శామీర్‌పేట్: ప్రస్తుత పరిస్థితుల్లో మనిషికైనా, పశువుకైనా బీమా తప్పనిసరి అయ్యింది. జీవాలు మృతి చెందితే వచ్చే భీమా సొమ్ముతో రైతులు తమ నష్టాన్ని కొంతమేర భర్తీ చేసుకోవచ్చు. గొర్రెలు, మేకల పెంపకం దారులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని మూడుచింతలపల్లి పశువైద్యుడు తిరుపతి సూచించారు.
భీమా పథకం వివరాలు ఆయన మాటల్లోనే...
వ్యవసాయ అనుబంధ రంగంగా పలువురు జీవాలను పోషిస్తున్నారు. కొందరు కేవలం పెంపకాన్నే వృత్తిగా చేసుకుని జీవిస్తున్నారు. మండలంలో 19,081 గొర్రెలు, 6,844 మేకలు ఉన్నాయి. మేకలు ఆకులు అలుమలు తిని కొద్దిమేరకు రోగాలను తట్టుకుంటాయి. కానీ గొర్రెలు మాత్రం గడ్డి తింటూ చిత్తడి నేలల్లో తిరుగుతూ ఉండటంతో వ్యాధుల బారిన పడి మృతిచెందితే అవకాశాలు ఎక్కువ. దీంతో పెంపకం దారులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఈ నష్టం నుంచి పెంపకం దారులను కాస్తై గట్టెక్కించేందుకు రాష్ట్ర పశుసంవర్థక శాఖ సహకారంతో న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ గొర్రెల బీమాపథకాన్ని అమలు చేసింది.
బీమా పథకం ఇలా...
మూడు నెలల నుంచి సంవత్సరం లోపువయసు ఉండే గొర్రెకు బీమా ప్రీమియం రూ. 118. అయితే ఇందులో రైతు వాటాగా రూ.48 చెల్లిస్తే రాష్ట్ర పశుసంవర్థక శాఖ తన వాటాగా రూ.70 జమ చేస్తుంది. ఒకవేళ బీమా చేసిన గొర్రె మృతిచెందితే రూ.1500 దక్కుతాయి. సంవత్సరం పైబడి ఏడేళ్లలోపు వయసు ఉన్న గొర్రె కు బీమా ప్రీమియం రూ.236 కాగా ఇందులో రైతు తన వాటాగా రూ.96 చెల్లిస్తే, రాష్ట్ర సంవర్థక శాఖ రూ.140 చెల్లిస్తుంది.
సదరు గొర్రె మరణిస్తే రూ.3వేల పరిహారం దక్కుతుంది. ప్రీమియం చెల్లించిన నాటి నుంచి ఏడాదిపాటు భీమా అమలులో ఉంటుంది. బీమా చేయించే గొర్రెల కాపరి సమీప పశువుల ఆస్పత్రి వైద్యుడిని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. బీమా చేయించే గొర్రెల సంఖ్యకు అనుగుణంగా చెవి పోగులు తెప్పించి నిర్ణీత తేదీన భీమా చేయిస్తారు. రైతు వాటాగా ప్రీమియాన్ని ది న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ పేరు మీద చెల్లింపు అయ్యేలా డీడీ తీయాలి.
బీమా దరఖాస్తులను పశువైద్యుడు పూర్తి చేసి బీమా కంపెనీకి పంపుతారు. దరఖాస్తులను కంపెనీకి అందజేసిన వారంలోపు బీమా పత్రాలుపెంపకం దారులకు చేరుతాయి. బీమా కంపెనీ గొర్రె చెవులకు వేసిన చెవి పోగులను పోగుట్టుకోకుండా చూసుకుంటుండాలి. ఒక వేళ చెవి పోగు పోతే వెంటనే ఇన్సూరెన్స్ కంపెనీకి, పశువైద్యుడికి సమాచారం అంద జేయాలి.
15 రోజుల్లోగా వివరాలివ్వాలి...
వ్యాధులతో చనిపోయినా, ప్రమాదవశాత్తు గొర్రె మృతిచెందినా బీమా వర్తిస్తుంది. ఒకవేళ బీమా చేసిన గొర్రె మృతిచెందితే వెంటనే బీమా కంపెనీకి, పశువైద్యుడికి తెలియజేయాలి. పశువైద్యుడితో పోస్టుమార్టం చేయించి మరణ ధ్రువీకరణ పత్రాన్ని, గొర్రెకు వేసిన చెవిపోగును దరఖాస్తులతోపాటు 15రోజుల్లోగా బీమా కంపెనీకి అందజేయాలి. అనంతరం సదరు కంపెనీ గొర్రెల కాపరి బ్యాంకు ఖాతాకు నేరుగా డబ్బులు జమచేసి సమాచారాన్ని అందజేస్తుంది.
ఇవి తప్పని సరిగా చూసుకోవాలి...
గొర్రె మరణించిన వెంటనే ఇన్సూరెన్స్ కంపెనీ వారికి తెలియజేయాలి. అవ సరమైన సందర్భాల్లో కంపెనీ ప్రతినిధులు వివరాలు సేకరణ, ఫొటోలను తీసుకుని వెళేవరకు గొర్రె చనిపోయిన చోటే ఉంచాలి. కదిలించడం పక్కకి తీసుకుపోవడం చేయరాదు. బీమా కంపెనీ వేసే చెవిపోగు లేకపోతే బీమా వర్తించదు. ఒకే సారి ఒకటి కంటే ఎక్కువ గొర్రెలు చనిపోతే చనిపోయిన గొర్రెలతో పాటు కాపరి కూడా ఫొటో తీయించుకుని ఆ ఫొటోలను ఫిర్యాదుకు జతపరిచి బీమా కంపెనీకి పంపాల్సి ఉంటుంది.
గొర్రెలకు బీమాతో రైతుకు ధీమా
Published Wed, Nov 12 2014 12:54 AM | Last Updated on Sat, Sep 2 2017 4:16 PM
Advertisement
Advertisement