కంపెనీల సేవలో పార్టీలు | ompanies in the service of the parties | Sakshi
Sakshi News home page

కంపెనీల సేవలో పార్టీలు

Published Tue, May 6 2014 1:35 AM | Last Updated on Mon, Sep 17 2018 5:36 PM

కంపెనీల సేవలో పార్టీలు - Sakshi

కంపెనీల సేవలో పార్టీలు

విరాళాల కోసం కార్పొరేట్లకు సాగిలపాటు  పార్టీ ప్రధాన ఆదాయ వనరు కంపెనీల విరాళాలే
 
 ఎన్నికల్లో డబ్బు చూపే ప్రభావం అంతాఇంత కాదు. కోట్లు ఖర్చయ్యే ఎన్నికలను భరించాలంటే రాజకీయ పార్టీలకు డబ్బు ఎక్కడినుంచి వస్తుంది? ఎవరిస్తారు? ఎన్నికల రణరంగంలో పెద్ద పార్టీల ఖర్చులే వేల కోట్లలో ఉంటాయంటే అతిశయోక్తి కాదు. కానీ అంత ఖర్చు చేశామని అవి చెప్పవు. ఆయా పార్టీలకు ఇంతింత మొత్తాల్లో డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరిస్తారు? ఎందుకిస్తారు? ప్రజాస్వామ్య మనుగడకు సంబంధించి ఇవి కీలక ప్రశ్నలు. సాధారణంగా పెద్ద పెద్ద కార్పొరేషన్లు, కంపెనీలు రాజకీయ పార్టీలకు భారీ మొత్తాల్లో విరాళాలు ఇస్తుంటాయి. కానీ అవి అంత భారీ విరాళాలను ఊరికే ఇవ్వవు. లక్షల రూపాయలు విరాళాలిచ్చి, కోట్ల రూపాయలు లబ్ధిగా పొందే ఉద్దేశంతోనే అవి విరాళాలిస్తుంటాయి.

కార్పొరేట్ విరాళాలు

2004 -2011 మధ్య కాలంలో రూ.2008 కోట్ల ఆదాయం వచ్చిందని కాంగ్రెస్, రూ.994 కోట్ల రాబడి ఉందని బీజేపీ ప్రకటించాయి. ఈ రెండు పార్టీల ఆదాయం ఏటేటా పెరుగుతూనే వచ్చిం దని ఏడీఆర్ (అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్), ఎన్‌ఈడబ్ల్యూ (నేషనల్ ఎలక్షన్ వాచ్) సంస్థలు విశ్లేషించాయి. కార్పొరేట్ విరాళాలే రాజకీయ పార్టీలకు ప్రధాన ఆదాయ వనరులని ఆ సంస్థలు తెలిపాయి.

 ఇతరత్రా ఆదాయాలు
 
కాంగ్రెస్ పార్టీ 2007-09 మధ్య కూపన్లు అమ్మడం ద్వారా రూ. 598 కోట్లను, ఇతర విరాళాల ద్వారా రూ. 72 కోట్లను, వీటిమీద వడ్డీ ద్వారా రూ. 38 కోట్లను సంపాదించింది. బీజేపీ రూ. 297 కోట్లు విరాళాల ద్వారా, రూ. 21 కోట్లు వడ్దీ ద్వారా సంపాదించింది. ఇవి చూస్తుంటే ఈ పార్టీల ఆదాయం ఇంతేనా అనిఆశ్చర్యమేస్తుంది. కాంగ్రెస్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆ పార్టీ ఎన్నికల మీద (ఈ ఎన్నికలు కాదు) కేవలం రూ. 215 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది. పబ్లిసిటీకి రూ. 58 కోట్లు మాత్రమే వ్యయం చేసింది. ఇతరులకు రూ.56 కోట్లు ఇచ్చింది(ఆ ఇతరులు అంటే ఎవరో చెప్పలేదు). ఇక బీజేపీ తెలిపిన వ్యయ వివరాలు చూస్తే.. ఆ పార్టీ అంత పొదుపరా అనిపించక మానదు. బీజేపీ ప్రచారం మీద చేసిన  వ్యయం రూ. 89.16 కోట్లు మాత్రమే.

వివరాలు లేని విరాళాలు

2004-2012 మధ్య జాతీయ రాజకీయ పార్టీలకు వచ్చిన ఆదాయంలో 87% కార్పొరేట్ కంపెనీల నుంచి వచ్చిందని ఏడీఆర్ తేల్చింది. ఏడీఆర్ విశ్లేషణ ప్రకారం.. ఈ పార్టీలు 75 శాతం ఆదాయం ఎక్కడి నుంచి వచ్చిందో వెల్లడిస్తాయి. కానీ ఆ పార్టీలకు తెలియని మార్గాల ద్వారా వచ్చే డబ్బు 25 శాతం దాకా ఉంటుంది. బీజేపీకి 1334 కార్పొరేట్ వ్యాపార వర్గాల నుంచి రూ. 192.47 కోట్లు వస్తే, కాంగ్రెస్‌కు 418 కార్పొరేట్ వర్గాల నుంచి రూ. 172.25 కోట్లు వచ్చాయి. అంటే కాంగ్రెస్ ఆదాయంలో 92 శాతం, బీజేపీకి 85 శాతం ఆదాయం కార్పొరేట్ సంస్థల నుంచి వచ్చింది. ఈ పార్టీలకు ఉత్పత్తి రంగానికి చెందిన కంపెనీలు (రూ.99.71 కోట్లు) అత్యధికంగా విరాళాలిచ్చాయి. రియల్ ఎస్టేట్ రంగం (రూ. 24.1 కోట్లు) తరువాతి స్థానంలో ఉంది. కమ్యూనికేషన్ రంగం నుంచి రూ. 13.26 కోట్లు, షిప్పింగ్ రంగం నుంచి రూ. 3.67 కోట్లు జాతీయ పార్టీలకు అందాయి. కాంగ్రెస్‌కు ట్రస్ట్స్ అండ్ గ్రూప్ కంపెనీల నుంచి రూ. 70.28 కోట్లు అందితే, బీజేపీకి ఎక్కువగా ఉత్పత్తి రంగం నుంచి రూ. 58.18 కోట్లు అందింది. జాతీయ పార్టీలకు రూ.25.28 కోట్లు విరాళంగా ఇచ్చిన 301 మంది దాతలు విరాళాల పత్రంలో తమ పాన్(పర్మినెంట్ అకౌంట్ నంబర్), చిరునామా, ఇతర వివరాలివ్వలేదు. వివరాలు చెప్పకుండా రూ. 22.53 కోట్ల రూపాయల గుప్తదానాలు చేసిన వారిలో 273 మంది బీజేపీకి ఇచ్చిన వారే. విదేశీ కంపెనీల నుంచి, భారతదేశంలో కంపెనీలను అదుపు చేసే విదేశీ కంపెనీల నుంచి పార్టీలు విరాళాలు తీసుకునే వీల్లేదు. కానీ 2003-12 మధ్య కాలంలో కాంగ్రెస్, బీజేపీలు రూ. 29.26 కోట్లను విదేశీ సంస్థల నుంచి విరాళంగా తీసుకున్నాయి.

 సీపీఐకి రూ. 11 లక్షలే

కంపెనీలు రాజకీయ పార్టీలకు విరాళాలు నేరుగా ఇవ్వకుండా ఎలక్టోరల్ ట్రస్టులను ఏర్పాటు చేసుకుని వాటిద్వారా ఇస్తాయి. కాంగ్రెస్ పార్టీకి జనరల్ ఎలక్టోరల్ ట్రస్టు ద్వారా ఆదిత్య బిర్లా గ్రూపు రూ. 36.41 కోట్లు ఇచ్చింది. భారతీ ఎలక్టోరల్ ట్రస్టు ద్వారా భార్తీ గ్రూపు రూ.11 కోట్లు ఇచ్చింది. టోరెంట్ పవర్ లిమిటెడ్ వారు రూ. 11.85 కోట్లు ఇచ్చారు. బీజేపీకి జనరల్ ఎలక్టోరల్ ట్రస్టు రూ. 26.57కోట్లను, టోరెంట్ పవర్ లిమిటెడ్ రూ. 13 కోట్లను, ఆసియా నెట్ హోల్డింగ్ ప్రైవేటు లిమిటెడ్ రూ. 10 కోట్లను ఇచ్చారు. మూడు కార్పొరేట్ కంపెనీల నుంచి సీపీఐకి రూ. 11 లక్షలు, 108 కార్పొరేట్ కంపెనీలు సీపీఎంకు రూ. 1.76 కోట్లు ఇచ్చాయి.

 రాజకీయ పార్టీలు వార్షిక చందాలు, సభ్యత్వ రుసుము ద్వారా ఎక్కువ మంది నుంచి విరాళాలు స్వీకరిస్తూ జనానికి జవాబుదారీగా ఉంటే ప్రజాస్వామ్యం బలపడుతుంది. కానీ గుప్పెడు కంపెనీలు ఇచ్చే భారీ విరాళాలకు ప్రలోభపడితే ప్రజా ప్రయోజనాలను పక్కన బెట్టి ఆ కంపెనీలకు లబ్ధి చేకూర్చేందుకే పనిచేయాల్సి వస్తుంది. విరాళాల కోసం పార్టీలు కార్పొరేట్లకు దాసోహం అంటే.. ప్రజాస్వామ్య భారతదేశం కార్పొరేట్ పాలనలోకి వెళ్లే ప్రమాదముంది.
 
 ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement