సాక్షి, హైదరాబాద్: రైతుల మాదిరిగానే మత్స్యకారులకూ రూ.5లక్షల బీమా పథకం అమలు చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మత్స్యకారు(ముదిరాజ్)లను బీసీ–ఏలో చేరుస్తామని స్పష్టం చేశారు. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా సోమవారం గాంధీభవన్‌లో ఫిషరీ సెల్ చైర్మన్ మెట్టు సాయికుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రేవంత్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
వివిధ సామాజిక వర్గాల వారు ఆత్మగౌరవంతో బతకాలని కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని, కానీ ఎనిమిదేళ్లలో రాష్ట్రంలో కులవృత్తులు పూర్తిగా నిర్వీర్యమయ్యాయని విమర్శించారు. చేప పిల్లల పంపిణీని ప్రభుత్వం.. ఆంధ్రా కాంట్రాక్టర్లకు అప్పగిస్తోందని, తెలంగాణలోని మత్స్యకార సంఘాలు చేప పిల్లల పంపిణీకి పనికిరావా? అని ప్రశ్నించారు. నాసిరకం చేప పిల్లలు పంపిణీ చేసి పేదలను దోచుకుంటున్నారని, దీనిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మత్స్యకారుల సంక్షేమాన్ని కాంగ్రెస్ మేనిఫెస్టోలో చేరుస్తామని తెలిపారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ చేపపిల్లల పంపిణీ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన స్కీమేనని, తమ హయాంలో మత్స్యకార సంఘాల ద్వారా డిపార్ట్‌మెంట్ నుంచే పంపిణీ జరిగేదని గుర్తు చేశారు. ప్రచారం చేసుకునే అలవాటు కాంగ్రెస్ పార్టీకి లేదని, కానీ టీఆర్‌ఎస్ అన్నీ తానే తీసుకొచ్చినట్లు ప్రచారం చేసుకుంటోందని విమర్శించారు.
గన్‌పార్క్ వద్ద ఉన్న అమరవీరుల స్తూప రూపకర్త పద్మశ్రీ ఎక్కా యాదగిరిరావుని ప్రభుత్వం మర్చిపోయిందని ఎద్దేవా చేశారు. తమ పార్టీ నేతలు ఎక్కా యాదగిరిరావును పిలవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు షబ్బీర్ అలీ, చిన్నారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, మల్లు రవి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment