మోడల్ షాప్ చట్టానికి కేంద్ర కేబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ: రాత్రి11 అయితే దుకాణాలు కట్టేస్తారన్న ఆందోళన ఇకపై అక్కర్లేదు. ఇకపై 24 గంటలు, 365 రోజులూ దుకాణాలు తెరిచి ఉంచేలా ‘ద మోడల్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ఉద్యోగం, సేవల వసతి నియంత్రణ) చట్టం-2016’ కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని ప్రకారం.. పదిమంది కంటే ఎక్కువ మంది ఉద్యోగులున్న దుకాణాలు, కంపెనీలు (తయారీ సంస్థలు తప్ప) ఏడాదిపాటు దుకాణాలు తెరిచి ఉంచుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు దుకాణాలు తెరుచుకోవచ్చు. దీంతో పాటు సరైన భద్రత కల్పించటం ద్వారా రాత్రి షిఫ్టులో మహిళలను పనిలో పెట్టుకోవచ్చు.
ఇవన్నీ చేయాలంటే ఉద్యోగులందరికీ సరైన తాగునీరు, క్యాంటీన్, శిశు సంరక్షణ కేంద్రం, ప్రాథమిక చికిత్సతోపాటు మరుగుదొడ్డిని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కేబినెట్ ఆమోదించిన ఈ బిల్లుకు పార్లమెంటు ఆమోదం అక్కర్లేదు. ఇది నేరుగా అమల్లోకి వస్తుంది. దీని వల్ల దుకాణ, కంపెనీ యజమానులు మరిన్ని ఎక్కువ గంటలు కార్యకలాపాలు నడపటం ద్వారా ఎక్కువ ఉపాధి పెరిగేందుకు అవకాశం ఉంటుందని కేంద్రం భావిస్తోంది. అన్ని రాష్ట్రాలు దీన్ని అమల్లోకి తీసుకురావటం ద్వారా దేశమంతా ఉద్యోగుల నిబంధనల విషయంలో సమరూపత వస్తుందని కేంద్రం తెలిపింది. కార్మిక శాఖ చేసిన ఈ ప్రతిపాదనలను రాష్ట్రాలు తమకు అనుకూలంగా స్వల్ప మార్పులతో స్వీకరించవచ్చని అధికారులు తెలిపారు.
నిర్ణయం భేష్: రిటైలర్లు, థియేటర్లు: దుకాణాలు, కంపెనీలను 24 గంటలు తెరిచి ఉంచుకోవచ్చన్న కేంద్ర కేబినెట్ నిర్ణయాన్ని దుకాణాలు, మాల్స్, సినిమా హాళ్ల యాజమాన్యాలు స్వాగతించాయి. దీని వల్ల దేశ రిటైల్ రంగంలో సరికొత్త మార్పులు వస్తాయని.. వేల మంది నిపుణులకు ఉద్యోగాలు లభిస్తాయన్నాయి. దీంతోపాటు వినియోగదారులకు చాలా మేలు జరుగుతుందన్నాయి. షాపర్స్ స్టాప్, వాల్‌మార్ట్ వంటి పెద్ద సంస్థలు కూడా కేంద్ర కేబినెట్ నిర్ణయాన్ని స్వాగతించాయి. హైదరాబాద్ సహా ఎనిమిది చోట్ల ఏర్పాటుచేయనున్న కొత్త ఐఐటీల ఏర్పాటు (నిర్మాణానికి)కు సవరించిన ఖర్చు అంచనాలకు(గతం కంటే రెట్టింపు నిధులు) కేబినెట్ ఓకే తెలిపింది.
ఇక 24 గంటలూ మాల్స్, హాల్స్
Published Thu, Jun 30 2016 12:59 AM | Last Updated on Mon, Sep 4 2017 3:43 AM
Advertisement
Advertisement