Sheep insurance
-
ఇన్సూరెన్స్ క్లెయిమ్‌కు చర్యలు తీసుకోండి
సాక్షి, హైదరాబాద్: గొర్రెలు, పాడి గేదెల ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లను పరిష్కరించేందుకు 15 రోజుల్లో చర్యలు తీసుకోవాలని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధిశాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. శనివారం మాసబ్‌ట్యాంక్‌లోని పశుసంవర్ధక, మత్స్య, డెయిరీ శాఖల అధికారులతో మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు 3,86,366 యూనిట్ల గొర్రెలు పంపిణీ చేసినట్లు తలసాని చెప్పారు. డీడీలు చెల్లించిన లబ్ధిదారులకు త్వరలో గొర్రెలను పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. లబ్దిదారులు తమ వాటా డీడీలను సంబంధిత పశువైద్యాధికారులకు అందజేయాలని కోరారు. మత్య్సకారులని సొసైటీలలో సభ్యులుగా నమోదుచేసే విధంగా కార్యాచరణ రూపొందించాలని మత్స్య శాఖ అధికారులను ఆదేశించారు. మత్స్యకార సొసైటీలలో ఉన్న సభ్యులందరికీ సహకారచట్టంలోని అంశా లు, ప్రభుత్వం అందజేస్తున్న పథకాలపై, వారి అభ్యున్నతికి చేపడుతున్న కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పించడానికి కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. మత్స్యశాఖకు బదిలీ అయిన గ్రామపంచాయతీ చెరువులు, కుంట లకు సంబంధించిన లీజు మొత్తాన్ని నిర్ణయించేం దుకు సమగ్రమైన సమాచారం కోసం ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేసి తదుపరి జరిగే జేఏసీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. జేఏసీ ప్రతినిధుల తదుపరి సమావే శం మార్చి 2వ వారంలో నిర్వహించేందుకు ఏర్పా ట్లు చేయాలని తలసాని ఆదేశించారు. ఈ సమావేశంలో పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అదర్ సిన్హా, గొర్రెల అభివృద్ధి సమాఖ్య ఫెడరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, డైరెక్టర్ రాం చందర్, మత్స్యశాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా, టీఎస్ఎల్డీఏ సీఈవో మంజువాణి పాల్గొన్నారు. -
కొనుగోలు ప్రాంతంలోనే గొర్రెల బీమా
సాక్షి, హైదరాబాద్: రెండో విడతలో పంపిణీ చేసే గొర్రెలకు కొనుగోలు ప్రాంతంలోనే బీమా చేయించి సంబంధిత పత్రాలు లబ్ధిదారులకు అందజేయాలని పశుసంవర్థక శాఖమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులకు సూచించారు. ఒకవేళ గొర్రె చనిపోతే 10 రోజుల్లోగా బీమా క్లెయిమ్ చేసి లబ్ధిదారుడికి అందించేలా పథకాన్ని అమలు చేయాలన్నారు. శనివారం ఎంసీఆర్హెచ్ఆర్డీలో పశుసంవర్థక శాఖ అమలు చేస్తున్న కార్యక్రమాలు, రెండో విడత గొర్రెల పంపిణీపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ రాష్ట్ర పశుసంవర్థక శాఖ పనితీరును కేంద్ర ప్రభుత్వం కూడా ప్రశంసించిందన్నారు. పెరిగిన జీవాలకనుగుణంగా గ్రాసం కొరత రాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. జీవాల వద్దకు వైద్య సేవలు తీసుకెళ్లేలా సంచార పశు వైద్యశాలల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. పెంపకందారులు గొర్రెలు అమ్మి, కొనుక్కునేందుకు త్వరలోనే ఖమ్మం, పెద్దపల్లి, వనపర్తి జిల్లాల్లో గొర్రెల మార్కెట్ నిర్మాణ పనులు ప్రారంభిస్తామని చెప్పారు. ఈనెల 6 నుంచి 13 వరకు గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమాన్ని గజ్వేల్ నుంచి ప్రారంభిస్తామని తలసాని వెల్లడించారు. జీవాలకు వైద్య సేవలు, గొర్రెల పంపిణీ వంటి కార్యక్రమాల కోసం గోపాలమిత్రల సేవలను వినియోగించుకోవాలని చెప్పారు. పశుసంవర్థక శాఖ కార్యదర్శి అనితారాజేంద్ర, గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య ఎండీ రాంచందర్, పశుసంవర్థక శాఖ డైరెక్టర్ లక్ష్మారెడ్డి, టీఎస్ఎల్డీఏ సీఈవో మంజువాణి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. -
‘మంద’ గమనమే!
నేలకొండపల్లి: ప్రభుత్వం సబ్సిడీపై అందజేసిన గొర్రెల మందకు సంబంధించి బీమా గడువు ముగియగా..దీని కొనసాగింపు, రెన్యూవల్‌పై స్పష్టత లేక జీవాల పెంపకందారులు ఆందోళన చెందుతున్నారు. తిరిగి ప్రభుత్వమే రెన్యూవల్ చేస్తుందేమోనని గొల్ల, కురమలు భావిస్తుండగా..లబ్ధిదారులే చేయించుకోవాలని పశు సంవర్థక శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే..ఈ మేరకు క్షేత్రస్థాయిలో అందరికీ తెలిసేలా ప్రచారం చేయకపోవడం, అవగాహన కల్పించకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఏదైనా జరిగి జీవాలకు ప్రాణనష్టం కలిగితే చివరకు పరిహారం సొమ్ము అందని పరిస్థితి నెలకొంది. గొల్ల, కురమల అభివృద్ధికి గతేడాది రాష్ట్ర ప్రభుత్వం రాయితీపై జీవాలను పంపిణీ చేసిన విషయం విదితమే. వాటికి సంబంధించి సర్కారు చేయించిన బీమా పాలసీ గడువు తాజాగా తీరిపోయింది. 2017లో ప్రభుత్వం గొల్ల, కురమలకు మెదటి విడతగా 15,500 యూనిట్లు పంపిణీ చేసింది. గొర్రెలు కొనుగోలు చేసినప్పటి నుంచి ఏడాది వరకు బీమా వర్తించేలా సదరు కంపెనీతో ఒప్పందం కదుర్చుకుని ప్రభుత్వమే అప్పట్లో పాలసీ చేయించింది. ఇప్పటి వరకు దాదాపు 80శాతానికి పైగా యూనిట్ల పాలసీ గడువు ముగిసింది. ప్రభుత్వం ప్రీమియం చెల్లించి పాలసీని రెన్యూవల్ చేస్తుందని లబ్ధిదారులు భావిస్తున్నారు. రాయితీ గొర్రెల పథకం కింద 20 గొర్రెలు, ఒక పొట్టేలును అందజేశారు. యూనిట్ విలువ రూ.1.25 లక్షలు కాగా ఇందులో 75 శాతం రాయితీ వర్తించింది. లబ్ధిదారులు తమ వాటాగా రూ.31,250ని డీడీ రూపంలో చెల్లించారు. జీవాలను కొనుగోలు చేసిన సమయంలో యూనిట్‌కు రూ.2,830తో ప్రభుత్వం బీమా చేయించింది. తద్వారా పెంపకందారులకు ఎంతో లబ్ధి కలిగింది. ప్రమాదవశాత్తూ జీవాలు మృత్యువాత పడితే పరిహారం అందింది. గతేడాది ఇచ్చిన వాటిలో 1400 జీవాలు చనిపోయాయి. ఇప్పటి వరకు 1200 జీవాలకు నష్టపరిహారం అందించారు. ఆడ జీవాలకు రూ.5,200, మగ జీవాలకు రూ.7 వేల చొప్పున నష్ట పరహారం సొమ్మును ఇచ్చారు. అయితే..ఇప్పుడు పాలసీ రెన్యూవల్ చేయించుకోవడంపై అధికారులు ఆశించిన స్థాయిలో ప్రచారం చేయట్లేదు. అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టడం లేదు. దీంతో..ఈ రెన్యూవల్ ప్రక్రియ మందగమనంగా సాగుతోంది. జీవాలు చనిపోతే..నష్టపరిహారం అందక వీరు ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. ఇకనైనా బాధ్యులు స్పందించి..గొర్రెల బీమా పాలసీ రెన్యూవల్ చేయించుకునే విధానంపై విస్తృత ప్రచారం చేయాల్సిన అవసరముంది. లబ్ధిదారులేమో..ఈ సారి కూడా ప్రభుత్వమే తమ జీవాలకు రెన్యూవల్ చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వమే బీమా చేయించాలి.. సబ్సీడీ గొర్రెలను కొనుగోలు చేసేటప్పడు ప్రభుత్వం ఆ యూనిట్లకు బీమా చేయించింది. గడువు ముగిసిన అనంతరం కూడా మళ్లీ చేస్తే బాగుంటుంది. అలా అయితే..మాకు మరింత ప్రోత్సాహకం ఇచ్చినట్లవుతుంది. – చిర్రా బాబు, లబ్ధిదారుడు, అనాసాగారం పథకం పట్ల నిర్లక్ష్యం వద్దు.. యాదవులకు అందించిన గొర్రెల యూనిట్ల పథకం పట్ల నిర్లక్ష్యం తగదు. చనిపోయిన గొర్రెలకు చాలా వరకు నష్టపరిహారం అందించలేదు. రెండో విడతలో నేటి వరకు పంపిణీ చేయలేదు. ఇబ్బందులు లేకుండా చూడాలి. – యడ్ల తిరపరావు, గొర్రెల పెంపకందారుల సంఘం జిల్లా నాయకులు -
గొర్రెలకు బీమాతో రైతుకు ధీమా
శామీర్‌పేట్: ప్రస్తుత పరిస్థితుల్లో మనిషికైనా, పశువుకైనా బీమా తప్పనిసరి అయ్యింది. జీవాలు మృతి చెందితే వచ్చే భీమా సొమ్ముతో రైతులు తమ నష్టాన్ని కొంతమేర భర్తీ చేసుకోవచ్చు. గొర్రెలు, మేకల పెంపకం దారులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని మూడుచింతలపల్లి పశువైద్యుడు తిరుపతి సూచించారు. భీమా పథకం వివరాలు ఆయన మాటల్లోనే... వ్యవసాయ అనుబంధ రంగంగా పలువురు జీవాలను పోషిస్తున్నారు. కొందరు కేవలం పెంపకాన్నే వృత్తిగా చేసుకుని జీవిస్తున్నారు. మండలంలో 19,081 గొర్రెలు, 6,844 మేకలు ఉన్నాయి. మేకలు ఆకులు అలుమలు తిని కొద్దిమేరకు రోగాలను తట్టుకుంటాయి. కానీ గొర్రెలు మాత్రం గడ్డి తింటూ చిత్తడి నేలల్లో తిరుగుతూ ఉండటంతో వ్యాధుల బారిన పడి మృతిచెందితే అవకాశాలు ఎక్కువ. దీంతో పెంపకం దారులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఈ నష్టం నుంచి పెంపకం దారులను కాస్తై గట్టెక్కించేందుకు రాష్ట్ర పశుసంవర్థక శాఖ సహకారంతో న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ గొర్రెల బీమాపథకాన్ని అమలు చేసింది. బీమా పథకం ఇలా... మూడు నెలల నుంచి సంవత్సరం లోపువయసు ఉండే గొర్రెకు బీమా ప్రీమియం రూ. 118. అయితే ఇందులో రైతు వాటాగా రూ.48 చెల్లిస్తే రాష్ట్ర పశుసంవర్థక శాఖ తన వాటాగా రూ.70 జమ చేస్తుంది. ఒకవేళ బీమా చేసిన గొర్రె మృతిచెందితే రూ.1500 దక్కుతాయి. సంవత్సరం పైబడి ఏడేళ్లలోపు వయసు ఉన్న గొర్రె కు బీమా ప్రీమియం రూ.236 కాగా ఇందులో రైతు తన వాటాగా రూ.96 చెల్లిస్తే, రాష్ట్ర సంవర్థక శాఖ రూ.140 చెల్లిస్తుంది. సదరు గొర్రె మరణిస్తే రూ.3వేల పరిహారం దక్కుతుంది. ప్రీమియం చెల్లించిన నాటి నుంచి ఏడాదిపాటు భీమా అమలులో ఉంటుంది. బీమా చేయించే గొర్రెల కాపరి సమీప పశువుల ఆస్పత్రి వైద్యుడిని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. బీమా చేయించే గొర్రెల సంఖ్యకు అనుగుణంగా చెవి పోగులు తెప్పించి నిర్ణీత తేదీన భీమా చేయిస్తారు. రైతు వాటాగా ప్రీమియాన్ని ది న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ పేరు మీద చెల్లింపు అయ్యేలా డీడీ తీయాలి. బీమా దరఖాస్తులను పశువైద్యుడు పూర్తి చేసి బీమా కంపెనీకి పంపుతారు. దరఖాస్తులను కంపెనీకి అందజేసిన వారంలోపు బీమా పత్రాలుపెంపకం దారులకు చేరుతాయి. బీమా కంపెనీ గొర్రె చెవులకు వేసిన చెవి పోగులను పోగుట్టుకోకుండా చూసుకుంటుండాలి. ఒక వేళ చెవి పోగు పోతే వెంటనే ఇన్సూరెన్స్ కంపెనీకి, పశువైద్యుడికి సమాచారం అంద జేయాలి. 15 రోజుల్లోగా వివరాలివ్వాలి... వ్యాధులతో చనిపోయినా, ప్రమాదవశాత్తు గొర్రె మృతిచెందినా బీమా వర్తిస్తుంది. ఒకవేళ బీమా చేసిన గొర్రె మృతిచెందితే వెంటనే బీమా కంపెనీకి, పశువైద్యుడికి తెలియజేయాలి. పశువైద్యుడితో పోస్టుమార్టం చేయించి మరణ ధ్రువీకరణ పత్రాన్ని, గొర్రెకు వేసిన చెవిపోగును దరఖాస్తులతోపాటు 15రోజుల్లోగా బీమా కంపెనీకి అందజేయాలి. అనంతరం సదరు కంపెనీ గొర్రెల కాపరి బ్యాంకు ఖాతాకు నేరుగా డబ్బులు జమచేసి సమాచారాన్ని అందజేస్తుంది. ఇవి తప్పని సరిగా చూసుకోవాలి... గొర్రె మరణించిన వెంటనే ఇన్సూరెన్స్ కంపెనీ వారికి తెలియజేయాలి. అవ సరమైన సందర్భాల్లో కంపెనీ ప్రతినిధులు వివరాలు సేకరణ, ఫొటోలను తీసుకుని వెళేవరకు గొర్రె చనిపోయిన చోటే ఉంచాలి. కదిలించడం పక్కకి తీసుకుపోవడం చేయరాదు. బీమా కంపెనీ వేసే చెవిపోగు లేకపోతే బీమా వర్తించదు. ఒకే సారి ఒకటి కంటే ఎక్కువ గొర్రెలు చనిపోతే చనిపోయిన గొర్రెలతో పాటు కాపరి కూడా ఫొటో తీయించుకుని ఆ ఫొటోలను ఫిర్యాదుకు జతపరిచి బీమా కంపెనీకి పంపాల్సి ఉంటుంది.