కనీస వేతనం 10 వేల కన్నా ఎక్కువే | Minimum wage More than 10 thousand | Sakshi
Sakshi News home page

కనీస వేతనం 10 వేల కన్నా ఎక్కువే

Published Mon, May 2 2016 3:10 AM | Last Updated on Sun, Sep 3 2017 11:12 PM

కనీస వేతనం 10 వేల కన్నా ఎక్కువే

కనీస వేతనం 10 వేల కన్నా ఎక్కువే

♦ హోం, కార్మిక మంత్రి నాయిని
♦ కేంద్రం ప్రకటించిన దానికంటే ఎక్కువ ఉండేలా చూస్తాం
♦ ఘనంగా మేడే వేడుకలు,పలువురికి అవార్డుల ప్రదానం
 
 సాక్షి, హైదరాబాద్: ‘‘దేశ వ్యాప్తంగా కనీస వేతనం రూ.10 వేలు ఉండేలా చట్టం చేస్తున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి దత్తాత్రేయ ప్రకటించారు. కానీ తెలంగాణలో కేంద్రం నిర్దేశించిన దాని కంటే అదనంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇక్కడ కనీస వేతనం రూ.10 వేల కంటే ఎక్కువగనే ఉంటది. మేడే సందర్భంగానే దీనిని ప్రకటించాలనుకున్నాం. కానీ అధికారుల బదిలీల కారణంగా సాధ్యం కాలేదు. ఈ నెలాఖరులోగా తీపి కబురు వింటరు’’ అని రాష్ట్ర హోం, కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి వెల్లడించారు. మేడే వేడుకలను పురస్కరించుకుని రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి నాయిని ప్రసంగించారు.

దేశంలోకెల్లా తెలంగాణ రాష్ట్రంలోనే కనీస వేతనం మెరుగ్గా ఉండేలా చూస్తున్నామని, ఇప్పటికే కంపెనీ యాజమాన్యాలు, ట్రేడ్ యూనియన్ నాయకులతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరుపుతోందని, ఈ నెలాఖరు లోగా తుది నిర్ణయం ప్రకటిస్తామని అన్నారు. తమ ప్రభుత్వం కార్మిక పక్షపాతిని, సంక్షేమ రంగం మీదనే రూ.35 వేల కోట్లు ఖర్చుపెడుతోంద న్నారు. కార్మికుల ప్రమాద బీమాను మేడే సందర్భంగా రూ.5 లక్షల నుంచి ఆరు లక్షలకు పెంచినట్లు చెప్పారు. కార్మికుల ఆరోగ్యం, భద్రత, నైపుణ్యం పెంపొందించేందుకు రూ.10 కోట్లతో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని భవన నిర్మాణ కార్మికులకు ఈఎస్‌ఐ సదుపాయం అమలు చేసేందుకు అధ్యయనం చేస్తున్నామన్నారు.

ఆదిలాబాద్ జిల్లాలో మూతపడిన పేపర్ మిల్లును తెరిపించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. అలాగే వరంగల్‌లో మూతపడిన పేపర్‌మిల్లును కూడా తెరిపిస్తామన్నారు. మేడే సందర్భంగా కార్మికులు దీక్షాదివస్‌కు పూనుకోవాలని మండలి చైర్మన్ స్వామిగౌడ్ వ్యాఖ్యానించారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా చంద్రబాబు ఉన్నప్పుడు కాంట్రాక్టు ఎబాలిషన్ బోర్డును రద్దు చేసి కార్మికుల హక్కులను కాలరాశారని ఎమ్మెల్సీ రాములు నాయక్ దుయ్యబట్టారు. కాంట్రాక్టు ఎబాలిషన్ బోర్డును తీసుకొచ్చి కార్మికులకు న్యాయం చేయాలని కోరారు. కాగా, మేడే వేడుకలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం బెస్ట్ మేనేజ్‌మెంట్, శ్రమశక్తి అవార్డులను అందజేసింది.

 శ్రమశక్తి అవార్డు గ్రహీతలు..
 కె.శ్రీనివాస్(సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూరు), బి.వెంకటేశం(ఎస్‌సీసీఎల్), మిరియాల రాజు రెడ్డి, ఇ.ఆగయ్య, కనకం శాంసన్, ఎం.శ్రీనివాసరావు, ఎండీ ప్యారేమియా(తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం), ఎం.రాజయ్య(హెచ్‌ఎంఎస్), ఇ.శ్రీధర్(టీఎస్‌ఈఈ), జె.జగన్నాథరావు(ఎస్‌పీపీ ఎంప్లాయిస్), వి.వరప్రసాదరెడ్డి(టీఆర్‌టీయూసీ), పి.జీవన్‌రావు (తెలంగాణ ఎన్‌టీపీసీ ఎంప్లాయిస్), వి.దానకర్ణాచారి (భారత్ డైనమిక్ తెలంగాణ ఎంప్లాయిస్), బీజే థామ్సన్(వీఎస్‌టీ వర్కర్), కె.ఐలయ్య(భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం), ఎస్.పద్మశ్రీ(హెచ్‌ఎంఎస్), పి.రాములు(ఎంఆర్‌ఎఫ్ వర్కర్), జి.రాంబాబు, బి.విజయలక్ష్మీ, వేముల మరయ్య(టీఆర్‌ఎస్ కేవీ), బీఆర్ సుబ్రమణ్యరావు(టీఎన్‌టీయూసీ), ఎన్.మహేశ్వర్‌రెడ్డి(డా.రెడ్డీస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎంప్లాయి), రూప్‌చంద్(తెలంగాణ షాపు ఎంప్లాయిస్ ఫెడరేషన్), ఐ.శ్రీనివాసరావు, కొండా మనోహర్ (హెచ్‌ఎంఎస్), ఎంఏ వజీర్ (తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయి), వి.శ్రీనివాస్(తెలంగాణ బీడీ వర్కర్స్) జె.అశోక్(తెలంగాణ ఫుడ్స్ అండ్ ఎంప్లాయిస్ స్టాఫ్), సీహెచ్ శంకర్(టీ-ఎలక్ట్రిసిటి ఎంప్లాయి)
 
 సింగరేణికి బెస్ట్ మేనేజ్‌మెంట్ అవార్డు
  2015-16 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థ 60.04 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించి 15 శాతం వృద్ధిరేటుతో జాతీయ బొగ్గు రంగ పరిశ్రమలకే తలమానికంగా నిలిచింది. బొగ్గు రవాణాలోనూ అగ్రస్థానంలో నిలిచి రికార్డులను తిరగరాసింది. కార్మికులకు సంక్షేమ కార్యక్రమాల అమలు, పారిశ్రామిక సంబంధాల విషయంలో సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ చూపిన చొరవకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం బెస్ట్ మేనేజ్‌మెంట్ అవార్డునిచ్చింది. మంత్రి నాయిని చేతుల మీదుగా శ్రీధర్ అవార్డు అందుకున్నారు. సింగరేణీయుల సహకారంవల్లే సంస్థ అభివృద్ధి సాధ్యమైందని ఈ సందర్భంగా ఆయనన్నారు.
 
 బెస్ట్ మేనేజ్‌మెంట్ అవార్డ్స్..
 1.సింగరేణి కాలరీస్ కో-లిమిటెడ్(ఎన్.శ్రీధర్, ఐఏఎస్), 2. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్(ఎన్.నారాయణరెడ్డి),3.మై హోం ఇండ్రస్ట్రీస్ ప్రై లిమిటెడ్(జె.రంజీత్ రావ్), 4.మిహీంద్రా అండ్ మహీద్రా(వీఎస్ రమణ, కేబీఎన్ రావు), 5.ఎంఆర్‌ఎఫ్(మైఖేల్ రబేరో), 6.పెన్నార్ (జె.నిరుపేందర్ రావు), 7.వీఎస్‌టీ ఇండస్ట్రీస్(ఎన్.సాయిశంకర్), 8.కిర్బీ బిల్డింగ్ సిస్టం (బి.సదానంద్, డి.రాజు) 9. టీజీఎన్ ఇండస్ట్రీస్(ఎంకే పటౌడియా), 10.హెచ్‌ఎస్‌ఐఎస్ లిమిటెడ్(డి.అరుణ్ కుమార్), 11.వసుధ ఫార్మా(ఎం.ఆనంద్), 12. ఐటీసీ లిమిటెడ్(ఎం.మురళీధర్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement