
జూలై 19న ‘ఆర్టీసీ’ ఎన్నికలు
- షెడ్యూల్ ప్రకటించిన రిటర్నింగ్ అధికారి
- ఈనెల 25న తుది ఓటర్ల జాబితా ప్రకటన
- అమలులోకి ఎన్నికల నియమావళి
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మిక సంఘం ఎన్నికలకు ముహూర్తం ఖరారైంది. జూలై 19న ఎన్నికలు నిర్వహించాలని రిటర్నింగ్ అధికారి గంగాధర్ ప్రకటించారు. జూన్ 1 నాటికి ఆర్టీసీ మస్టర్స్‌లో పేరు నమోదై ఉండి కనిష్టంగా ఆరు మాసాల సర్వీసు పూర్తి చేసుకున్న కార్మికులు ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంటుంది. సోమవారం 12 కార్మిక సంఘాలతో గంగాధర్ సమావేశమై.. ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. జూన్ 13న ఓటర్ల జాబితా ప్రకటిస్తారు. కార్మిక సంఘాల నుంచి వచ్చే అభ్యంతరాలను ఈనెల 17న స్వీకరించి వాటి ఆధారంగా మార్పుచే ర్పులు చేసి ఈనెల 25న తుది ఓటర్ల జాబితాను విడుదల చేస్తారు.
ఈనెల 30న కార్మిక సంఘాలకు ఎన్నికల గుర్తులు కేటాయిస్తారు. జూలై 19న ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అన్ని డిపోలు, వర్క్‌షాపులు, కార్యాలయాల్లో ఓటింగ్‌కు అవకాశం ఉంటుంది. ఆరోజు విధి నిర్వహణలో ఉండి ఓటు హక్కు వినియోగించుకోలేనివారు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయొచ్చు. 19న పోలింగ్ ముగిసిన వెంటనే సాయంత్రం కౌంటింగ్ నిర్వహిస్తారు. అయితే పోస్టల్ బ్యాలెట్‌కు జూలై 25, 26 తేదీలను కేటాయించినందున అధికారికంగా ఎన్నికల ఫలితాలను ఆగస్టు 6న ప్రకటిస్తారు. కానీ 19న రాత్రికే అనధికారికంగా విజేతల వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
టీఎస్ ఆర్టీసీలో తొలి ఎన్నికలు...
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారి ఆర్టీసీ కార్మిక సంఘం ఎన్నికలు జరగబోతున్నాయి. గత ఎన్నికలు ఉమ్మడి రాష్ట్రంలో 2012 డిసెంబర్‌లో జరిగాయి. ఆ ఎన్నికల్లో ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్- తెలంగాణ మజ్దూర్ యూనియన్లు పొత్తుపెట్టుకుని సంయుక్త విజేతలుగా నిలిచాయి. రెండేళ్ల పాటు గుర్తింపు కార్మిక సంఘంగా కొనసాగగా, 2014తో గడువు పూర్తయింది. రాష్ట్ర విభజన, కార్మిక సంఘాల మధ్య అంతర్గత విభేదాలు, సకాలంలో కార్మిక శాఖ స్పందించకపోవటం తదితర కారణాల వల్ల ఎన్నికల్లో జాప్యం జరుగుతూ వచ్చింది. ఈసారి మొత్తం 12 సంఘాలు ఎన్నికల బరిలో నిలుస్తున్నాయి.
11 సంఘాలు టీఎస్ ఆర్టీసీ పేరుతో పోటీ పడుతుండగా, ఏపీఎస్ ఆర్టీసీ ఎన్‌ఎంయూ తె లంగాణ శాఖ పేరుతో 12వ సంఘం కోర్టు అనుమతితో బరిలో నిలువనుంది. టీఎస్ ఆర్టీసీ ఎన్‌ఎంయూ పేరుతో ఓ సంఘం తొలి 11 సంఘాల్లో ఒకటిగా ఉంది. కార్మికుల సంక్షేమం కోసం గుర్తింపు సంఘం కూటమిగా బాగా పనిచేశామని ఈయూ, టీఎంయూ చెప్పుకొంటుండగా... అవినీతికి పాల్పడడం, కార్మికుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించి నేతలు ప్రభుత్వానికి కొమ్ముకాశారంటూ ఇతర సంఘాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. మరోవైపు ఎన్నికల షెడ్యూలు ప్రకటనతో ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చినట్టయింది. ఓటర్లను ప్రభావితం చేసే ఎలాంటి నిర్ణయాలను ఆర్టీసీ యాజమాన్యం తీసుకునే అవకాశం లేదు.