
రాబడులుంటే మరిన్ని పెట్టుబడులు
స్టాక్ మార్కెట్‌లో ఈపీఎఫ్‌ఓ
ఇన్వెస్ట్‌మెంట్స్‌పై దత్తాత్రేయ
న్యూఢిల్లీ : స్టాక్ మార్కెట్లో వచ్చే ఏడాది మార్చి కల్లా రూ.5,000-6,000 వరకూ ఈపీఎఫ్‌ఓ పెట్టుబడులు పెడుతుందని కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడించారు. ఈ పెట్టుబడులపై వచ్చే రాబడులను పరిశీలించిన తర్వాతనే మరిన్ని పెట్టుబడులు పెట్టే విషయం ఆలోచిస్తామని ఈపీఎఫ్‌ఓ ట్రస్టీ బోర్డ్‌కు అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్న ఆయన వెల్లడించారు. ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్‌ఓ) స్టాక్ మార్కెట్లో పెట్టుబడులను 5 శాతం నుంచి 15 శాతానికి పెంచాలని ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా వ్యక్తం చేసిన అభిప్రాయానికి దత్తాత్రేయ స్పందించారు. ఈపీఎఫ్‌ఓ పెట్టుబడులు పెట్టడం వల్ల స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు తగ్గుతాయని జయంత్ అభిప్రాయపడ్డారు.
జాగ్రత్తగా వ్యవహరిస్తాం..
ఇప్పటివరకూ పెట్టిన పెట్టుబడుల ఫలితాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే తదుపరి పెట్టుబడులు పెంచడాన్ని పరిశీలిస్తామని దత్తాత్రేయ స్పష్టం చేశారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల విషయమై చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తామని పేర్కొన్నారు. రిటైర్మెంట్ నిధి, ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్‌ఓ) స్టాక్ మార్కెట్లో ఈ ఆర్థిక సంవత్సరంలో 5 శాతం నిధులను ఇన్వెస్ట్ చేసిన విషయం తెలిసిందే.