
నిరుద్యోగ భృతి ఇవ్వలేం
- కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడి
- తాత్కాలిక సచివాలయంలో పేషీ ప్రారంభం
సాక్షి, అమరావతి: నిరుద్యోగ భృతి ఇవ్వలేమని కార్మిక శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు కుండబద్దలు కొట్టేశారు. ఆదివారం ఉదయం వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో మంత్రి తన పేషీని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిరుద్యోగులకు భృతి ఇవ్వాలనే ఎన్నికల హామీ ఏమైందని విలేకరులు ప్రశ్నించగా మంత్రి పై విధంగా వ్యాఖ్యానించారు. ఇతర రాష్ట్రాల్లో నిరుద్యోగులకు ఇచ్చే భృతిపై అధ్యయనం చేశామని, చాలా తక్కువగా ఇస్తున్నారన్నారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించే అంశాలపైనే ఎక్కువ దృష్టిపెట్టామన్నారు. ఇందుకోసం యూత్‌పాలసీని తీసుకు రావాలని భావిస్తున్నట్లు చెప్పారు.
ఎస్సీ సబ్‌ప్లాన్ మాదిరి యూత్ సబ్‌ప్లాన్ కూడా తీసుకు రావాలని సీఎం వద్ద ప్రతిపాదన పెడుతున్నట్లు చెప్పారు. అందుకు సంబంధించిన ప్రతిపాదనపై కొత్త సచివాలయంలోని తన కార్యాలయంలో మొదటి సంతకం చేశారు. యువతకు ఉపాధి కోసం నైపుణ్య శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. శిక్షణ పూర్తి చేసిన వారికి ఉద్యోగావకాశాలు వస్తాయన్నారు. కాగా ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కూడా వెలగపూడిలో తన కార్యాలయాన్ని ప్రారంభించారు.