సాక్షి, అమరావతి: ‘కార్మిక శాఖ మంత్రిగా పని చేసిన కాలంలో అచ్చెన్నాయుడు అధికార దర్పంతో ఇచ్చిన లేఖలు లెక్కలేనన్ని అక్రమాలకు బీజం వేశాయి. అధికారులపై ఆయన ఒత్తిడి తెచ్చి, గుర్తింపులేని సంస్థలకు కాంట్రాక్టులు కట్టబెట్టేలా చేశారు. ఆయన ఇచ్చిన మూడు లేఖలే ఏకంగా రూ.150 కోట్ల అవినీతికి ఊతమిచ్చాయి’ అని ఏసీబీ అధికారులు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. ఈఎస్‌ఐ కుంభకోణం కేసులో టీడీపీ నేత అచ్చెన్నాయుడుపై ఏసీబీ అధికారులు ఐపీసీ 409, 420, 120(బి) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆయనకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. అధికార దుర్వినియోగం, నిధుల దుర్వినియోగానికి పాల్పడేలా మందులు, పరికరాల కొనుగోళ్లు, టెలీ హెల్త్ సర్వీసెస్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకునేలా ఈఎస్‌ఐ అధికారులపై వత్తిడి తెస్తూ అచ్చెన్నాయుడు రాసిన మూడు లేఖలతోపాటు పలు ఆధారాలను ఏసీబీ అధికారులు రిమాండ్ రిపోర్టుకు జత చేశారు. రిమాండ్ రిపోర్టులో అంశాలు ఇలా ఉన్నాయి.
– టెలీ హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు కాంట్రాక్టులు ఇవ్వాలని కార్మిక శాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు మూడుసార్లు ఒత్తిడి చేశారు. 2016 అక్టోబర్ నుంచి నవంబర్‌లోగా అప్పటి డైరెక్టర్ రమేష్‌కుమార్‌కు మూడుసార్లు లేఖలు ఇచ్చారు.
– ఎటువంటి టెండర్లు పిలవకుండా, నిబంధనలు పాటించకుండా టెలీ హెల్త్ సర్వీసెస్‌కు నామినేషన్ పద్ధతిలో కేటాయించడం వెనుక అచ్చెన్నాయుడు ఒత్తిడే కారణం.
– అచ్చెన్నాయుడు ఆదేశాల మేరకే రూ.4.15 కోట్లను విడుదల చేశామని అప్పటి ఈఎస్‌ఐ డైరెక్టర్ డాక్టర్ రమేశ్ కుమార్ తెలిపారు.
– నిబంధనలను పాటించకుండానే టెలీ హెల్త్ సర్వీసులకు కాంట్రాక్టులు ఇచ్చారు. దీనికి ఆర్థిక శాఖ అనుమతి కూడా తీసుకోలేదు. బడ్జెట్ ఆమోదం కూడా లేదు. కాంట్రాక్టు పొందిన సంస్థకు గత అనుభవం కూడా లేదు.
– మంత్రిగా పనిచేసిన అచ్చెన్నాయుడు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనకు చాలా పలుకుబడి ఉంది. ఈ కేసులో చాలా మందిని విచారించాల్సి ఉంది. సాక్ష్యాలను, డాక్యుమెంట్లను సేకరించాల్సి ఉంది. అయితే అచ్చెన్నాయుడి పలుకుబడి ఈ కేసుపై ప్రభావం చూపే ప్రమాదం ఉంది.
– ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కేసులో మొదటి నిందితుడు డాక్టర్ రమేశ్‌కుమార్, రెండవ నిందితుడు అచ్చెన్నాయుడులకు జ్యుడీషియల్ రిమాండ్ విధించాలి.
లేఖతో.. లెక్కలేనన్ని అక్రమాలు
Published Sun, Jun 14 2020 4:28 AM | Last Updated on Sun, Jun 14 2020 1:40 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment