ఉన్నాడు. రాష్ట్రం విడిపోతున్న సందర్భంలో జరుగుతున్న చరిత్రాత్మక ఎన్నికలివి. కొద్ది వారాలుగా సాగిన ప్రచార సరళి రాష్ట్రంలో నెలకొన్న భయానక వాతావరణానికి అద్దం పడుతోంది. ఒకే ఒక్కడిగా నిలిచిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఎలాగైనా అడ్డుకోవడమే ఏకైక లక్ష్యంగా సాగిన అడ్డూ అదుపూ లేని కుట్రలను చూసి రాష్ట్రమంతా విస్తుపోయింది. పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ హద్దులన్నింటినీ చెరిపేస్తూ ఆయనపై తీవ్రరూపుదాల్చిన మూకుమ్మడి దాడిని చూసి అసహ్యించుకుంది. జగనే లక్ష్యంగా ఈసారి అధికార కాంగ్రెస్, విపక్ష తెలుగుదేశం తేడాలన్నీ పక్కన పెట్టి మరీ ఒక్కటయ్యాయి. విలువలన్నిటినీ ఏనాడో వదిలేసిన ఒక వర్గం మీడియా జతకూడింది. అంతా కలిసి ముఠా కట్టారు.
మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించిన మరుక్షణం నుంచీ ఆయన వారసుడిపై ముప్పేట దాడికి దిగారు. వైఎస్ కుటుంబాన్ని లక్ష్యం చేసుకుని, గత నాలుగున్నరేళ్లుగా కనీవినీ ఎరగని స్థాయిలో వేధింపులకు దిగారు. రాజకీయంగానే గాక వ్యక్తిగతంగానూ, మానసికంగానూ రకరకాలుగా ఇబ్బందుల పాలు చేసి వికృతానందం పొందారు. తండ్రి ఆకాంక్షలను నెరవేరుస్తానన్నందుకు, ప్రజలకు తానిచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ప్రయత్నించినందుకు జగన్‌పై కత్తి కట్టారు. అడ్డగోలు కేసులతో వేధించారు. అక్రమంగా నిర్బంధించారు. న్యాయం కోరుతూ వైఎస్ సతీమణి విజయమ్మ సహా కుటుంబ సభ్యులంతా నడిరోడ్డుపై బైఠాయించాల్సిన, అది చూసి రాష్ట్రమంతా కన్నీరు పెట్టుకోవాల్సిన పరిస్థితి కల్పించారు.
సోనియాగాంధీ మొదలుకుని నరేంద్ర మోడీ దాకా... చంద్రబాబు మొదలుకుని రామోజీ దాకా... ఆవలివైపు మోహరించిన శక్తులు ఆషామాషీవి కాదు. కులం, మతం, ధనం, అధికారం... అవి ప్రయోగిస్తూ వచ్చిన అస్త్రాలూ అలాంటిలాంటివి కాదు. అయినా సరే... ఆ శక్తులన్నింటికీ తానొక్కడై సమాధానమిచ్చారు జగన్. ప్రజల ఆదరణే శ్రీరామరక్షగా వాటి పన్నాగాలన్నింటినీ ఒంటిచేత్తో తిప్పి కొట్టారు. ఒకవైపు వైఎస్ విజయమ్మ, మరోవైపు సోదరి షర్మిల వెంట రాగా రాష్ట్రమంతా కలియదిరిగారు. ప్రజా తీర్పు కోరారు. నాలుగున్నరేళ్ల పరిణామాలను బేరీజు వేసి వారినే న్యాయం చెప్పమన్నారు. సీమాంధ్ర ప్రజ జగన్‌కు అడుగడుగునా బ్రహ్మరథం పట్టింది. ప్రచార పర్వం పొడవునా ఆయన సభలకు, రోడ్ షోలకు మండుటెండలను కూడా లెక్కచేయకుండా అపార జనవాహిని నిరంతరం పోటెత్తింది. విజయమ్మకు, షర్మిలకు ఊరూరా మంగళారతులు పట్టింది.
కొద్ది వారాలుగా వైఎస్ జగన్‌పై ఎంత అడ్డగోలు దాడి జరుగుతోందో చూస్తూనే ఉన్నాం. ప్రజల చేత శాశ్వత తిరస్కరణకు గురైన పచ్చ బాబుల తరఫున వకాల్తా పుచ్చుకుని ఒక పత్రికాధిపతి పడుతున్న పడరాని పాట్లను గమనిస్తూనే ఉన్నాం. పేజీలకు పేజీలు జగన్నామస్మరణ చేస్తున్న వైనం... ప్రతి వాక్యంలోనూ వైఎస్, జగన్ అనే పదాలు లేకుండా కనీసం ఏ రోజూ సంపాదకీయం కూడా రాయలేని స్థితికి దిగజారిన తీరు కళ్లముందే కన్పిస్తోంది. ఎటుచూసినా కొట్టొచ్చినట్టు కన్పిస్తున్న వైఎస్ జగన్ ప్రభంజనాన్ని ఎలాగోలా అడ్డుకోవడమే లక్ష్యంగా ప్రచార పర్వం పొడవునా సాగిన కుటిల యత్నాలను, అధికార-ప్రతిపక్ష శక్తుల బరితెగింపుతనాన్ని, మీడియా ముసుగులో వెల్లువెత్తుతున్న అడ్డగోలు రాతల్లోని డొల్లతనాన్ని ‘జనాయుధం’ ఎప్పటికప్పుడు ఎత్తిచూపుతూనే వచ్చింది. నిజానిజాలను నిత్యం పాఠకుల ముందుంచింది. విజ్ఞులైన ప్రజలు వీటన్నింటినీ గమనిస్తూనే ఉన్నారు.
ఎన్నికల వేళ సాగిన ఈ కనీవినీ ఎరగని అడ్డగోలు దాడి లక్ష్యమేమిటో, జుగుప్స పుట్టించే రాతల లోగుట్టేమిటో వారికి తెలియనిది కాదు. ఇప్పుడిక ఓటరు తన చూపుడు వేలితో అం తిమ తీర్పు వెలువరించాల్సిన సమయం సమీపించింది. కొత్తగా ఊపిరి పోసుకోనున్న రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టించి అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా నిలపగల సమర్థ నాయకుడిని ఎంచుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది... ఓటు రూపంలో మన చేతిలో ఉన్న వజ్రాయుధాన్ని విచక్షణతో ప్రయోగించాల్సిన సమయమిది. విశ్వసనీయతకు ఓటేసి, మహానేత మనకు చవిచూపిన స్వర్ణయుగాన్ని తిరిగి తెచ్చుకోవాల్సిన వేళ ఇది.