
బాండ్, పాస్‌బుక్కును అందజేస్తున్న అధికారులు (ఫైల్)
సాక్షి, కొల్లాపూర్ : రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రవేశపెట్టిన రైతు బీమా పథకం రైతుల పాలిట వరం లాంటిదని, సన్న, చిన్నకారు రైతులు ప్రభుత్వానికి అభినందనలు తెలుపుతున్నారు. గతేడాది ఒక గుంట పట్టా ఉన్న ప్రతి రైతుకు ప్రమాదవశాత్తూ గానీ, సహజంగా మరణించిన రైతులకు బీమా కల్పిస్తూ రైతు కుటుంబాలను ఆదుకోవడం అభినందనీయమని రైతులు అంటున్నారు. డిసెంబర్ నుంచి నేటి వరకు ఎంతోమంది రైతులు సహజంగా మరణించారు.వారికి రూ.5లక్షల బీమాను అందజేశారు.
షరతులు లేకుండానే ఖాతాలో జమ
కొల్లాపూర్ మండల పరిధిలోని చింతలపల్లి, రామాపురం, ముకిడిగుండం, కల్వకోల్, నర్సింగాపురం, నర్సింగరావుపల్లి, ఎన్మన్‌బెట్ల, సింగోటం, చుక్కాయిపల్లి, చెంచుగూడెం, ఎల్లూరు, మొలచింతలపల్లి తదితర గ్రామాలలో మృతిచెందిన రైతు కుటుంబాలకు ఇప్పటికే ఒక్కొక్కరికి రూ.5లక్షల బీమా బాధిత కుటుంబాల ఖాతాలో జమ చేశారు. చనిపోయిన ప్రతి రైతు కుటుంబానికి షరతులు లేకుండా బీమాను వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.
16 కుటుంబాలకు అందిన బీమా
బీమా ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 16మంది రైతులు చనిపోయారు. వారందరికీ బీమా డబ్బులు వారి కుటుంబాలకు అందాయి. ఇప్పటి వరకు మృతి చెందిన రైతులు చింతలపల్లిలో చంద్రశేఖర్‌రావు, కుర్మయ్య, రామాపురంలో నాగపురం శ్రీనివాస్, ముకిడిగుండంలో బీమిని బిచ్చన్న, పాత్లావత్ పేట్లానాయక్, లౌడ్యా తిరుపతి, మొలచింతలపల్లిలో శ్రీవాణి బాలమ్మ, చెంచుగూడెంలో మండ్ల ఈశ్వరమ్మ, ఎల్లూరులో బండారి పార్వతమ్మ, సింగోటంలో వాకిటి నర్సింహ, ఎన్మన్‌బెట్లలో మండ్ల చిట్టెమ్మ, నర్సింగరావుపల్లిలో పుల్లాసి శాంతయ్య, నలుపోతుల నాగేంద్రం, చుక్కాయిపల్లిలో చవ్వ రాముడు, చెంచుగూడెంలో మండ్ల ఈశ్వరమ్మ, కల్వకోల్‌లో పెబ్బేటి కుర్మయ్య అనే రైతులు చనిపోయారు. వారి వారి కుటుంబాలకు రైతు బీమా పథకం పూర్తిగా వర్తించి వారికి ప్రభుత్వం అందజేస్తున్న బీమా డబ్బులు అందాయి.
వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో క్లయిమ్
రైతులందరూ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూడలేదని రైతులు అంటున్నారు. ప్రభుత్వం ఈవిధంగానే రైతు బంధు, రైతు బీమా అమలు చేస్తే శాశ్వతంగా రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఉంటుందని అంటున్నారు. వ్యవసాయ శాఖ కార్యాలయంలో మృతి చెందిన రైతుకు సంబంధించిన ఎల్‌ఐసీ బాండ్, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా నఖలు ఇస్తే ఇచ్చిన నెల రోజుల్లోనే తమ కుటుంబీకుల ఖాతాలో రూ.5లక్షలు జమ అయ్యాయన్నారు.
నెలలోపే ఖాతాలో డబ్బు జమ
చెంచు గూడెంకు చెందిన రైతు ఈశ్వరమ్మ మృతి చెందింది. నెలరోజుల్లోనే రాష్ట్ర ప్రభుత్వం రైతు బీమా పథకంలో భాగంగా రూ.5లక్షలను జమ చేసింది. రైతు బీమా మాకు అందడం ఎంతో ఆసరా అయ్యాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వాన్ని ఎప్పుడూ మరువం.
– హన్మంతు, చెంచుగూడెం రైతు
Comments
Please login to add a commentAdd a comment