
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–2 అధికారి అయిన ఏఎం ప్రసాదరాజును కార్మిక శాఖ సహాయ కమిషనర్‌గా కొనసాగించాలని, లేదంటే కార్మిక శాఖ కమిషనర్ నెల రోజుల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని, రూ.2 వేలు జరిమా నా కూడా చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. అంతేకాకుండా ప్రసాదరాజుకు 2019 ఫిబ్రవరి నుంచి వేతనాన్ని 7 శాతం వడ్డీతో 6 వారాల్లోగా చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ కోర్టు తీర్పుచెప్పింది. ఏఎం ప్రసాదరాజు ఉమ్మడి ఏపీలోని ఏపీపీఎస్సీ–2005 గ్రూప్–2 కేడర్ అధికారి. 2018లో వరంగల్‌లో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తించారు.
అయితే 2005 నాటి గ్రూప్–2 అధికారుల లిస్ట్‌ను సవరించేసరికి ప్రసాదరాజు పేరు జాబితాలో గల్లంతయ్యింది. జోన్ 4లో ఏపీలోని కర్నూలుకు డిప్యూటీ కేడర్ లిస్ట్‌లో ఆయన పేరు చేరింది. దీంతో ప్రసాదరాజును 2018 జూన్ 29న తెలంగాణ కార్మిక శాఖ కమిషనర్ రిలీవ్ చేశారు. గ్రూప్–2 అధికారులు సుప్రీంను ఆశ్రయించడంతో కోర్టు స్టేటస్ కో ఉత్తర్వులిచ్చింది. దీం తో ప్రసాదరాజును కర్నూలులో విధుల్లో చేర్చుకునేందుకు అక్కడి అధికారులు నిరాకరించారు. ఈ నేప థ్యంలో ప్రసాదరాజు హైకోర్టును ఆశ్రయించారు. ప్రసాదరాజును అసిస్టెం ట్ లేబర్ ఆఫీసర్‌గా కొనసాగించాలని ప్రభుత్వానికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.
ఈ ఉత్తర్వులను ప్రభుత్వం అమలు చేయకుండా కోర్టు ధిక్కారానికి పాల్పడిందని తిరిగి ప్రసాదరాజు హైకోర్టును ఆశ్రయించారు. ఒకసారి తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ చేశాక తమకు సంబంధం లేదని తెలంగాణ సర్కార్ వాదించింది. ఈ వాదనల తర్వాత తామిచ్చిన ఉత్తర్వులను ప్రభుత్వం అమలు చేయకపోవడాన్ని హైకోర్టు ఆక్షేపించింది. సుప్రీంకోర్టు తుది ఉత్తర్వులు జారీ చేసే వరకూ ప్రసాదరాజును విధుల్లోకి తీసుకోవాలని, ఉపాధి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి, కార్మిక శాఖ కమిషనర్, సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శులు కోర్టు ఖర్చుల నిమిత్తం పిటిషనర్‌కు రూ.25 వేలు చొప్పున చెల్లించాలని జస్టిస్ ఎమ్మెస్ రామచంద్రరావు, పి. కేశవరావులతో కూడిన ధర్మాసనం తీర్పు చెప్పింది.