భరోసా.. కాదు భయం
కడప అగ్రికల్చర్: రైతుకు ధీమా ఇవ్వాల్సిన పంటల బీమా పథకం వివిధ కారణాలతో రైతుకు అందని ద్రాక్ష సామెతలా తయూరైంది. ఎప్పటికప్పుడు ఊరిస్తుందే కాని ఆ పథకం ప్రయోజనాలు రైతుకు దక్కుతున్నది అంతంత మాత్రమే. ఈ ఏడు కూడా ప్రభుత్వ నిర్లక్ష్యంతో బీమా రైతు చేజారిపోయేలానే ఉంది. అటు ఖరీఫ్‌లోను, ఇటు రబీలోను ప్రధాన పంటలకు జాతీయ వ్యవసాయాధారిత పంటల బీమాను అమలు చేస్తున్నా, దానికి సంబందించి ప్రీమియం చెల్లించే ప్రకటనలు సకాలంలో వెలువడక పోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉంటున్నారు.
రెండు సంవత్సరాలుగా ప్రభుత్వాలు ఏ మాత్రం పట్టించుకోక పోవడంతో రైతులు నిరాశ చెందుతున్నారు. ఏటా రబీలో అక్టోబరు నెలలో సాగు చేసే పంటలకు బీమా ప్రీమియం రైతులు చెల్లించేందుకు జాతీయ వ్యవసాయాధారిత పంటల బీమా కంపెనీ అటు రాష్ట్ర ప్రభుత్వానికి, ఇటు రాష్ట్రంలో ఉన్న బీమా కంపెనీ శాఖకు ఉత్తర్వులు పంపుతుంది. కానీ పంటల సాగు చేసి నెలరోజలు గడచినా ఇంతవరకు ఎలాంటి మార్గదర్శకాలు ప్రకటించపోవడంతో పథకం అందే పరిస్థితి కనిపించడంలేదు.
జిల్లాలో ఈ రబీలో రైతులు వ్యవసాయాధారంగా బుడ్డశనగ, పొద్దుతిరుగుడు, ధనియాలు, జొన్న, మొక్కజొన్న, పత్తి పంటలతో పాటు పలు రకాల పంటలను సాగు చేశారు. ఈ పంటలకు వాతావరణ పరిస్థితులు అనుకూలించకనో, పురుగుల వల్లనో చలిమంచు అధికంగా కురచడం వల్లనో ఏదో రక ంగా పంట దెబ్బతింటే అందుకు తగ్గ పరిహారం చెల్లించేలా పంటల బీమా అమలులో ఉంది.
కానీ రెండు సంవత్సరాలు ఈ బీమా ఉన్నా... లేనట్లేనని రైతులు, రైతు సంఘాలు దుయ్యబడుతున్నాయి. రబీ పంటలు సాగు చేసి రెండు నెలలు కావస్తున్నా ఇంతవరకు ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రబీలో పంటలను సాగు చేసిన రైతులు నేరుగా బ్యాంకుల ద్వారా ప్రీమియంను కంపెనీకి చెల్లిస్తారు.
పంట దెబ్బతిన్న తరుణంలో రైతులు మండల వ్యవసాయాధికారికి, మండలంలోని గణాంక అధికారికి పిర్యాదు చేస్తే వారు పంటను పరిశీలించి బీమా కంపెనీకి తగిన ఫోటోలు తీసి కంపెనీకి పంపుతారు. దాని ఆధారంగా పంటల బీమా వస్తుంది. కానీ దీనికి సంబందించి విధి విధానాలనే ఇంతవరకు కంపెనీ ప్రకటించలేదు.
దీనిపై ప్రభుత్వం కూడా ఏ మాత్రం పట్టించుకోలేదని రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఈ రబీలో బుడ్డశనగ సాధారణ సాగు 88964 హెక్టార్లకుగాను, 44612 హెక్టార్లలో సాగైంది. అలాగే పొద్దుతిరుగుడు సాధారణ సాగు 41816 హెక్టార్లకుగాను 3935 హెక్టార్లలో సాగైంది. ఈ పంటలకు బీమా చేసుకునేందుకు అవకాశం ఉంది.
గత ఏడాది తీవ్రంగా నష్టపోయిన రైతులు...:
గత ఏడాది ఈ సీజన్‌లో పంట సాగు చేసిన నెలన్నరకు బీమా చేసుకోండని ప్రకటన జారీ చేశారు. అయితే రైతులు పంటసాగు విస్తీర్ణ పత్రాలు, 1-బి, టెన్ ఒన్ అడంగల్‌ను వీఆర్‌ఏల నుంచి రాయించుకుని ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి నానా అవస్థలు పడ్డారు. ఆన్‌లైన్ సౌకర్యాలు ఉన్నా సమయం తక్కువగా ఉండడంతో మారుమూల గ్రామాల నుంచి రైతులు జిల్లా సరిహద్దుల వరకు పోయి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేకుండా పోయింది.
బీమా కంపెనీకి ప్రీమియం చెల్లించే రోజుకు పొలంపై పంట నెలరోజుల లోపు మాత్రమే ఉండాలి. బీమా కంపెనీకి ప్రీమియాన్ని రైతు చెల్లించవచ్చంటూ ఆలస్యంగా ప్రకటన జారీ చేసింది. దీంతో రైతులు అవకాశం వచ్చిందని జిల్లాలో మొత్తం 27825 మంది రైతులు 2,11,14,658 రూపాయలు బీమా కంపెనీకి తమ వాటాగా చెల్లించారు. అయితే ఆలస్యంగా చెల్లించారని, పంట సాగు చేసి నెలన్నర దాటిందని కంపెనీ నిబందనలు ఒప్పుకోవని చావుకబురు పంపడంతో రైతు తీవ్రంగా నష్టపోయారు.
ఇందులో పంటకు సరైన సమయంలో 66 మంది రైతులు రూ.51,240ల ప్రీమియం చెల్లించారని వారే అర్హులని తేల్చి చెప్పింది. దీంతో రైతులకు బీమా కంపెనీపై ఆగ్రహం కట్టలు తెంచుకుని ఆందోళనలకు దిగిన ఫలితం లేకుండా పోయింది. దీనిపై ప్రజా ప్రతినిధులు కూడా పట్టించుకున్న పాపాన పోలేదని రైతులు ఇప్పటికి దుయ్యబడుతున్నారు.
పంట బీమా ప్రీమియం చెల్లించాలని ఎదురు చూస్తున్నాం...
శనగ పంటను సాగు చేశాం. పంటల బీమా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నా అధికారులు ఇంత వరకు చెప్పలేదు. పంటకు నష్టం వచ్చినప్పుడు ఆదుకుంటుందని ఆశిస్తున్నా, ఇప్పటికీ ఏమీ చెప్పలేదు. ఏప్పుడు చెబుతారో ఏం తెలియకుండాది.
-ఏకాంబరం,బుడ్ఢశనగ రైతు, చిన్న పసుపుల గ్రామం, పెద్దముడియం మండలం
నిరుడు దెబ్బతిన్నాం...ఈసారైనా సక్రమంగా చెబుతారో...లేదో?
నిరుడు బుడ్డశనగకు బీమాకు ప్రీమియం చెల్లించాం. తీరా సమయం దాటిపోయాక, మీరు కట్టిన ప్రీమియం ఆలస్యమైందని చెప్పి అటు ప్రభుత్వం, ఇటు కంపెనీవాళ్లు తప్పించుకున్నారు. దీంతో చాలా నష్టపోయినాం. ఇప్పుడైన, ఈసారైన సక్రమంగా కట్టించుకుంటారోలేదో.
-గుర్రప్ప, శనగరైతు, ఉప్పలపాడు, పెద్దముడియం మండలం.